Nagabandham Review : ‘నాగబంధం’ రివ్యూ.. విజువల్స్ బాగున్నాయి కానీ..
నాగబంధం టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. (Nagabandham Review)
Nagabandham Review
Nagabandham Review : విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘నాగబంధం’. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మాణంలో అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగబంధం సినిమా జూలై 3న రిలీజ్ కాబోతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
1962లో హిమాలయాల్లో టెస్లా, అలీ(రిషభ్ సావ్నీ) కలిసి నాగబంధం అనే పుస్తకం కోసం వెతుకుతుంటారు. అది దొరకడంతో టెస్లా నాగబంధం తీసుకెళ్లి ఆర్కియాలజీ స్పెషలిస్ట్ ప్రభాకర్(జగపతిబాబు)కి ఇస్తాడు. అలీని అక్కడ ఓ భైరాగి వశం చేసుకొని ఆ పుస్తకం, బ్రహ్మకమలం కోసం పంపిస్తాడు. రుద్ర(విరాట్ కర్ణ) ఓ అనాథ అయినా తనని పెంచిన ఫ్యామిలీతో హ్యాపీగా జీవిస్తుంటాడు. శ్రీరంగపురంకి వెళ్లిన రుద్ర పార్వతి(నభా నటేష్) ప్రేమలో పడతాడు. అక్కడ ఉండే రంగనాథస్వామి ఆలయంలో స్వామివారి నాభిలో ఉండే పద్మంలో బ్రహ్మకమలం ఉంటుంది. దాన్ని ప్రభాకర్ మనిషి దొంగతనం చేసి తెచ్చివ్వడంతో అది తీసుకొని వెళ్తుండగా పాములు అడ్డుకుంటాయి. ఆ బ్రహ్మ కమలం కోసం కొంతమంది వెతుక్కుంటూ వచ్చి భైరవకోన నీళ్ళల్లో పడిపోయిందని రుద్రని డబ్బు ఆశ చూపించి సాయం అడుగుతారు.
తన చెల్లి మానస(సోనియా సింగ్) పెళ్లి కోసం డబ్బు కావాల్సి రావడంతో ఒప్పుకొని వాళ్ళని తీసుకెళ్తాడు. కానీ రుద్రకు కూడా దొరికినట్టే దొరికి ఆ బ్రహ్మ కమలం మిస్ అవుతుంది. మరి ఆ బ్రహ్మ కమలం ఎక్కడుంది? రుద్ర బ్రహ్మ కమలం కోసం ఏం చేస్తాడు? అసలు ఆ బ్రహ్మ కమలంతో ఏం చేస్తారు? 1756లో జరిగిన కథకు 1962లో జరిగే కథకు సంబంధం ఏంటి? హిమాలయాల్లో ఉండే భైరాగి ఎవరు? అసలు బ్రహ్మ కమలంను దొంగతనం చేసింది ఎవరు? నాగబంధం బుక్ లో ఏముంది? రుద్ర – పార్వతి కథ ఏమైంది? అసలు పార్వతి ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Super Subbu Review : ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ రివ్యూ.. సె*క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సందీప్ కిషన్..
సినిమా విశ్లేషణ..
నాగబంధం టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. స్టార్ క్యాస్ట్ ఎవరూ లేకపోయినా భారీ బడ్జెట్, భారీ సెట్స్ వేసి, అనంత పద్మనాభ స్వామి విగ్రహంతో డివోషనల్ థ్రిల్లర్ అని బాగా ప్రమోట్ చేయడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.
ఫస్ట్ హాఫ్ అంతా 1962 లో జరుగుతుంది. బ్రహ్మ కమలం, నాగబంధం కోసం ఎవరెవరు ట్రై చేస్తారు, రుద్ర ఫ్యామిలీ ట్రాక్, బ్రహ్మ కమలం కోసం ప్రయత్నాలు చేయడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి ఓ యాక్షన్, ఎమోషనల్ సీక్వెన్స్ తో పాటు ఓ ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ రుద్ర ఏం చేస్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో బ్రహ్మ కమలం కోసం వెతుక్కుంటూ వెళ్లిన రుద్రకు కొన్ని ఆసక్తికర నిజాలు తెలుస్తాయి. ఆ ఊహించని ట్విస్ట్ లు బాగుంటాయి. సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ 1756లో ఇదే బ్రహ్మ కమలం చుట్టూ కథ తిరుగుతుంది. క్లైమాక్స్ యాక్షన్ తో పాటు డివోషనల్ ఎలివేషన్స్ తో హైప్ ఇస్తారు.
ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా సాగదీసినట్టు ఉంటుంది. హీరో చుట్టాలుగా అనసూయ ఫ్యామిలీ ట్రాక్ అసలు కథకు సంబంధం లేకపోయినా ఆ సీన్స్ తో సాగదీశారు. కథ సీరియస్ గా మొదలయిన తర్వాత అక్కర్లేని రొమాంటిక్ లవ్ సాంగ్ వస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఫ్యామిలీ ఎమోషన్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. ఇక సెకండ్ హాఫ్ మొదట్లో నాగబంధం, బ్రహ్మ కమలం కోసం ఎవరు ట్రై చేస్తున్నారు అని చెప్పే ట్విస్టులు మాత్రం అదిరిపోతాయి. 1756 లో చూపించే సీన్స్ కూడా బాగుంటాయి. క్లైమాక్స్ రొటీన్ యాక్షన్, డివోషనల్ టచ్. సినిమా మొత్తం AI బాగానే వాడారు. లాస్ట్ లో కూడా AI తో శివుడిని తీసుకొచ్చారు.
కొడుతున్నారు, చంపేస్తున్నారు అంటే హీరో తిరిగి కొట్టాలి అని మనకు అనిపిస్తుంది కానీ ప్రతిసారి అందరూ చనిపోయిన తర్వాతే హీరో లెగిసి కొట్టడం ఏంటో అర్ధం కాదు. సినిమాలో ఎమోషన్ ఇంకాస్త బలంగా పండాలి. కథ డివోషనల్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేసారు కానీ అది ఫోకస్ గా నడిపించలేదు. హిందూ మతం, సనాతన ధర్మం గురించి ఓ రెండు మూడు సార్లు డైలాగ్స్ తో చెప్పించారు. సనాతన ధర్మం కథలో చూపించకుండా డైలాగ్స్ తో చెప్పడం విశేషం. ఇక నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్, అనంత పద్మనాభ స్వామి అని ప్రమోట్ చేయడంతో ఏదో ఓ రేంజ్ లో ఊహించుకొని వెళ్తాము. కానీ కథలో అంత స్కోప్ ఉన్నా అసలు కథ వదిలేసి అక్కర్లేని ట్రాక్స్, డైలాగ్స్ తో నడిపించారు.
ఇక సినిమా అంతా నాగబంధం వెనక ఏముంటుంది అని నడిపించి అసలు అదేంటో ఎక్కడా చెప్పకుండానే సినిమా ముగించడం గమనార్హం. అది తెలుసుకోవాలంటే పార్ట్ 2 వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. హీరో శివుడి పాత్ర అని ప్రమోషన్ చేసారు కానీ అది జస్ట్ హైప్ కోసమే, ప్రమోషన్ కోసమే అని సినిమా చూసాక క్లారిటీ వస్తుంది. ఇదే కథ, కథనం కాస్త ఎడిట్ చేసి ఇంకాస్త సస్పెన్స్ గా నడిపించే విధంగా కొన్ని సీన్స్ రాసుకునే స్కోప్ ఉంది. ఈ సినిమా చూస్తుంటే అక్కడక్కడా చిరంజీవి అంజి సినిమాతో పాటు పలు డివోషనల్ థ్రిల్లర్ సినిమాలు గుర్తుకు రావడం ఖాయం.

నటీనటుల పర్ఫార్మెన్స్..
విరాట్ కర్ణ రుద్ర, నాగసాధువు పాత్రలో బాగా నటించాడు. ఈ పాత్రల కోసం బాగా కష్టపడినట్టు తెరపై కనిపిస్తుంది. విలన్ గా బాలీవుడ్ నటుడు రిషభ్ సావ్నీ అలీ, ముస్లిం రాజు రెండు పాత్రల్లో చాలా బాగా నటించాడు. ఈ సినిమా తర్వాత రిషభ్ సావ్నీ కి తెలుగులో విలన్ పాత్రలు మరిన్ని రావొచ్చు. నభా నటేష్ కూడా డ్యూయల్ రోల్ లో బాగానే నటించింది. సాంప్రదాయమైన అమ్మాయి పాత్రలో బాగానే నటించి మెప్పించడమే కాక నభా ఓ సాంగ్ లో భారీగా అందాలు ఆరబోయడం గమనార్హం.
యూట్యూబ్ స్టార్, ఇప్పుడిప్పుడే సినిమాల్లో పాత్రలు చేస్తున్న సోనియా సింగ్ కి మంచి చెల్లి పాత్ర పడింది. సోనియాకు కూడా ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు రావడం ఖాయం. అనసూయ కాసేపు కనిపించి పర్వాలేదనిపించింది. అంకిత్ కొయ్య, శరణ్య, జాన్ విజయ్, దక్ష నగర్కర్, మురళి శర్మ, ఐశ్వర్య మీనన్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించి మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా కూడా రెండు కాలాల్లో రెండు పాత్రల్లో బాగానే మెప్పిస్తుంది.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నమో సాంగ్ ఒక్కటే మెప్పిస్తుంది. మిగిలిన పాటలేవి వర్కౌట్ అవ్వలేదు. ఒక మంచి కథ, కథనం తీసుకున్నా దానికి అక్కర్లేని సీన్స్, డైలాగ్స్ తో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సాంకేతికంగా మాత్రం దర్శకుడు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. గ్రాఫిక్స్, VFX విషయంలో ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ ఇస్తే బాగుండేది. కొన్నిచోట్ల అవి గ్రాఫిక్స్, VFX అని ఈజీగా తెలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగా కష్టపడ్డారు. సెట్స్ అద్భుతంగా వేశారు. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా కూడా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘నాగబంధం’ సినిమా బ్రహ్మ కమలం కోసం విలన్ చేసే ప్రయత్నం, దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అని సనాతన ధర్మం మెసేజ్ తో సాగుతుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
