బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న అభిమానికి నాగ్ ఫోన్.. చనిపోయినా పర్వాలేదంటూ ఎమోషనల్ అయిన లక్షీ..

  • Published By: sekhar ,Published On : August 28, 2020 / 09:01 PM IST
బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న అభిమానికి నాగ్ ఫోన్.. చనిపోయినా పర్వాలేదంటూ ఎమోషనల్ అయిన లక్షీ..

Updated On : August 29, 2020 / 8:42 PM IST

Nagarjuna call to fan: కింగ్ నాగార్జున తాజాగా తన అభిమానికి ఫోన్ చేసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెల్లూరుకు చెందిన లక్ష్మీ, ఆమె కుటుంబమంతా అక్కినేని కుటుంబానికి వీరాభిమానులు.. లక్ష్మీ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. గతకొద్ది కాలంగా ఆమె ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు సర్జరీ జరిగింది. కొద్దిరోజుల్లో ఫైనల్ సర్జరీకి వెళ్లనున్నారు. అభిమానుల ద్వారా విషయం తెలుసుకున్న నాగార్జున జూమ్ ద్వారా వీడియో కాల్ చేసి లక్ష్మీని ప్రేమతో పలకరించారు. పరామర్శించి ధైర్యం చెప్పారు.

నాగ్ కాల్ చేయడంతో ఆమెకు ఆనందంతో మాటలు రాలేదు.. ‘‘మీ ఫాదర్ నుంచి మా ఫ్యామిలీ మొత్తం మీ కుటుంబానికి అభిమానులం.. సార్.. మీరు కాల్ చేశారు.. ఈజన్మకిది చాలు.. చనిపోయినా పర్వాలేదు’’ అంటూ ఆమె భావోద్వేగానికి గురవగా..

‘‘ఎందుకు చనిపోతారండీ, చనిపోరు.. బాగుంటారు’’.. అంటూ నాగ్ ఆమెను ఓదార్చారు. అక్కినేని అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లక్ష్మీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.