‘‘కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’’…

BalaKrishna Thanks to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి యన్.టి.రామారావు జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలిసేలా పదవ తరగతి పాఠ్యపుస్తకాల్లో ప్రచురించడం పట్ల కేసీఆర్‌కు బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ ద్వారా బాలకృష్ణ స్పందించారు. పుస్తకంలోని పాఠ్యాంశాలకు సంబంధించిన పేజీల ఫొటోలను కూడా బాలకృష్ణ షేర్ చేశారు.
‘‘కళకి, కళాకారులకి విలువను పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ, అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అని అన్నారు నందమూరి బాలకృష్ణ.