నంది అవార్డులు ఇస్తామని స్పష్టంగా ప్రకటించాం.. దానికో క్యాలెండర్ తయారు చేసుకున్నాం: మంత్రి కందుల దుర్గేశ్
"వాళ్ల పాలనలో నంది నాటకోత్సవాలు లేవు. నంది అవార్డులు లేవు. ప్రతీదీ పక్కనపెట్టేశారు" అని వైసీపీని విమర్శించారు.

ఏపీలో కూటమి సర్కార్ పాలనకు సరిగ్గా ఏడాది అవుతోంది. అఖండ విజయాన్ని అందించిన ప్రజల ఆకాంక్షలకు పట్టం కడుతూ పరిపాలన సాగిస్తోంది ఏపీ ప్రభుత్వం. కూటమి ఏడాది పరిపాలనపై 10TV మెగా ఈవెంట్ “Shining AP” నిర్వహించింది. ఇందులో భాగంగా ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మినిస్టర్ కందుల దుర్గేశ్ మాట్లాడారు.
“ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి. సినిమా రంగంలో ఉండే ఇబ్బందుల గురించి ఆయనకు తెలుసు. సినిమా రంగం కంటే సినిమా రంగంలో జరగాల్సిన సంస్కరణల గురించే పవన్ ఎక్కువగా మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాతలను పిలిచి మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.
మాజీ సీఎం జగన్ సినిమా రంగంలోని పెద్ద పెద్ద హీరోలను కించపర్చారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టాలన్న సంస్కారం కూడా లేకుండా ప్రవర్తించారు. చంద్రబాబు ఎన్నో ఏళ్లుగా సినిమా రంగానికి సహకారం అందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి సినీ రంగానికి చెందిన వ్యక్తే. సహకారం అందించేందుకు సానుకూలంగా మేము ఉన్నాం.. దాన్ని సినిమా రంగం వాళ్లు అందిపుచ్చుకోవాలి. నేను గతంలో వారికి ఓ లెటర్ కూడా రాశాను. వచ్చి చర్చిస్తే సమస్యలను పరిష్కరించుకుందాం.
Also Read: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ఏడాదిలో ఇన్ని పనులు చేశాం: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
గత వైసీపీ హయాంలో ఐదేళ్లు ఉగాది పురస్కారాలు పక్కనపెట్టింది. కందుకూరి వీరేశలింగం పంతులు పేరు మీద తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ఏడాది జరుపుకున్నాం. వాటిని కూడా వైసీపీ సర్కారు పక్కన పెట్టేసింది. వాళ్ల పాలనలో నంది నాటకోత్సవాలు లేవు. నంది అవార్డులు లేవు. ప్రతీదీ పక్కనపెట్టేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉగాది పురస్కారాలు, కళారత్న బిరుదులు ఇచ్చాం. కళాకారులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాం. కందుకూరి వీరేశలింగం పంతులు పేరు మీద తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని నిర్వహిస్తూ అవార్డులు ఇచ్చాం. నవంబరులో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని అదే వేదికపై ముఖ్యమంత్రి ప్రకటించారు. నంది అవార్డులు కూడా ఇస్తామని స్పష్టంగా ప్రకటించాం. దానికో క్యాలెండర్ కూడా తయారు చేసుకున్నాం” అని కందుల దుర్గేశ్ తెలిపారు.
కూటమి ఏర్పాటుకు పవన్ కల్యాణ్‌ది కీలక పాత్ర అని కందుల దుర్గేశ్ చెప్పారు. జనసేన పార్టీ 21 సీట్లు గెలవడానికి కారణాలు, పవన్ కల్యాణ్‌పై తనకు ఉన్న నమ్మకం ఏంటి? ఏడాది పాలనలో పర్యాటక రంగంలో తాము సాధించిన విజయాలు, రాజమండ్రి రూపురేఖలను ఏ విధంగా మార్చబోతున్నారు వంటి అంశాలను ఆయన వివరించారు.
పూర్తి వివరాలు