Court : ‘కోర్ట్’ మూవీ రివ్యూ.. పోక్సో చట్టం గురించి.. కచ్చితంగా చూడాల్సిన సినిమా..

ఈ సినిమాని ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్, స్టూడెంట్స్ చూడాలి.

Court : ‘కోర్ట్’ మూవీ రివ్యూ.. పోక్సో చట్టం గురించి.. కచ్చితంగా చూడాల్సిన సినిమా..

Nani Priyadarshi Court State Vs A Nobody Move Review and Rating

Updated On : March 13, 2025 / 11:28 AM IST

Court Movie Review : ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, హర్ష వర్ధన్, శివాజీ, రోహిణి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ట్యాగ్ లైన్. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా రామ్ జగదీశ్ దర్శకత్వంలో కోర్ట్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మార్చ్ 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే పలు చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే.. ఈ కథ అంతా వైజాగ్ లో 2013లో జరుగుతుంది. ఇంటర్ చదివి పార్ట్ టైం జాబ్స్ చేసుకునే చందు(హర్ష రోషన్), ఇంటర్ సెకండియర్ చదువుతున్న జాబిలి(శ్రీదేవి) ప్రేమలో పడతారు. శ్రీదేవి మామయ్య మంగాపతి(శివాజీ) పరువు కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన అంటే ఇంట్లో అందరికి భయమే. జాబిలిని చందు తన ఇంట్లో అమ్మ, చెల్లికి పరిచయం చేయడంతో అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటుంది. చందు – జాబిలి విషయం మంగాపతికి తెలియడంతో జాబిలి చందు ఇంట్లో ఉన్నప్పుడు జాబిలి ఫ్యామిలీతో పాటు పోలీసులని తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేయిస్తాడు. మంగాపతి చందుపై రకరకాల కేసులు పెట్టిస్తాడు.

అయితే శ్రీదేవికి ఇంకా 18 ఏళ్ళు రాకపోవడంతో పోక్సో కేసు కూడా పెట్టిస్తాడు. చందు మనుషులు ఓ లాయర్ ని పెట్టుకున్నా అతను కూడా మంగాపతికి అమ్ముడుపోతాడు. నాలుగు రోజుల్లో ఫైనల్ జడ్జిమెంట్ అనగా విజయవాడలో మోహన్ రావు(సాయి కుమార్) అనే లాయర్ గురించి తెలిసి చందు మనుషులు అక్కడికి వెళతారు. అతను కేసు తీసుకోను అని చెప్పడంతో ఎప్పట్నుంచో కేసు కోసం ఎదురుచూస్తున్న అతని అసిస్టెంట్ తేజ(ప్రియదర్శి) ఈ కేసుని తీసుకుంటాడు. మంగాపతి తరపున దాము(హర్షవర్ధన్) కేసు వాదిస్తాడు. మరి ఈ కేసులో చందుని లాయర్ తేజ నిర్దోషిగా ఎలా బయటకు తీసుకొచ్చాడు? మంగాపతి చందుపై తప్పుడు కేసులు ఎలా పెట్టాడు? వాటిని ఎలా ప్రూవ్ చేసాడు? జాబిలి ఏమైంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Nidhhi Agerwal : సమంత, శ్రీలీల, కేతిక.. లిస్ట్ లోకి ఎంటర్ అయిన నిధి అగర్వాల్.. త్వరలో..

సినిమా విశ్లేషణ.. ఒక వ్యక్తిపై తప్పుడు కేసులు పెడితే లాయర్లు వాదించి ఎలా బయటకు తీసుకొచ్చారు అని గతంలో చాలా సినిమాలు చూసాం. ఇది కూడా అదే కథ. అయితే దీంట్లో పోక్సో అనే కొత్త పాయింట్ ని తీసుకున్నారు. ఏ తప్పు చేయకపోయినా పోక్సో కేసు పెడితే నిర్దోషిగా ఎలా బయటకు తీసుకొచ్చారు అనేది కోర్ట్ ప్రధాన కథాంశం. పోక్సో యాక్ట్ 2012లో వచ్చింది. అందుకే దాని తీవ్రతని బాగా చూపించడానికి ఈ కథని 2013లో రాసుకున్నట్టు తెలుస్తుంది.

ఫస్ట్ హాఫ్ లో కేసు గురించి కొంత చూపించి మొత్తం లవ్ స్టోరీనే నడిపించడంతో కాస్త సాగదీసినట్టు ఉంటుంది. అయితే చందు – జాబిలి టీనేజ్ లవ్ స్టోరీ చూస్తే మన కాలేజీ డేస్ గుర్తుకు వస్తాయి. ఇంటర్వెల్ కి తేజ కేసు ఒప్పుకున్నాను అని లీడ్ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ లో ఎలా వాదిస్తాడు అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో తేజ కేసు తీసుకున్న దగ్గర్నుంచి కోర్టులో వాదనలు, ప్రతి వాదనలు బాగా రక్తి కట్టిస్తాయి. ఇంటర్ చదివే రోజుల్లోనే ఇప్పుడు ప్రేమలో పడుతున్నారు. దాని వల్ల ఏం జరుగుతుంది? మైనర్ అమ్మాయి తో మిస్ బిహేవ్ చేసినా, ప్రేమ పేరుతో ఇష్టంగా శృంగారం చేసినా ఎలాంటి కఠినమైన శిక్షలు ఉంటాయి అని ఇప్పటి జనరేషన్ తెలుసుకోవాలి అనే పాయింట్ ని బలంగా చెప్పారు. చివర్లో పోక్సో చట్టం – ప్రేమను లింక్ చేసి ప్రియదర్శి మాట్లాడే మాటలు ఆలోచింపచేస్తాయి.

కథ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. మంగాపతి క్యారెక్టర్, అతని ఇంట్లో పరిస్థితులు కొత్తగా రాసుకున్నారు. మంగాపతిని తేజ క్రాస్ ఎగ్జామిన్ చేసే సీన్ ఇంకాస్త ఉంటే బాగుండు, అది సింపుల్ గా తేల్చేసారు అనిపిస్తుంది. చందుపై అన్యాయంగా కేసులు పెట్టారు అనే ఎమోషన్ మాత్రం బాగానే పండించారు. అయితే సినిమా కథ ముందే అందరికి తెలిసిపోయినా దాన్ని ఎలా నడిపించారు అనేదే ఈ సినిమాకి ముఖ్యం. దాంట్లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్, స్టూడెంట్స్ చూడాలి. ఇక సినిమాలో ప్రభాస్ మిర్చి సినిమా రిఫరెన్స్ లు ఫ్యాన్స్ కి కాసేపు కిక్ ఇస్తాయి.

Court movie review

నటీనటుల పర్ఫార్మెన్స్.. విభిన్న పాత్రలు చేసే ప్రియదర్శి లాయర్ పాత్రలో చాలా బాగా నటించాడు. ఈ సినిమాలో శివాజీ పవర్ ఫుల్ నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. తనలోని ఓ కొత్త కోణం ఈ పాత్రతో చూపించాడు. ఈ సినిమా తర్వాత శివాజీకి విలన్ రోల్స్ ఆఫర్స్ కచ్చితంగా వస్తాయి. హర్ష రోషన్ – శ్రీదేవి ఇద్దరూ టీనేజ్ ప్రేమ జంటగా క్యూట్ గా మెప్పించారు. ఎమోషన్ సీన్స్ లో కూడా బాగానే నటించారు. తెలుగమ్మాయి శ్రీదేవికి ఫ్యూచర్ లో హీరోయిన్ ఛాన్సులు ఏమో కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది.

తల్లి పాత్రలో రోహిణి సైలెంట్ గా ఉంటూనే డైలాగ్స్ ఏం లేకుండానే మెప్పిస్తుంది. ప్రియదర్శికి వ్యతిరేకంగా వాదించే పాత్రలో హర్ష వర్ధన్ కూడా బాగానే నటించినా అక్కడక్కడా కాస్త ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. సాయి కుమార్, విషిక కీర్తి, సురభి ప్రభావతి, రాజశేఖర్, శుభలేఖ సుధాకర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Rajamouli : దెబ్బకి అక్కడ షూటింగ్ క్యాన్సిల్ చేసి.. సెట్ వేద్దామని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సినిమా రిలీజ్ కి ముందే ఒక పాట వచ్చి హిట్ అయింది. 2013 బ్యాక్ డ్రాప్ తీసుకోవడంతో లొకేషన్స్, కొన్ని సీన్స్ విషయంలో బ్యాక్ డ్రాప్స్ కరెక్ట్ గా చూసుకుంటే బాగుండేది. పాత కథకి కొత్త కేసు జోడించి కొత్త కథనంతో బాగానే రాసుకొని డైరెక్టర్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. కోర్ట్ సెట్స్ విషయంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. నాని నిర్మాణంలో సినిమా అంటే కావాల్సినంత బాగానే ఖర్చుపెడతాడు. ఈ కోర్ట్ సినిమాకు కూడా బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘కోర్ట్’ సినిమా పోక్సో చట్టం మీద అవగాహన కల్పిస్తూనే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసేవాళ్లకు కనువిప్పు లాంటి సినిమా. థియేటర్లో ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.