Before Marriage Review : ‘బిఫోర్ మ్యారేజ్’ మూవీ రివ్యూ.. పెళ్ళికి ముందే ప్రగ్నెంట్ అయితే..?
పెళ్ళికి ముందు తప్పు కాదనుకొని చేసిన ఓ పొరపాటు లైఫ్ ని ఎలా మార్చేస్తుంది అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా.

Naveena Reddy Before Marriage Movie Review and Rating
Before Marriage Review : మూడు దశాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యానర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. లాంటి పలు హిట్ సినిమాలు తీసిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా పరిచయమవుతూ హనుమ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించిన సినిమా ‘బిఫోర్ మ్యారేజ్’. నవీన రెడ్డి ముఖ్య పాత్రలో భారత్, నాగ మహేష్, అపూర్వ, లక్ష్మణ్.. పలువురు ముఖ్య పాత్రలతో ఆటకుల శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిఫోర్ మ్యారేజ్ సినిమా నేడు జనవరి 26న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. ధరణి(నవీన రెడ్డి) తన కాలేజీ ఫ్రెండ్స్ శాంతి, ప్రశాంతితో కలిసి ఒక రూమ్ లో ఉంటూ చదువుకుంటుంది. జాలీ లైఫ్ కి అలవాటు పడి, కొత్త కొత్త అలవాట్లు, ఎంజాయ్మెంట్ కోసం దారి తప్పి అనుకోకుండా ధరణి ప్రగ్నెంట్ అవుతుంది. పెళ్లి కాకుండానే ప్రగ్నెంట్ అవ్వడంతో ధరణి జీవితం మారిపోతుంది. చుట్టూ ఉన్నవాళ్లు తలోరకంగా మాట్లాడటంతో ఒత్తిడికి గురవుతుంది. తన జీవితం నాశనమైందని భావిస్తుంది ధరణి. చిన్నప్పట్నుంచి ఎంతో ప్రేమగా పెంచిన తన తండ్రికి మొహం ఎలా చూపించాలో తెలియక బాధపడుతుంది. మరి అలాంటి పరిస్థితుల నుంచి ధరణి ఎలా బయటపడుతుంది? తన తండ్రి తనని చేరదీస్తాడా? అసలు ఆ పరిస్థితికి ఎలా వెళ్ళింది అనే అంశాలు తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. యువత, అందులోను ముఖ్యంగా ఆడపిల్లలు పెడదోవ పడితే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్ లో మాములు కథలా సాగుతుంది. ధరణి చదువు, లైఫ్ ఎంజాయ్.. అంటూ సాగి ఇంటర్వెల్ ముందు ప్రగ్నెన్సీ అని తెలియడంతో తర్వాత ఏం జరుగుతుందని ఆసక్తితో సెకండాఫ్ కి లీడ్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా సాగుతుంది. ధరణి బాధపడటం, తండ్రీకూతుళ్ల ఎమోషన్ ని చూపించారు. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. పెళ్ళికి ముందు తప్పు కాదనుకొని చేసిన ఓ పొరపాటు లైఫ్ ని ఎలా మార్చేస్తుంది అని యువతకు మంచి సందేశం ఇచ్చేలా తీశారు.
నటీనటుల విషయానికొస్తే.. మెయిన్ లీడ్ లో నటించిన నవీనరెడ్డి మొదటి హాఫ్ లో క్యూట్ గా కనపడి అలరించి సెకండ్ హాఫ్ లో ఎమోషన్ తో మెప్పించింది. తండ్రిగా నాగ మహేష్ మెప్పించారు. భారత్ ఆకాష్ హీరో పాత్రలో అలరించాడు. హీరోయిన్ ఫ్రెండ్స్, కాలేజీలోని కొన్ని పాత్రలు.. మిగిలిన వారంతా పర్వాలేదనిపించారు.
సాంకేతిక విషయాలు.. సినిమాలో ముఖ్యంగా మ్యూజిక్, ఎమోషనల్ BGM మెప్పిస్తాయి. ఈ సినిమాకి పీఆర్ సంగీతం అందించారు. మంగ్లీ పాడిన పాట యాక్టివ్ గా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. కెమెరా విజువల్స్ కూడా న్యాచురల్ గా బాగుంటాయి. నిర్మాత జగదీశ్వర్ రెడ్డి చిన్న సినిమా అయినా ఖర్చులో కాంప్రమైజ్ కాకుండా బిఫోర్ మ్యారేజ్ సినిమాని తెరకెక్కించాడు. దర్శకుడు కొత్తవాడైనా చక్కగా సినిమాని తెరకెక్కించాడు.
మొత్తంగా యువత ఎలాంటి విషయాల్లో పెడదోవ పడుతుంది, వాటివల్ల వచ్చే పర్యవసానాలని చూపిస్తూ ఓ సందేశాత్మకచిత్రంగా బిఫోర్ మ్యారేజ్ సినిమాని తీశారు. ఈ సినిమాకు రేటింగ్ 2.5 ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..