ఆ ప్రసారాలకు చెక్: ఇక నుంచి వాళ్లకు నచ్చితేనే

టీవీ ఛానెళ్ల విషయంలో ఈ మధ్యనే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు వినియోగదారులకు తలనొప్పిగా మారాయి. దాంతో పాటుగా ఆన్ లైన్ (స్ట్రీమింగ్ సర్వీసు) ప్రసార సేవలైన నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జియోతో పాటు మరో ఆరు కలిసి సెల్ఫ్ రెగ్యూలేషన్ పద్ధతిని అమలులోకి తీసుకురానున్నాయట. ఇంటర్నెట్ వినియోగంతో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో కొన్ని అంశాలపై కోత పెట్టనున్నారట. సెక్స్, మత కల్లోలాలు రేపే అంశాలు, తీవ్రవాదాన్ని ప్రేరేపించే అంశాలు వంటి వాటిపై నిషేదం విధించాలనే చర్చలు జరుపుతున్నాయట.
ప్రస్తుతం సెన్సార్‌షిప్‌కు సంబంధం లేకుండా పలు వెబ్ సిరీస్‌లు ఆన్‌లైన్ ప్రసారమవుతున్నాయి. వీటన్నిటినీ కట్టడి చేసే విధంగా నిబంధనలను రూపొందించుకోనున్నారట. ‘కోడ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రొవైడర్స్’ అనే ఒప్పందాన్ని త్వరలో అమలులోకి తీసుకురానున్నారు. ఇందుకు లోబడి హాట్ స్టార్, జియో, నెట్‌ఫ్లిక్స్, సోనీ లైవ్, వూట్(వయాకామ్18), జీ5, ఏఎల్టీ బాలాజీ, ఎర్రే, ఎరోస్, హంగామా, వీయూలు పని చేస్తాయి.
భారత సంప్రదాయాలకు, ప్రాంతీయ వ్యవహరాల మర్యాదకు భంగం వాటిల్లకుండా చేసేందుకే ఈ సెల్ఫ్ సెన్సార్‌షిప్‌ను అమలులోకి తీసుకురానున్నారు. ఈ విషయంపై స్పందించిన అమెజాన్ ప్రైమ్ వీడియో యాజమాన్యం తమ వినియోగదారుల అభిమానించే వాటిని ప్రసారం చేసేందుకు సంతోషిస్తున్నామని తెలిపింది. అదే విధంగా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రసారాలు చేస్తామని తెలిపింది.