సెలబ్రిటీలు పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ కోర్టుకే ఎందుకు? ఏపీ, తెలంగాణ హైకోర్టులకు ఎందుకు వెళ్లడం లేదు?

సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సెలబ్రిటీల పేర్లు, ఫొటోలు వాడుకుని కొందరు బిజినెస్ చేసుకుంటున్నారు.

సెలబ్రిటీలు పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ కోర్టుకే ఎందుకు? ఏపీ, తెలంగాణ హైకోర్టులకు ఎందుకు వెళ్లడం లేదు?

Updated On : December 12, 2025 / 4:41 PM IST

Delhi High Court: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన పర్సనాలిటీ రైట్స్ ను కాపాడాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రమేయం, తన అనుమతి లేకుండా తన బ్రాండ్ ఇమేజ్ ను, తన ఫొటోలు, ఇతరత్రా తన వ్యక్తిగత ప్రాపర్టీస్ ను వాడుకోవడం మీద నిషేధం విధించాలని ఆ పిటిషన్ లో కోరారు.

అయితే, పవన్ కంటే ముందు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లాంటి తెలుగు హీరోలు ఢిల్లీ హైకోర్టులో ఇదే తరహా పిటిషన్లు వేశారు. ఇక బాలీవుడ్ నుంచి అయితే ఐశ్వర్యారాయ్ తో స్టార్ట్ చేసి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వరకు ఢిల్లీ హైకోర్టులో ఇలాంటి పిటిషన్లు వేశారు. కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఢిల్లీ హైకోర్టులో కాకుండా హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ఇలా వేర్వేరు రాష్ట్రాల్లో ఉండే నటులు ఢిల్లీ హైకోర్టులోనే ఎందుకు పిటిషన్లు వేశారంటే దానికో ప్రత్యేక కారణం ఉంది. ఢిల్లీ అనేది దేశ రాజధాని. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీల రిజిస్టర్డ్ ఆఫీసులు ఢిల్లీలోనే ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విటర్.. ఇలా మెజారిటీ సోషల్ మీడియా కంపెనీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాలు ఢిల్లీలోనే నెలకొల్పుతాయి.

దీంతోపాటు ఈ అన్నిటికీ అనుమతులు ఇచ్చి, వాటిని రెగ్యులేట్ చేసే ట్రాయ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఢిల్లీ కేంద్రంగా నడుస్తుంది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే వెంటనే లోకల్ గా ఉండే ఐ అండ్ బీ శాఖకు న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తుంది.

ఆ తర్వాత సమాచార ప్రసార శాఖ సోషల్ మీడియా కంపెనీలకు కోర్డు ఆర్డర్స్ ని పాస్ చేసి దానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తుంది. ఢిల్లీ కేంద్రంగా ఉండే కంపెనీలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ శాఖలకు ఆ సమాచారాన్ని పంపి.. ఆయా సెలబ్రిటీలకు సంబంధించిన కోర్టు ఆర్డర్స్ ని ఫాలో అవ్వాల్సిందిగా సూచిస్తాయి. కాబట్టి ఢిల్లీలో స్విచ్ నొక్కితే దేశం మొత్తం కంట్రోల్ అవుతుంది.

చిరంజీవి మాత్రం ఎందుకు సిటీ సివిల్ కోర్టులో వేశారు?
ఇతర హీరోలు నేరుగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తే మెగాస్టార్ చిరంజీవి మాత్రం సిటీ సివిల్ కోర్టు పిటిషన్ వేశారు. అయితే, ఆయన తన నివాస స్థలం ఆధారంగా పిటిషన్ ఫైల్ చేశారు. సిటీ సివిల్ కోర్టు కూడా ప్రతివాదులు ఢిల్లీలో ఉంటే నోటీసులు పంపించడానికి వీలవుతుంది. కాబట్టి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసినా కూడా పెద్ద నష్టం లేదనేది న్యాయ నిపుణుల వాదన.

అసలు ఎందుకు ఈ పిటిషన్లు వేస్తున్నారు?
సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సెలబ్రిటీల పేర్లు, ఫొటోలు వాడుకుని కొందరు బిజినెస్ చేసుకుంటున్నారు. అలాగే వాళ్ల ఫొటోలతో డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి వారి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. ఉదాహరణకి.. ఒక షాపింగ్ మాల్ వాళ్లు హీరో లేదా హీరోయిన్ తో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోకుండా ఆ డ్రెస్సులు, చీరలు పెట్టే కవర్ల మీద హీరోలు, హీరోయిన్ల ఫొటోలను వినియోగిస్తుంటారు.

అది చూసిన కస్టమర్ బహుశా దీనికి ఫలానా హీరో లేదా హీరోయిన్ బ్రాండింగ్ చేస్తుందని అనుకునే అవకాశం ఉంది. అలాగే ఒక హీరో లేదా హీరోయిన్ పేరుతో హోటల్ పెడితే ఆ హోటల్ హీరోది లేకపోతే హీరోయిన్ ది అని కస్టమర్ భావించవచ్చు. అందులో ఫుడ్ బాగోలేకపోతే అప్పుడు ఆ బ్యాడ్ నేమ్ ఆ సెలబ్రిటీకి వస్తుంది. ఇలాంటి అంశాల్లో అసలు సెలబ్రిటీకి తెలియకుండా, వాళ్ల పేరు, ఫొటోలు ఇతరత్రా వాడడం వల్ల వాళ్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అందుకే అందరూ కోర్టు బాట పట్టారు.

పెద్ద వాళ్ల సంగతి సరే.. మరి సాధారణ జనం పరిస్థితి ఏంటి?
పెద్ద వాళ్ల సంగతి సరే. వాళ్ల దగ్గర డబ్బుంది. లాయర్లను పెట్టుకుంటారు. కానీ, మరి సగటు వ్యక్తి పరిస్థితి ఏంటనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. చాలా మంది ఇలాంటి డీప్ ఫేక్ ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా యువతులు, మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించిన సంఘటనలు ఈ మధ్య బాగా పెరిగాయి. కొందరైతే ఇలాంటివి తెలిసిన తర్వాత సమాజానికి భయపడి బయటకు కూడా రారు. ఒకవేళ బయటకు వచ్చి చెబితే ఆ వీడియోలు ఇంకా వైరల్ అవుతాయని భయపడుతూ ఉంటారు.

అయితే వీటికి ఓ సొల్యూషన్ రావాలనేది నిపుణుల వాదన. యూరోపియన్ యూనియన్ తరహాలో ఈ సోషల్ మీడియా వినియోగం, AI వినియోగం మీద చట్టాలు అవసరం. ఈయూ తాజాగా AI యాక్ట్ తీసుకొచ్చింది. తప్పుడు వీడియోలు, డీప్ ఫేక్ వీడియోలు కంప్లీట్ బ్యాన్ చేసింది. ఒకవేళ ఎవరైనా ఏఐని వినియోగించి వీడియోలు చేయాలంటే దానికి సంబంధించి వాళ్లు ఏ టెక్నాలజీ వాడి దాన్ని చేశామనేది వివరణ ఇవ్వాలి. అలాంటప్పుడే కొంత మేర కట్టడి చేయొచ్చు.