Pawan Kalyan : పవన్ సినిమాకు అయినా రూల్స్ పాటించాల్సిందే.. థియేటర్స్ లో ఫుడ్ ధరలు తగ్గుతాయా? ఇది కదా పవన్ అంటే..
పవన్ కూడా సినిమాటోగ్రఫీ మంత్రి, ఆ శాఖ అధికారులతో నేడు మీటింగ్ పెట్టి పలు విషయాలను ఆ శాఖ ద్వారా లెటర్ రిలీజ్ చేసి తెలియచేసారు.

Pawan Kalyan Meeting on Movie Theaters and Approaching Tollywood to Government
Pawan Kalyan : ఇటీవల నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్స్ ఇష్యూ జరుగుతుండగా ఆ వివాదం ఏపీ ప్రభుత్వం వరకు వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టాలీవుడ్ పై, థియేటర్స్ పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కామెంట్స్ టాలీవుడ్ లో చర్చగా మారడంతో ఇప్పటికే అల్లు అరవింద్, దిల్ రాజు ప్రెస్ మీట్స్ పెట్టి పలు అంశాలు మాట్లాడారు. ఇక పవన్ కూడా సినిమాటోగ్రఫీ మంత్రి, ఆ శాఖ అధికారులతో నేడు మీటింగ్ పెట్టి పలు విషయాలను ఆ శాఖ ద్వారా లెటర్ రిలీజ్ చేసి తెలియచేసారు.
రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పవన్ ఆదేశించారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని తీర్మానించారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలి. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చెయ్యాలి, ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని తెలిపారు.
అలాగే ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే ఏం చేయాలనే దానిపై చర్చించారు. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై చర్చ జరిగింది. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.
ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యత అని తెలిపారు.
Also Read : Kannappa : కన్నప్ప హార్డ్ డిస్క్ ‘చరిత’ దొంగతనం చేసిందంటూ మంచు విష్ణు పోస్ట్.. ‘చరిత’కు మనోజ్ థ్యాంక్స్..
అయితే హరిహర వీరమల్లు సొంత సినిమా అయినా రూల్స్ పాటించే వచ్చి టికెట్ ధరల పెంపు కోరాలని చెప్పడంతో ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట, పదవిని సొంత పనులకు వాడుకోవట్లేదు అని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు. అలాగే నిజంగానే థియేటర్స్ లో ఫుడ్ పై ధరలు తగ్గితే అందరూ పవన్ ని మరింత పొగుడుతారు అని అంటున్నారు.