Hari Hara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ మూవీ రివ్యూ.. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ సినిమా ఎలా ఉందంటే..
ఒక్క ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచి పవన్ ప్రమోషన్స్ లో ఎంట్రీ ఇవ్వడంతో హైప్ భారీగా పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

Hari Hara VeeraMallu
Hari Hara VeeraMallu Movie Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ యాక్షన్ కథతో వచ్చిన సినిమా ‘హరిహర వీరమల్లు’. నిర్మాత ఎఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో ఎఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు తెరకెక్కింది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటించగా బాబీ డియోల్, సత్యరాజ్, అయ్యప్ప శర్మ, రఘుబాబు, సునీల్, సుబ్బరాజు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. హరిహర వీరమల్లు సినిమా జూలై 24న రిలీజ్ కానుంది. అయితే ముందు రోజు జులై 23న రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు.
కథ విషయానికొస్తే.. వీరమల్లు(పవన్ కళ్యాణ్) దొంగతనాలు చేసి అవి పంచిపెడుతూ ఉంటాడు. ఎవరైనా దొంగతనం చేసి పెట్టమంటే చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఇతని గురించి తెలిసి కొల్లూరు సంస్థానం రాజు పిలిపించి నిజాం నవాబ్ కులీ కుతుబ్ షాకు మేము వజ్రాలు పంపించాలి అవి కొట్టేసి ఇమ్మని అడుగుతాడు. అదే సంస్థానంలో పంచమి(నిధి అగర్వాల్) తనని ఆ రాజు నుంచి కాపాడమని అడుగుతుంది. పంచమితో ప్రేమలో పడిన వీరమల్లు ఆమెని తప్పించడానికి, వజ్రాలని కొట్టేయడానికి ప్లాన్ వేసి ఇందుకు సుబ్బన్న(సునీల్), అబ్బన్న(సుబ్బరాజు), విస్సన్న(నాజర్), పఠాన్(నిహార్ కపూర్)ల సాయం తీసుకుంటాడు. హైదరాబాద్ చార్మినార్ వద్ద నిజాం సైనికులతో పోరాడి వజ్రాలు దొంగలించి, పంచమిని తీసుకొని పారిపోతుంటే పంచమి వీరమల్లుని కొట్టి ఆ వజ్రాలను తీసుకొని పారిపోతుంది.
దీంతో వీరమల్లుని నిజాం సైనికులు పట్టుకొని కులీ కుతుబ్ షా దగ్గరకు తీసుకెళ్తారు. కులీ కుతుబ్ షా వీరమల్లు తెలివి, ధైర్యం తెలుసుకొని మన వజ్రం కోహినూర్ ఢిల్లీలోని ఔరంగజేబు సింహాసనం మీద ఉంది, దాన్ని కొట్టేసి తీసుకురావాలి అని చెప్తాడు. ఓ పక్క ఔరంగజేబు దేశం మొత్తం ఆక్రమించుకోవాలని, అందర్నీ మతం మార్చాలని లేకపోతే పన్ను కట్టాల్సిందే అని దారుణాలు చేస్తూ ఉంటాడు. మరి వీరమల్లు కోహినూర్ కోసం ఢిల్లీ వెళ్తాడా? ఔరంగజేబుకి వీరమల్లు గురించి ఎలా తెలుస్తుంది? పంచమి వీరమల్లుని ఎందుకు మోసం చేసింది? వీరమల్లు ఎవరు? పంచమి ఎవరు? ఔరంగజేబు అరాచకాలకు వీరమల్లు ఎలా ఎదురు తిరిగాడు.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. ఎప్పుడో 2020 లో మొదలయింది ఈ సినిమా. సినిమా అనౌన్స్ చేసినప్పుడు, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ తర్వాత కరోనా, పవన్ రాజకీయాల వల్ల సినిమా ఆల్మోస్ట్ ఐదేళ్లు లేట్ అయి ఇప్పుడు రిలీజయింది. సినిమా బాగా ఆలస్యం అవడం, డైరెక్టర్ మారడం.. ఇలా పలు కారణాలతో హరిహర వీరమల్లు సినిమాని పట్టించుకోవడం ఫ్యాన్స్ కూడా మానేశారు. ఉన్న హైప్ మొత్తం పోయింది. కానీ ఒక్క ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచి పవన్ ప్రమోషన్స్ లో ఎంట్రీ ఇవ్వడంతో హైప్ భారీగా పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.
ఫస్ట్ హాఫ్ సింపుల్ గా వీరమల్లు దొంగతనం చేయడం ఫైట్ చేయడం, దొంగతనం చేయడం ఫైట్ చేయడం అన్నట్టు సాగిపోతుంది. మధ్యలో పంచమి ఎపిసోడ్. ఇంటర్వెల్ కి మాత్రం కోహినూర్ కోసం ఎలా వెళ్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా వీరమల్లు, అతని మనుషులు ఢిల్లీకి చేసే ప్రయాణంతో సాగుతుంది. మధ్యలో పంచమి, వీరమల్లు ఫ్లాష్ బ్యాక్ తో సాగుతుంది.
కథ పాయింట్ బాగున్నా సింపుల్ స్క్రీన్ ప్లేతో లాగించేసారు. ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ కూడా కాస్త సాగదీశారు. యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం బాగా డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్ సీన్ మాత్రం అదిరిపోతుంది. క్లైమాక్స్ షాట్ తో సెకండ్ పార్ట్ కి పర్ఫెక్ట్ లీడ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ టైటిల్ కార్డ్ మాత్రం అదిరిపోయింది. ఫ్యాన్స్ కి పండగే. సినిమా చాన్నాళ్లు సాగడం, అప్పుడప్పుడు షూట్ చేయడంతో పలుచోట్ల కంటిన్యుటీ మిస్ అయింది. సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేసారు.
ఇక పవన్ కళ్యాణ్ కి మాత్రం కావాల్సినన్ని ఎలివేషన్స్ ఇచ్చారు. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తో మాత్రం ఫ్యాన్స్ ఖుషి అవుతారు. పార్ట్ 2 లో ఔరంగజేబు వర్సెస్ వీరమల్లు ఉంటుందని తెలుస్తుంది. బాబీ డియోల్ – పవన్ కళ్యాణ్ కి క్లైమాక్స్ ఒకే ఒక్క షాట్ తప్ప ఫేస్ టు ఫేస్ ఈ సినిమాలో లేదు. అసలు పార్ట్ 2 కథని కూడా కలిపేసి ఈ పార్ట్ లో కాస్త ఎడిటింగ్ చేసి మొత్తం ఒకటే సినిమాగా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మరి పార్ట్ 2 తీస్తారో లేదో చూడాలి. సినిమా మొత్తం అర్ధం చేసుకుంటే మొదట్లో వజ్రాలు దొరికే ప్రాంతం నుంచి నదిలో కొట్టుకొచ్చిన పిల్లాడే వీరమల్లుగా మారి తమ ప్రాంతం కోహినూర్ కోసం వెళ్లడం అనే లైన్ బాగా కనెక్ట్ చేసారు. అయితే ఇలాంటి పీరియాడికల్ యాక్షన్ సినిమా అంటే గతంలో చూసిన సినిమాలతో పోల్చి గొప్పగా ఊహించుకుంటాము. ఊహించుకున్నంత గొప్పగా అయితే ఉండదు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నా తనకు కుదిరినిప్పుడల్లా టైం ఇచ్చి తన బెస్ట్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ లలో మాత్రం అదరగొట్టేసారు. నిధి అగర్వాల్ తన అందాలు చూపిస్తూనే కాస్త ఎమోషన్ పండించింది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. సునీల్, సుబ్బరాజు, నాజర్ అక్కడక్కడా నవ్వించి సహాయ పాత్రల్లో బాగానే నటించారు. జయసుధ కొడుకు నిహార్ కపూర్ కూడా పవన్ సహాయ పాత్రల్లో పర్వాలేదనిపించాడు. అనసూయ, పూజిత పొన్నాడ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెరిపించారు. సత్యరాజ్, అయ్యప్ప శర్మ, సచిన్ ఖేద్కర్, కోట శ్రీనివాసరావు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. కొన్ని సీన్స్ DI చేయలేదు అనిపిస్తుంది. సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు ఎలివేషన్ సీన్స్ లో కీరవాణి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. అన్ని రిపీటెడ్ మోడ్ లో వినొచ్చు. సినిమాకు VFX ఇంకా బాగా చేయాల్సింది. కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ విషయంలో తేలిపోయాయి. సినిమా ఆలస్యం అవ్వడం, దర్శకులు మారడం VFX మీద ఎఫెక్ట్ అయిందని తెలుస్తుంది.
డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పించాల్సింది. డబ్బింగ్ సరిగా లేక కొన్ని డైలాగ్స్ సరిగా అర్ధం కాలేదు. పవన్ ఫ్యాన్స్ కి జోష్ నింపే డైలాగ్స్ అయితే బాగానే ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగానే డిజైన్ చేసారు. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్ కొత్తగా ఉంది. కథ కొత్త పాయింట్ అయినా స్క్రీన్ ప్లే ఇంకా బలంగా రాసుకోవాల్సింది. క్రిష్ మధ్యలో వదిలేసిన సినిమాని జ్యోతి కృష్ణ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు సెట్స్, గ్రాఫిక్స్.. అన్ని విషయాల్లోనూ బాగా ఖర్చుపెట్టారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా 1650 కాలానికి తగ్గట్టు సెట్స్ పర్ఫెక్ట్ గా వేశారు. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కూడా ఆ కాలానికి తగ్గట్టు బాగానే డ్రెస్ లు డిజైన్ చేసారు.
మొత్తంగా ‘హరిహర వీరమల్లు’ దొంగతనాలు చేస్తూ సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తి కోహినూర్ వజ్రం ఔరంగజేబు నుంచి దొంగలించి తీసుకురావడానికి ఎందుకు వెళ్తాడు అని యాక్షన్ డ్రామాగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.