పెంగ్విన్ – రివ్యూ

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘పెంగ్విన్’ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : June 19, 2020 / 08:26 AM IST
పెంగ్విన్ – రివ్యూ

Updated On : June 19, 2020 / 8:26 AM IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘పెంగ్విన్’ రివ్యూ..

‘మహానటి’ తరువాత కథానాయికగా కీర్తి సురేష్‌కి ఓ సపరేట్ ఇమేజ్ వచ్చింది. ఆ సినిమాతో మంచి నటిగా పేరుతెచ్చుకున్న ఆమె నటనకు ప్రాధాన్యం ఉన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు.. దర్శకుల బెస్ట్ ఛాయిస్‌గా మారారు. ఇక ‘మహానటి’ తరువాత ఆమె చేసిన మొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘పెంగ్విన్’. లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని నేడు విడుదల చేశారు. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి ఇన్ని అంచలనాల మధ్య విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పెంగ్విన్ ఎలా ఉందో చూద్దాం…

కథ విషయానికొస్తే: గర్భవతి అయిన రిథమ్(కీర్తి సురేష్) ఆరేళ్ళ క్రితం తప్పిపోయిన తన కొడుకు అజయ్(మాస్టర్ అద్వైత్) గురించి ఆలోచిస్తూ నిరాశ, నిస్పృహలతో జీవితం గడుపుతూ ఉంటుంది. అజయ్ కిడ్నాప్ చేయబడ్డాడు..అతన్ని చార్లీ చాప్లిన్ ముసుగులో ఉన్న ఓ క్రిమినల్ ఎత్తుకు పోయాడు..అతడు తిరిగిరాడు అని అక్కడి వారు చెప్తుంటారు..అయితే కొడుకుపై ఎనలేని మమకారం కలిగిన రిథమ్ అతని కోసం వెతుకుతూనే ఉంటుంది. అలా వెతుకుతున్న ఆమెకు అజయ్ విషయంలో ఓ కీలక సమాచారం తెలుస్తుంది. అసలు ఈ ముసుగు వ్యక్తి ఎవరు? అతను అజయ్‌ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? మరి రిథమ్ తన కుమారుడిని వెనక్కు తెచ్చుకుందా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ‘పెంగ్విన్’..

Keerthy Suresh

నటీనటుల విషయానికొస్తే: దర్శకుడు కథా కథనాల కంటే కూడా కేవలం కీర్తి సురేష్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీశాడా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనకు కీర్తి సురేష్, ఆమె పాత్ర మాత్రమే తెరపై కనిపిస్తుంది. కొడుకు కోసం ఆవేదన..ఎలాగైనా అతన్ని కనిపెట్టాలనే ఆరాటం..తన కొడుక్కి ఏమైయ్యిందో అనే భయం వంటి అనేక భావాలు కీర్తి సురేష్ చక్కగా పలికించింది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మెయిన్ పాయింట్ కీర్తి సురేష్ నటన మాత్రమే. ‘మహానటి’ తరువాత అంత వెయిట్ ఉన్న పాత్ర దక్కించుకున్న కీర్తి ఆ పాత్రకు తన వంతు న్యాయం చేసింది. తను ఓ అధ్బుత పెర్ఫార్మర్ అని మరోసారి నిరూపించుకుంది.
అలాగే ఈ సినిమాలో రఘు పాత్ర చేసిన లింగా నటన ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్ తరువాత ఈ సినిమలో ప్రాధాన్యం ఉన్న పాత్ర లింగాదే. చైల్డ్ ఆర్టిస్ట్ అద్వైత్ పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉండగా తన పరిధిమేర మెప్పించాడు. ఈ సినిమాలో భావన అనే ఓ కీలక రోల్ చేసిన నిత్యా కిరుబు పాత్రకు.. కీర్తి సురేష్ పాత్రను పోటీగా మలచగల ఆస్కారం ఉంది. అయితే మొదట అనుకున్నట్లు దర్శకుడు కీర్తి సురేష్ మినహా ఏ ఒక్క పాత్రను డీప్‌గా నేరేట్ చేసే ప్రయత్నం చేయలేదు.

Penguin

ఓవరాల్‌గా చెప్పాలంటే: ఎమోషన్స్ మరియు క్రైమ్ కలగలిపి ఓ సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కించాలనుకున్న దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలం కాలేదు అనే చెప్పాలి. మొదటి 40నిముషాలు సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కానీ ఈ టెంపోని చివరి వరకు మెయింటెన్ చేయలేకపోయాడు. పట్టులేని స్క్రీన్ ప్లే ప్రేక్షకుడికి ఆ థ్రిల్ కలిగించలేకపోయింది. కేవలం కీర్తి సురేష్ కోసమే సినిమా అన్నట్లు సాగే కథనంలో… చాలా పాత్రలకు కనీస ప్రాధాన్యత కూడా ఉండదు. కనిపించని కొడుకు కోసం తల్లిపడే ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు.. అయితే ఆ ఎమోషనల్ టచ్ అనేదే ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు.

కాకపోతే అసలు ఈ కిడ్నాపర్ ఎవరు, అసలు ఎందుకు అతను పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాడన్న ఉత్కంఠ మాత్రం చివరివరకు సాగుతుంది. చాలా పాత్రలపై అనుమానం కలిగేలా డైరెక్టర్ ఉత్కంఠత కలిగించాడు కొంత వరకు. కానీ అప్పటివరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ముసుగు వెనకున్న క్రిమినల్ ఎవరనే విషయాన్ని కాస్తా నిరుత్సాహపరచడంతో క్లైమాక్స్ తేలిపోయింది. అప్పటి వరకు విలన్ గురించి ఎన్నో ఊహించుకున్న ప్రేక్షకులకు ఇంతేనా.. అన్న భావన కలుగుతుంది. కాగా కీర్తి సురేష్ అద్భుత నటన, అక్కడక్కడా మెప్పించే అంశాలు, సినిమాకు మంచి ఫీల్ యాడ్ చేసిన బీజీఎమ్ ప్రేక్షకుడికి ఉపశమనం కలిగించే అంశాలు అని చెప్పొచ్చు. లాక్ డౌన్ సమయంలో కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులు, సినీ ప్రేమికులు ‘పెంగ్విన్’ చిత్రాన్ని ఓ సారి చూడొచ్చు.  

Read: కోహ్లీ సతీమణి అనుష్క ప్రెగ్మెంట్ ? Photo shop క్రియేట్