Patang Review : ‘పతంగ్’ రివ్యూ.. అమ్మాయి కోసం బెస్ట్ ఫ్రెండ్స్ పతంగ్ ఫైట్.. భలే కొత్తగా ఉందే సినిమా..

సినిమా చూసాక అరె ఇంత మంచి సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. (Patang Review)

Patang Review : ‘పతంగ్’ రివ్యూ.. అమ్మాయి కోసం బెస్ట్ ఫ్రెండ్స్ పతంగ్ ఫైట్.. భలే కొత్తగా ఉందే సినిమా..

Patang Review

Updated On : December 26, 2025 / 12:15 AM IST

Patang Review : ప్రీతి ప‌గ‌డాల‌, ప్ర‌ణ‌వ్ కౌశిక్‌, వంశీ పూజిత్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘పతంగ్’. రిష‌న్ సినిమాస్ బ్యానర్ పై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి నిర్మాణంలో ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గాలిపటాల స్పోర్ట్స్ డ్రామా, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన పతంగ్ సినిమా నేడు డిసెంబర్ 25న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే..

విస్కీ(వంశీ పూజిత్), అరుణ్(ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. గాలి పటాలు ఎగరేయడంతో వీరి స్నేహం మొదలవుతుంది. అరుణ్ అమెరికా వెళ్ళడానికి GRE ప్రిపేర్ అవుతుంటే వంశీ పానీపూరి బండి పెట్టుకుంటాడు. ఐశ్వర్య(ప్రీతి పగడాల) విస్కీ దగ్గరికి పానీపూరి తినడానికి వచ్చి పరిచయం అయి ప్రేమగా మారి ఇద్దరూ ప్రేమించుకుంటారు. విస్కీ ఐశ్వర్యని తన ఫ్రెండ్స్ కి పరిచయం చేసాక అనుకోకుండా ఓ రోజు రాత్రి ఐశ్వర్యకు అరుణ్ కలుస్తాడు. ఆ రోజు, ఆ తర్వాత జరిగిన సంఘటనలతో ఐశ్వర్య అరుణ్ ని కూడా ఇష్టపడుతుంది.

అరుణ్ మొదట తప్పు అని చెప్పినా తర్వాత తాను కూడా ప్రేమిస్తాడు. ఈ విషయం విస్కీ కి ఎలా చెప్పాలా అని ట్రై చేస్తుంటే విస్కీకి తెలిసిపోయి అరుణ్ ని కొట్టి గొడవపడతాడు. ఐశ్వర్య చిన్నప్పటి నుంచి ఏదీ సెలెక్ట్ చేసుకోలేని మనిషి. వీరిద్దరి గొడవలో నీకు ఎవరు కావాలని అడిగితే ఐశ్వర్య దగ్గర సరైన సమాధానం లేకపోతే ఓ పెద్ద మనిషి మీ స్నేహం పతంగ్ తోనే మొదలైంది కాబట్టి పతంగ్ పోటీ పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకే ఐశ్వర్య అంటాడు.

ఇందుకు ఐశ్వర్య కూడా ఒప్పుకుంటుంది. విస్కీ పతంగ్ పోటీల్లో తోపు. అరుణ్ కి అసలు పతంగ్ ఎగరేయడం సరిగ్గా రాదు. మరి ఈ పతంగ్ పోటీలు ఎలా జరిగాయి? వీటి రూల్స్ ఏంటి? ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? విస్కీ – అరుణ్ మళ్ళీ కలిసారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Vrusshabha Review : ‘వృష‌భ‌’ మూవీ రివ్యూ.. పునర్జన్మల నేపథ్యంతో..

సినిమా విశ్లేషణ..

పతంగ్ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినా వాయిదాలు పడుతూ ఇప్పటికి రిలీజ్ అయింది. ఈ వారం ఎక్కువ సినిమాలు ఉండటంతో, ప్రమోషన్స్ కూడా తక్కువ చేయడంతో ఈ సినిమా జనాల్లోకి అంతగా రీచ్ అవ్వలేకపోయింది. కానీ ఈ వారం అన్ని హారర్, థ్రిల్లర్, సీరియస్ సినిమాలు ఉంటే ఇదొక్కటి ఫీల్ గుడ్ సినిమాలా అందర్నీ మెప్పించి ఆశ్చర్యపరిచింది. సినిమా చూసాక అరె ఇంత మంచి సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ విక్కీ, అరుణ్ స్నేహంతో మొదలయి ఐశ్వర్య ఎంటర్ అవ్వడం, వాళ్ళ ప్రేమ కథలు, మధ్యలో కామెడీ అంతా కూడా క్యూట్ గా, ఫీల్ గుడ్ గా, కలర్ ఫుల్ గా బోర్ కొట్టకుండా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ కి విక్కీకి విషయం తెలిసి అరుణ్ తో గొడవపడటంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో పతంగ్ ఫైట్ డిసైడ్ చేసిన తర్వాత కాస్త ఎమోషనల్ గా సాగదీశారు. ముగ్గురి బాధ చూపిస్తూ ఎమోషనల్ చేసే ప్రయత్నం చేసారు కానీ అంతగా వారౌట్ అవ్వలేదు.

అసలు ఏమి రాని అరుణ్ టీమ్ పతంగ్ పోటీలకు ప్రిపేర్ అయ్యే సీన్స్ అన్ని ఫుల్ గా నవ్విస్తారు. పతంగ్ ఫైట్ మొదలయిన దగ్గర్నుంచి లాస్ట్ అరగంట ఉత్కంఠంగా సాగుతుంది. ఓ పక్క ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో పాటు కామెడీ తో నవ్వించారు. అసలు గాలి పటాల పోటీని మొదటి సారి ఫుల్ గేమ్ గా చాలా బాగా, ప్రొఫెషనల్ గా చూపించారు. ఈ ఆటకు ఇచ్చే కామెంట్రీ, చీర్ గర్ల్స్, మధ్యలో టీమ్ మెంబర్స్ చేసే పనులు అన్ని ఫుల్ గా నవ్విస్తాయి. పతంగ్ పోటీల ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

ఇక క్లైమాక్స్ లో మళ్ళీ ఎమోషనల్ గా మార్చేసి సింపుల్ గా ఊహించిన విధంగానే క్లోజ్ చేసారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. యూత్ కి, పతంగ్ లు ఎగరేసే వాళ్లకు మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చూసేయొచ్చు.

Patang Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఇన్నాళ్లు సింగర్ గా పరిచయం అయిన ప్రణవ్ కౌశిక్ ఈ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నిదానంగా ఉండే క్లాస్ పాత్రలో ప్రణవ్ కౌశిక్ చాలా బాగా సెట్ అయ్యాడు. ఇక మాస్ పాత్రలో వంశీ కూడా బాగా నటించాడు. ఇద్దరూ ఫుల్ గా నవ్విస్తూనే ఫ్రెండ్షిప్ ని బాగా చూపించారు. ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియని అమాయక క్యూట్ పాత్రలో ప్రీతీ పగడాల చాలా బాగా నటించింది.

కోర్ట్ లో సీరియస్ రోల్ లో కనపడిన నటి విషిక ఈ సినిమాలో ఫుల్ గా నవ్విస్తుంది. సింగర్ ఎస్పీ చరణ్ ఓ కీలక పాత్రలో చక్కగా మెప్పించారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గెస్ట్ రోల్ లో అలరించారు. విష్ణు ఓఐ కామెంటేటర్ గా నవ్విస్తాడు. విజ్ఞాని, వడ్లమాని శ్రీనివాస్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Shambhala Review : ‘శంబాల’ మూవీ రివ్యూ.. వామ్మో.. కొత్త కథతో మాములుగా భయపెట్టలేదుగా..

సాంకేతిక అంశాలు..సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. కొన్ని కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే నవ్వించారు. పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ లో మాత్రం ఓపెనింగ్ సాంగ్, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్. ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవ పడటం అనే పాత కాన్సెప్ట్ ని పతంగ్ ఫైట్ అనే కొత్త పాయింట్ జత చేసి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా బాగా రాసుకున్నాడు దర్శకుడు. డైలాగ్స్ కూడా ఫుల్ గా నవ్వించేలా బాగా రాసారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. పతంగ్ ఫైట్స్ డిజైన్, టేకింగ్, ఎడిటింగ్ మాత్రం అదిరిపోయాయి.

మొత్తంగా ‘పతంగ్’ సినిమా ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల ప్రేమకథకు పతంగ్ పోటీలు అనే కాన్సెప్ట్ జతచేసి కొత్తగా చూపిస్తూ నవ్వించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.