Priyadarshi Roopa Koduvayur MohanaKrishna Indraganti Sarangapani Jathakam Movie Review and Rating
Sarangapani Jathakam Movie Review : ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సారంగపాణి జాతకం సినిమా నేడు ఏప్రిల్ 25న రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. సారంగపాణి(ప్రియదర్శి) ఒక జాతకాలు పిచ్చోడు. ఒక కార్ షోరూమ్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తూ ఉంటాడు. అదే షోరూంలో పని చేసే మేనేజర్ మైథిలి(రూప కొడువాయూర్) తో ప్రేమలో పడి ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ అయ్యాక సారంగపాణి అనుకోకుండా జిగ్నేశ్వర్(అవసరాల శ్రీనివాస్) అనే ఓ జాతకాలు చెప్పే అతన్ని కలిస్తే అతను సారంగపాణి చెయ్యి చూసి నీ లైఫ్ లో మర్డర్ చేస్తావని ఉంది అని చెప్తాడు.
సారంగపాణి తను మర్డర్ చేస్తే మైధిలి అన్యాయం అయిపోతుంది అని పెళ్లి వాయిదా వేసి తనే ఎవరో ఒక బ్యాడ్ పర్సన్ ని తన చేతికి మట్టి అంటకుండా చంపేస్తే బెటర్ అనుకుంటాడు. సారంగపాణి తన ఫ్రెండ్ చందు(వెన్నెల కిషోర్)తో కలిసి ఓ ముసలావిడని చంపాలి అనుకుంటాడు. అది ఫెయిల్ అయ్యాక తన కార్ షోరూం హెడ్ ని చంపాలని ప్లాన్ వేస్తాడు. కానీ మైథిలి పుట్టినరోజు పార్టీలో అతను రావడం, అతనితో సారంగపాణి గొడవ పడటంతో మైథిలి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని రెండు వారాల సమయం ఇచ్చి ఈ లోపు ఏం సమస్యలు ఉన్నా సాల్వ్ చేసుకొని వస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. మరి సారంగపాణి ఎవర్నైనా హత్య చేస్తాడా? సారంగపాణి హత్య ప్రయత్నాలు చేసే క్రమంలో అతని ఫ్రెండ్ చందు, రాంకీ(వైవా హర్ష)లతో కలిసి ఏం చేసాడు? సారంగపాణి – మైథిలి ప్రేమ ఫలిస్తుందా? అసలు జిగ్నేశ్వర్ అలా ఎందుకు చెప్పాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Puri Jagannadh – Vijay Sethupathi : విజయ్ సేతుపతిని ‘బెగ్గర్’ చేయబోతున్న పూరి జగన్నాధ్.. ఫైనాన్స్ కష్టాలు..?
సినిమా విశ్లేషణ.. ఒక జాతకాల పిచ్చోడు ఎవరైనా ఏదైనా చెప్తే చేసే వ్యక్తికి తన లైఫ్ లో హత్య చేస్తాడని ఉంటే దాన్ని ఎలా డీల్ చేసాడు అని సస్పెన్స్ కామెడీగా తెరకెక్కించారు సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమాలు అంటే ఒక కామెడీ, క్లాసిక్ ఫీల్ ఉంటుంది. ఆయన ఓ ఫ్లాప్ తర్వాత ఈ సినిమాతో రావడంతో ఎలా ఉంటుందో అని ఆసక్తి నెలకొంది.
ఇక సినిమా మొదటి అరగంట కాస్త బోర్ కొడుతుంది. కాకపోతే ఆ అరగంటలో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సారంగపాణి జాతకంలో మర్డర్ చేస్తాడని చెప్పిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. అక్కడ్నుంచి సారంగపాణి, చందు కలిసి చేసే ప్రయత్నాలు ఫుల్ నవ్వులు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ సింపుల్ గానే ఉంటుంది. ఇంటర్వెల్ సమయానికి హీరోని చూసి పాపం అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ ని మించి ఫుల్ గా నవ్విస్తారు. క్లైమాక్స్ అరగంట అయితే ప్రతి సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ బాగా మైంటైన్ చేస్తూనే నవ్వించారు. సెకండ్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ ఒకే లొకేషన్ లో బోర్ కొట్టకుండా బాగా రాసుకున్నారు. నమ్మకం ఉంటే పర్వాలేదు కానీ మరీ దాన్ని ఒక మూఢనమ్మకంగా నమ్మితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి అని నవ్విస్తూ చెప్పారు. ఓవరాల్ గా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్లి చూసి నవ్వుకోవచ్చు.
నటీనటుల పర్ఫామెన్స్.. వరుసగా హిట్స్ కొడుతున్న ప్రియదర్శి ఈ సినిమాలో కూడా తన కామెడీ పర్ఫామెన్స్ తో బాగా నవ్వించాడు. తెలుగమ్మాయి రూప క్యూట్ గా కనిపిస్తూ మంచి ఎమోషన్ కూడా పండించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష ఇద్దరూ ఫుల్లుగా నవ్వించారు. వీళ్ళిద్దరి కామెడీకి పడీ పడీ నవ్వాల్సిందే. అవసరాల శ్రీనివాస్ ఓ గెస్ట్ పాత్రలో పరవాలేదు అనిపించాడు. తనికెళ్ల భరణి, వడ్లమాని శ్రీనివాస్, నరేష్, హర్షిణి.. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రలో బాగా నటించారు.
Also Read : Sodara : ‘సోదరా’ మూవీ రివ్యూ.. సంపూర్ణేష్ బాబు సినిమా ఎలా ఉందంటే..?
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం యావరేజ్. కాస్త కొత్త కథ తీసుకొని సస్పెన్స్ కామెడీగా కథాంశాన్ని బాగా రాసుకున్నారు క్లాసిక్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి. మరోసారి తన క్లాస్ కామెడీతో నవ్వించారు. కామెడీ పండించే డైలాగ్స్ మాత్రం బాగా రాసుకున్నారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘సారంగపాణి జాతకం’ సినిమా ఓ జాతకాల పిచ్చోడు తన లైఫ్ లో మర్డర్ చేస్తాడు అని చెప్పడంతో ఏం చేసాడు అని సస్పెన్స్ కామెడీతో ఆసక్తికరంగా తెరకెక్కించి నవ్వించారు. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.