తన సొంత హోటల్‌లోనే ఆత్మహత్య చేసుకున్న నిర్మాత కపాలి మోహన్.. వీడియోలో సీఎంకు విన్నపం..
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ కన్నడ నిర్మాత కపాలి మోహన్..

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ కన్నడ నిర్మాత కపాలి మోహన్..
యశవంతపుర : ప్రముఖ కన్నడ సినీ నిర్మాత, వ్యాపారవేత్త వికె మోహన్ అలియాస్ కపాలి మోహన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన సొంత హోటల్‌లోనే ఆయన సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. కన్నడ కంఠీరవ, స్వర్గీయ రాజ్‌కుమార్ బంధువైన కపాలి మోహన్ ఫైనాన్సియర్‌గా కూడా వ్యవహరించారు. పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు.
తీవ్ర ఆర్థిక నష్టాల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గంగమ్మగుడి పోలీసుస్టేషన్ పరిధిలోని బసవేశ్వర కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌కు సమీపంలో మోహన్ సుప్రీం అనే హోటల్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి మోహన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవటంఅందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతకు ముందు సదాశివనగరలో నివాసం ఉంటున్న మోహన్ తన స్నేహితుడు మంజునాథ్‌తో కలిసి భోజనం చేశాడు.
మోహన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు వీడియోలో తాను చివరిగా మాట్లాడారు. సీఎం, డీసీఎం లక్ష్మణ సవదికి విన్నపం చేస్తూ తనకు హోటల్లో తీవ్ర నష్టం వచ్చిందని, వేరే దారిలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మోహన్ మృతదేహాన్ని ఎమ్ఎస్ రామయ్య మెమోరియల్ హాస్పిటల్‌కు తరలించారు.