Jigarthanda Double X : జిగర్‌తండా డబల్ ఎక్స్ సినిమా రివ్యూ.. సాగదీస్తూనే ఎమోషన్ తో ఏడిపించి..
జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా రాఘవ లారెన్స్(Raghava Lawrence), SJ సూర్య మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్ దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న రిలీజ్ అయింది.

Raghava Lawrence SJ Suryah Jigarthanda Double X Movie Review and Rating
Jigarthanda Double X Review : కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraj) దర్శకత్వంలో గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా రాఘవ లారెన్స్(Raghava Lawrence), SJ సూర్య మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్ దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న రిలీజ్ అయింది. జిగర్తాండ సినిమా అన్ని భాషల్లో రీమేక్ చేసి కూడా హిట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
కథ విషయానికొస్తే..
కథ 1970ల కాలంలో జరుగుతుంది. రాష్ట్ర సీఎం పదవి కోసం పోటీ పడే ఇద్దరు వాళ్ళ కింద ఉన్న మనుషులతో అవతలి వాళ్ళ పనులని చెడగొడుతూ ఉంటారు. ఇలా నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఉన్న జయకృష్ణ(షైన్ టామ్ చాకో) ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో DSP గా పనిచేస్తున్న తన తమ్ముడు(నవీన్ చంద్ర)ను పిలిచి సీఎం పదవి ట్రై చేస్తున్న కారుమంచి(ఇళవరసు)టీంలో ఉన్న మెయిన్ నలుగురిని చంపమంటాడు. దీంతో జైలులో ఉన్న నలుగురు ఖైదీలను విడిపించి చంపమని పంపిస్తాడు. అడవి మనుషుల్లోంచి బయటకి వచ్చి రౌడీగా చలామణి అవుతుంటాడు సీజర్(రాఘవ లారెన్స్). ఒక గొడవలో సినిమాల్లో మొదటి నల్ల హీరో అవ్వాలని ఫిక్స్ అయి డైరెక్టర్ కోసం వెతుకుతున్న రౌడీ సీజర్(రాఘవ లారెన్స్)దగ్గరికి జైలు నుంచి బయటకి వచ్చిన రే దాసన్(SJ సూర్య)వస్తాడు. సినిమా పేరుతో అతని దగ్గర చేరి అతన్ని చంపాలని చూస్తూ ఉంటాడు. మరి రే దాసన్ సీజర్ ని చంపాడా? ఇద్దరిలో సీఎం ఎవరు అయ్యారు? సీజర్ ఎందుకు రౌడీగా మారాడు? రే దాసన్ సినిమా తీసాడా? అడవి మనుషుల కథేంటి అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
జిగర్తాండ సినిమాలో కూడా ఒక డైరెక్టర్ వచ్చి రౌడీ కథని సినిమాగా తీసి రౌడీని మంచివాడిగా మారుస్తాడు. ఈ కథలో కూడా పాయింట్ అదే అయినా దానికి సమాంతరంగా రెండు మూడు కథనాలు నడిపించాడు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. మొదటి హాఫ్ అంతా SJ సూర్య, రాఘవ లారెన్స్, మిగిలిన క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, SJ సూర్య లారెన్స్ దగ్గర చేరి సినిమా తీస్తాను అంటూ తిరగడం సాగుతుంది. సినిమా లెంగ్త్ మూడు గంటలు కావడంతో మొదటి హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో లారెన్స్ రౌడీ నుంచి మంచోడిగా మారే ప్రక్రియలో తన అడవికి వెళ్లి అక్కడ అడవిమనుషుల కష్టాలు తీర్చడం లాంటివి చూపించి సినిమా అయిపొయింది అనుకునేలోగా అసలు కథ అప్పుడే మొదలైందని ట్విస్ట్ లు ఇచ్చాడు డైరెక్టర్.
సెకండ్ హాఫ్ లో వచ్చిన ఎమోషన్ సీన్స్, ఏనుగుల సన్నివేశాలు, అడవి మనుషుల కష్టాలు ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ తో మరి సినిమా క్లైమాక్స్ ఏంటి అని ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లెంగ్త్ కూడా ఎక్కువే ఉంది సాగదీసినట్టు అనిపించినా క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టించడంతో పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే ఈ కథంతా చివర్లో ఒక సినిమాగా బయటకి రావడంతో సినిమా అనేది ఎంత గొప్ప మాధ్యమం అనేది చెప్తారు. టైటిల్ కి కథకి సంబంధం లేకపోయినా సినిమాలో ఓ రౌడీ గ్రూప్ పేరు జిగర్తాండ అని పెట్టి జస్టిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు.
నటీనటుల విషయానికొస్తే..
రౌడీగా రాఘవ లారెన్స్, డైరెక్టర్ గా SJ సూర్య ఇద్దరూ ది బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ గా నవీన్ చంద్ర కూడా మెప్పించాడు. సీఎం పదవి కోసం పోటీపడే పాత్రల్లో షైన్ టామ్ చాకో, ఇళవరసు బాగా చేశారు. లారెన్స్ భార్యగా నిమిషా సజయన్ ప్రేక్షకులని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. అక్కడక్కడా సత్యన్ కామెడీ పర్లేదనిపించింది.
టెక్నికల్ అంశాలకి వస్తే..
1970 లో జరిగిన కథలా చూపించడంతో అప్పటి కెమెరా విజువల్స్ వచ్చేలా కష్టపడ్డారు. సంతోష్ నారాయణన్ సంగీతం కూడా ఆ కాలానికి తగ్గట్టు ఇచ్చారు. డ్రెస్సింగ్, ఆర్ట్.. ఇలా అన్ని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా చూసుకున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడిగా మరోసారి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమా కొంచెం ల్యాగ్ అనిపించినా ప్రేక్షకులని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది.
మొత్తంగా.. ఓ రౌడీ మంచోడిగా మారే సమయంలో తన వాళ్ళ కోసం నిలబడితే ఏం జరిగింది అని, సమాజంలో జరిగే పలు సంఘటనలను సినిమా మాధ్యమం ద్వారా అందరికి చేర్చొచ్చు అనేదే జిగర్ తండా డబల్ ఎక్స్. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.