Lal Salaam : ‘లాల్ సలామ్’ రివ్యూ.. రజినీకాంత్ మొయినుద్దీన్ భాయ్ గా మెప్పించాడా?

సినిమాని ముఖ్యంగా రెండు మతాల మధ్య గొడవల అంశాన్ని తీసుకొని తెరకెక్కించారు. దానికి క్రికెట్, ఒక ఊరు, రాజకీయాలు జోడించారు.

Lal Salaam : ‘లాల్ సలామ్’ రివ్యూ.. రజినీకాంత్ మొయినుద్దీన్ భాయ్ గా మెప్పించాడా?

Rajinikanth Vishnu Vishal Lal Salaam Movie Review and Rating

Updated On : February 9, 2024 / 6:02 PM IST

Lal Salaam Review : రజినీకాంత్, విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) లు ముఖ్య పాత్రల్లో ఐశ్వర్య ర‌జినీకాంత్ (Aishwarya Rajinikanth) ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కిన లాల్ సలామ్ సినిమా నేడు ఫిబ్రవరి 9న తమిళ్, తెలుగు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే..
కసుమూరు అనే ఊళ్ళో MCC, 3 స్టార్స్ అనే రెండు క్రికెట్ టీమ్స్ మధ్యలో జరిగిన గొడవలో గురునాథం(విష్ణు విశాల్) వల్ల షంషు(విక్రాంత్) తీవ్రంగా గాయపడతాడు. దీంతో పోలీసులు గురుని అరెస్ట్ చేస్తారు. ఆ ఊరినుంచి వెళ్లి ముంబైలో పెద్ద బిజినెస్ మెన్ గా ఎదిగిన మొయినుద్దీన్ భాయ్(రజినీకాంత్) కొడుకు షంషుకి ఆ గొడవ గాయం వల్ల చెయ్యి తెసేయాల్సి రావడంతో ఊళ్ళో మత ఘర్షణలు చెలరేగుతాయి. పోలీసులు అందర్నీ అరెస్ట్ చేస్తారు. అప్పటివరకు కలిసి ఉన్న రెండు మతాల మధ్య ఇలా గొడవలు, కోర్టులు, కేసులు.. గురు వల్లే జరిగిందని అంతా గురుని విమర్శిస్తారు. మరో వైపు పక్కూరి వాళ్ళు కసుమూరి వాళ్ళ జాతరని చెడగొట్టి ఊరేగింపు రథం తమది అని తీసుకెళ్లిపోవడం, ఆ ఊరి పెద్దమనిషిని అవమానించడం చేస్తారు. అది కూడా గురు వల్లే జరిగిందని ఊరంతా అనుకుంటారు. గురు తల్లి(జీవిత)ని కూడా విమర్శించడంతో ఆమె ఊల్లోనుంచి వెళ్లిపొమ్మని గురుని తిడుతుంది.

గొడవల్లో జరిగిన గాయానికి షంషుకి కుడి చెయ్యి పోవడంతో క్రికెటర్ అవ్వాలన్న కల జరగదు అని తెలిసి గురుపై పగ పెంచుకుంటాడు షంషు. దీంతో గురుని షంషు ఏం చేసాడు? తన ఫ్రెండ్ కొడుకే ఇలా చేసాడని తెలిసి మొయినుద్దీన్ భాయ్ గురుని ఏం చేసాడు? గురు ఊళ్ళో మళ్ళీ తలెత్తుకొని బతుకుతాడా? ఊరికి సొంత రథం వచ్చిందా? అసలు క్రికెట్ గొడవ ఎవరి వల్ల జరిగింది? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
సినిమాని ముఖ్యంగా రెండు మతాల మధ్య గొడవల అంశాన్ని తీసుకొని తెరకెక్కించారు. దానికి క్రికెట్, ఒక ఊరు, రాజకీయాలు జోడించారు. అయితే రాజకీయాల కోసం మతఘర్షణలు సృష్టించడం అనేది గతంలో కొన్ని సినిమాల్లో చూసాం. దీంట్లో దానికి అదనంగా క్రికెట్, ఊరి జాతరని తీసుకున్నారు. ఇది పూర్తిగా తమిళ ఫ్లేవర్ తోనే ఉన్న సినిమా. తెలుగు వాళ్లకి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా క్రికెట్ లో గొడవ జరిగిందని చూపిస్తారు కానీ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని చూపించకుండా కేసులు, ఊళ్ళో గొడవలు, క్రికెట్ టీమ్స్ గురించి చూపిస్తారు. దీంతో ఫస్ట్ హాఫ్ అస్సలు అర్ధం కాదు.

అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలియాలంటే సెకండ్ హాఫ్ చూడాల్సిందే. సెకండ్ హాఫ్ లో అసలు గొడవ ఎందుకు వచ్చింది? తర్వాత ఆ గొడవలు ఎలా సాల్వ్ అయ్యాయి? ఊరికి వచ్చిన కష్టం, అది ఎలా తీరింది? అనేది చూపించారు. చివర్లో రెండు మతాల వాళ్ళు కలిసి ఉండాలి అనే మెసేజ్ తోనే ఎండ్ చేస్తారు.

Also Read : Eagle Review : ‘ఈగల్’ మూవీ రివ్యూ.. స్టైలిష్ యాక్షన్‌తో మెసేజ్ ఇచ్చిన రవితేజ..

నటీనటులు.. సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మొయినుద్దీన్ భాయ్ లాంటి పాత్రలో రజిని కనిపించడం ఇదే మొదటిసారి. ఈ పాత్రలో కూడా రజిని మెప్పించాడు. అయితే గెస్ట్ అప్పీరెన్స్ అనుకున్న వాళ్ళు సినిమా ఫుల్ లెంగ్త్ రజిని ఉండటంతో ఆశ్చర్యపోతారు. విష్ణు విశాల్.. గురు పాత్రలో ఒదిగిపోయాడు. విక్రాంత్ కూడా షంషు పాత్రలో మంచి క్రికెటర్ గా, తర్వాత చేయి పోయిందని బాధపడే కుర్రాడిగా మెప్పిస్తాడు. జీవిత రాజశేఖర్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కనిపించింది. సినిమా మొత్తం పూర్తిగా ఒక తల్లి పాత్రలో ఎమోషనల్ క్యారెక్టర్ తో అదరగొట్టింది అని చెప్పొచ్చు. అనంతిక, ధన్య బాలకృష్ణ చిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఇక సినిమాలో హైలెట్ కపిల్ దేవ్. కపిల్ దేవ్ ఆయన పాత్రలోనే షంషుకి క్రికెట్ నేర్పించే పాత్రలో కనిపించి కాసేపు అలరించారు.

సాంకేతిక విలువలు.. సినిమా మొత్తాన్ని ఓ పల్లెటూళ్ళో, ముంబైలో 1993లో జరిగినట్టు చూపించడంతో అప్పటికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగా చూపించారు. రజినీకాంత్ పాత్రకి మను కాకుండా సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడంతో సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. సినిమాలో తెలుగు డబ్బింగ్ చాలా పాత్రలకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు AR రహమాన్ ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా మిగిలిన సీన్స్ లో మాత్రం సోసో గా ఉంటుంది. పాటలు కూడా యావరేజ్ అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా కొంచెం కన్ఫ్యూజ్ గానే అనిపిస్తుంది. అసలు విషయం సెకండ్ హాఫ్ లో చెప్పడం కోసం ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసినట్టు ఉంటుంది స్క్రీన్ ప్లే. దర్శకురాలిగా మాత్రం ఐశ్వర్య ఓకే అనిపించింది.

మొత్తంగా ‘లాల్ సలామ్’ రెండు మతాల మధ్య ఘర్షణలు లేకుండా కలిసి ఉండాలని పూర్తిగా తమిళ ఫ్లేవర్ లో చెప్పే సినిమా.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే.