Eagle Review : ‘ఈగల్’ మూవీ రివ్యూ.. స్టైలిష్ యాక్షన్‌తో మెసేజ్ ఇచ్చిన రవితేజ..

మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ సినిమా ఈగల్ నేడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Eagle Review : ‘ఈగల్’ మూవీ రివ్యూ.. స్టైలిష్ యాక్షన్‌తో మెసేజ్ ఇచ్చిన రవితేజ..

Mass Maharaja Raviteja Eagle Movie Review and Rating

Eagle Movie Review : మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’. ఈ సినిమాలో కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్ గా నటించగా, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ సినిమా నేడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కథ విషయానికొస్తే..
ఓ నేషనల్ ఇంగ్లీష్ పేపర్ లో జర్నలిస్ట్ గా పనిచేసే నళిని(అనుపమ పరమేశ్వరన్) మార్కెట్ కి వెళ్లగా అక్కడ తలకోనలో దొరికే అరుదైన పత్తితో నేసిన ఒక క్లాత్ గురించి తెలుసుకుంటుంది. ఆ క్లాత్ ఫేమస్, దానికి చెందిన వ్యక్తి కనపడట్లేదు అని చిన్న వార్తగా తీసుకొని ఎక్కడో పేపర్లో చివరన వేస్తారు. అయితే అదే న్యూస్ రా, సిబిఐ లాంటి సంస్థలు చూసి నళిని పనిచేసే సంస్థపై దాడి చేస్తాయి. దీంతో నళిని జాబ్ పోవడంతో అంత చిన్న న్యూస్ కి ఎందుకు అందరూ రియాక్ట్ అవుతున్నారు అని తలకోన వెళ్లి దాని గురించి తెలుసుకోవడం మొదలుపెడుతుంది.

తలకోనలో ఒక్కొక్కరిని అడుగుతూ ఆ పత్తి గురించి, ఆ పత్తిని విదేశాల్లో ఫేమస్ చేసిన సహదేవ్ వర్మ(రవితేజ) గురించి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో అతను ఈగల్ అని ప్రపంచ దేశాలు అతని కోసం వెతుకుతున్నారని, మరో పక్క అక్రమాయుధాల రవాణాలో ఆయుధాలు సరఫరా చేసేవాళ్ళని ఎవరో చంపి ఆ ఆయుధాల్ని మాయం చేయడం, సహదేవ్ వర్మ మీద జరిగిన దాడి, అతను ఆయుధాలతో ఎదుర్కున్న కథ.. ఇలా పూర్తిగా అతని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటుంది నళిని. అసలు సహదేవ్ వర్మ ఎవరు? అతని గతం ఏంటి? అతను గతాన్ని వదిలేసి పత్తి రైతుగా ఎందుకు బతుకుతున్నాడు? అక్రమాయుధాలకు సహదేవ్ వర్మకు ఉన్న లింక్ ఏంటి? రా, సిబిఐ లాంటి వాళ్ళు ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు. ఈగల్ ఏం చేసాడు? నళిని అతని గురించి పూర్తిగా తెలుసుకుందా? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
ఒక చెడు మార్గంలో ప్రయాణించే హీరో లైఫ్ లోకి ఒక హీరోయిన్ వచ్చి అతన్ని మార్చి ఆమె చనిపోతే ఆమె కోసం ఊరు, పేరు మార్చి హీరో మంచిగా బతికే సినిమాలు గతంలో వచ్చాయి. కథ పరంగా చూస్తే ఈ సినిమా కూడా అంతే. అయితే ఈ కథకి ఒక మంచి మెసేజ్ ని మాత్రం జోడించి దాన్ని యాక్షన్ సినిమాలా చెప్పారు. అక్రమాయుధాల రవాణా, వాటితో జరిపే కాల్పుల్లో సాధారణ ప్రజలు చనిపోవడం లాంటి అంశాన్ని మాత్రం ఇదే మొదటిసారి చూపించడం. ఇక స్క్రీన్ ప్లేని గతం, వర్తమానంలోకి మారుస్తూ కథని చెప్పడంతో కొంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది.

మొదటి హాఫ్ అంతా నళిని అసలు సహదేవ్ వర్మ ఎవరు అని తెలుసుకోవడం ఉంటే, సెకండ్ హాఫ్ లో అతని గతం కథని చూపిస్తారు. కామెడీ సపరేట్ గా ట్రాక్ లేకపోయినా అజయ్ ఘోష్ తో అక్కడక్కడా కొంచెం ట్రై చేసారు. క్లైమాక్స్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అదుర్స్ అనిపిస్తాయి. తుపాకులతో, ఆయుధాలతో కొత్త కొత్త ప్రయోగాలు అన్నీ చేసారు ఇందులో. అవన్నీ వావ్ అనిపిస్తాయి. సినిమాలో రవితేజ – కావ్య థాపర్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మాత్రం చాలా కొత్తగా ఉండి ప్రేక్షకులని మెప్పిస్తాయి. ఇక చివర్లో ఈ సినిమాకు పార్ట్ 2 అనౌన్స్ చేయడం గమనార్హం.

నటీనటుల విషయానికొస్తే..
మాస్ మహారాజ రవితేజ ఎప్పట్లానే అదరగొట్టేసాడు. ఫుల్ హెయిర్, గడ్డంతో కొత్త లుక్ లో, యాక్షన్ సీన్స్ లో మరింత మెప్పించాడు. అనుపమ పరమేశ్వరన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో ఓకే అనిపించింది. రవితేజకి జోడిగా కావ్య థాపర్ ప్రేమ సన్నివేశాల్లో క్యూట్ గా కనిపించి అలరించింది. రవితేజ పక్కనే ఉండే పాత్రలో నవదీప్, రా ఆఫీసర్స్ గా అవసరాల శ్రీనివాస్, మధుబాల మెప్పిస్తారు. ఊరి ఎమ్మెల్యేగా అజయ్ ఘోష్ అక్కడక్కడా కామెడీతో నవ్విస్తాడు. వినయ్ రాయ్ చిన్న పాత్ర అయినా క్లైమాక్స్ లో యాక్షన్, ఎమోషన్ తో పర్వాలేదనిపిస్తాడు.

సాంకేతిక అంశాలు..
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ నుంచి దర్శకుడిగా మారడంతో విజువల్స్ మాత్రం చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. యాక్షన్, ఎలివేషన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. పాటలు మాత్రం యావరేజ్ అనిపిస్తాయి. కథ, దానికి జోడించిన మెసేజ్ మాత్రం బాగున్నా కథనంలో గతం, వర్తమానంకి నడిపిస్తుండటంతో కన్ఫ్యూజ్ అవుతారు ప్రేక్షకులు. గన్స్, బులెట్స్, కొత్త కొత్త ఆయుధాలతో ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగా చేసారు. కొన్ని సీన్స్ లో మాత్రం ఆర్ట్ డైరెక్టర్ చేసిన ఆర్ట్ వర్క్ ని మెచ్చుకోకుండా ఉండలేము. ఇక సినిమా కోసం నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ పెట్టిన ఖర్చు స్క్రీన్ పై అద్భుతంగా కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్ లో చెప్పినట్లే.. 100 కోట్ల ఖర్చు పెట్టి అద్భుతమైన క్వాలిటీ రప్పించడం కాకుండా, తక్కువ బడ్జెట్ తో అదిరిపోయే అవుట్ ఫుట్ ని చూపించి ఆడియన్స్ చేత.. హాలీవుడ్ స్థాయి విజువల్స్ అనే కామెంట్స్ సంపాదించుకున్నారు.

మొత్తంగా ‘ఈగల్’ సినిమా చెడు మార్గంలో ప్రయాణించే ఓ వ్యక్తి భార్య కోసం మంచి మనిషిగా మారి అక్రమాయుధాలు ప్రపంచంలో ఉండకూడదు, ఆయుధం అనేది కాపాడే వాడి చేతిలోనే ఉండాలి కానీ, అర్హత లేని వాళ్ళ చేతిలో ఉండకూడదు అని మంచి మెసేజ్ ని స్టైలిష్ యాక్షన్ గా చెప్పిన సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే.