ఆర్జీవీ ‘‘పవర్‌స్టార్’’ మూవీ రివ్యూ..

రామ్ గోపాల్ వర్మ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘పవర్‌స్టార్’ సినిమా తీశాడు. ట్రైలర్, పాటలతో అంచనాలు పెంచేసిన వర్మ ఈరోజు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో ‘పవర్‌స్టార్’ మూవీని రిలీజ్ చేశాడు. మరి ‘పవర్‌స్టార్’లో ఉన్న పవర్ ఎంత? దాన్ని వర్మ ఎలా చూపించాడు? తెలిసిన కథే.
ఓ హీరో పార్టీ పెట్టి ఎన్నికల్లో ఓడిపోతాడు. రెండు చోట్ల పోటీ చేస్తే.. ఒక్క సీటూ గెలవడు. ఆ తరవాత తన అంతర్మథనం ఏమిటి? భజన బ్యాచ్ గోలేమిటి? అన్నయ్య స్టార్‌మెగా ఇచ్చిన సలహా ఏమిటి? గుండ్ల రమేష్ అనే నిర్మాత చేసిన హంగామా ఏమిటి? చివర్లో ఆర్జీవీ వచ్చి ఇచ్చిన బూస్టప్ ఎలాంటిది? ఇదంతా కలిస్తే.. ‘పవర్‌స్టార్’. మొత్తంగా 32 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఇది. ట్రైలర్‌లో ఏదైతే చూపించాడో.. అదే సినిమాలోనూ ఉంది. రెండు చోట్లా ఓడిపోయానన్న అంతర్మథనంతో సినిమా మొదలవుతుంది.
‘నటన రాదు. అయినా నన్ను పవర్‌స్టార్‌ని చేశారు’ అంటూ ఇంట్లో టీవీలు బద్దలు కొట్టడంతో.. బోణీ చేశాడు వర్మ. ఆ తరవాత చెంపదెబ్బ సీన్. త్రివిక్రమ్ ని పోలిన పాత్ర సృష్టించి ఆ పాత్రని రంగ ప్రవేశం చేయించాడు వర్మ. ‘స్వామి’ అనే మేనరిజం ఎవరిదో… గురూజీ అభిమానులకు బాగా తెలుసు. పాత సినిమాల్ని అటూ ఇటూ మార్చి కథలు చెబుతాడన్న సెటైర్ త్రివిక్రమ్ పై వేశాడు వర్మ. ‘అజ్ఞాతవాసి’ని కాస్త… ‘జిజ్ఞాతవాసి’ గా మార్చాడు. ఇక మూడో సీన్ లో ‘అన్నయ్య’ రంగ ప్రవేశం. ‘సినిమా వేదికలపై నేను చిరు తమ్ముడి అని చెప్పుకుంటావ్. రాజకీయ సభల్లో మాత్రం నేను కానిస్టేబుల్ కొడుకుని అంటావు. నువ్వు పవర్‌స్టార్ అయ్యింది నా తమ్ముడిగానా? కానిస్టేబుల్ కొడుకుగానా’ అంటూ అన్నయ్య ప్రశ్నించడం ఆ సీను సారాంశం.
కత్తి మహేష్ తో ఇంటర్వ్యూ. ‘అన్నింట్లోనూ బూతులు వెదికే మీలాంటోళ్లు.. ఇలా ఆలోచించకపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అంటూ కత్తి పైనే సెటైర్ వేయించాడు వర్మ. అక్కడ అభిమానుల ప్రవర్తనపై కొన్ని చురకలు పడ్డాయి. జిజీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వెనుక పవర్‌స్టార్ తో లాజిక్ వర్మ స్టైల్ లో సాగింది. అసలు పవన్, కత్తి మధ్య గొడవలు మహేష్, తారక్ ఫ్యాన్స్ పనే అని చెప్పడం మరో వివాదానికి తావిచ్చేలా ఉంది. బుల్ బుల్ కృష్ణ, సాగార్జునల ప్రస్తావన కూడా అంతే. మధ్యమధ్యలో పూణే నుంచి ఫోన్ రావడాన్ని కామెడీ కోసం వాడుకున్నాడు వర్మ. కత్తితో ఇంటర్వ్యూలో ఉండగా ప్రవన్ కి పూణె నుంచి ఫోన్ వస్తుంది. ‘మీరు ఫోన్ ఎత్తలేదంటే మేడమ్ ఇంకో ఇంటర్వ్యూ ఇస్తారు’ అని ప్రవన్ సహాయకుడు అంటే.. ‘అమ్మో..ఆ ఇంటర్వ్యూ చూడ్డం కంటే ఈ ఇంటర్వూ ఆపడం మేలు’ అంటూ కామెడీ చేశాడు వర్మ. సెవన్ ఓ క్లాక్ బ్లేడు నుంచి, ప్యాకేజీ స్టార్ వరకూ.. సోషల్ మీడియాలో జరిగిన అన్ని వ్యవహారాల్నీ వాడుకున్నాడు వర్మ.
చివరి సీన్‌లో వర్మ ఆగమనం. ప్రవన్ కి గీతోపదేశం చేస్తాడు. ‘2024 ఎన్నికల్లో గెలిచేది మీరే’ అంటూ బూస్టప్ ఇస్తాడు. పవన్ కాలికింద కూర్చుని వోడ్కా తాగుతూ.. పవన్ ని కీర్తిస్తాడు. నిజానికి వర్మకి పవన్ పై కంటే.. ‘ఇజం’ పుస్తకంపై ఎక్కువ కోపం అనిపిస్తుంది. ఆ పుస్తకం రాసిన గాజు తేజ (పేరు మార్చాడు) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు వర్మ. స్కూలు పిల్లాడి బుర్రతో ఆలోచించి ఈ పుస్తకం రాశాడని, అదే పవన్ ని తప్పుదారి పట్టించిందని నిప్పులు చెరిగాడు. వర్మ సిగరెట్టు ఆర్పడానికి చెగొవెరా బొమ్మని వాడుకోవడం వెనుక ఉద్దేశ్యం…స్పష్టంగా అర్థం అవుతుంది. పవన్ అభిమానులకు నచ్చే విషయాలు కొన్ని ఈ షార్ట్ ఫిల్మ్‌లో కనిపిస్తాయి.
పవన్ పైసా కూడా ప్యాకేజీ తీసుకోలేదని… వర్మ నమ్మినట్టు ఉన్నాడు. అదే ఈ సినిమాలో చూపించాడు.‘మీలో ఉన్న సిన్సియారిటీని సెక్స్ కంటే ఎక్కువ ఇష్టపడతా’ అంటూ పవన్ ని మోసేశాడు. ప్రవణ్, వర్మని కౌగిలించుకోవడంతో శుభం కార్డు వేశాడు. చాలా తక్కువ ఖర్చుతో ఈ సినిమా పూర్తి చేశాడు వర్మ. ఇదో కథలా కాదు. బిట్లు బిట్లుగా ఉంటుంది. పవన్‌పై సెటైర్ కాబట్టి పవన్ యాంటీ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వొచ్చు. కాకపోతే.. అందరికీ తెలిసిన విషయాలే.. వర్మ చెప్పాడు. కొత్తగా తాను లెన్స్ పెట్టి చూపించిందేం లేదు. చివర్లో వర్మ ‘కాళ్ల’ బేరానికి రావడం చూస్తే.. సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నించాడు అనిపిస్తుంది..