Devika & Danny : ‘దేవిక & డానీ’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఆత్మతో టీచర్ ప్రయాణం..

హీరోయిన్‌ రీతూ వర్మ నటించిన మొదటి వెబ్ సిరీస్ దేవిక అండ్‌ డానీ.

Devika & Danny : ‘దేవిక & డానీ’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఆత్మతో టీచర్ ప్రయాణం..

Ritu Varma Surya Vashistta Siva Kandukuri Devika & Danny Jio Hotstar Web Series Review

Updated On : June 6, 2025 / 8:53 PM IST

Devika & Danny Web Series Review : హీరోయిన్‌ రీతూ వర్మ నటించిన మొదటి వెబ్ సిరీస్ దేవిక అండ్‌ డానీ. జాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై సుధాకర్ చాగంటి నిర్మాణంలో బి. కిశోర్‌ దర్శకత్వంలో ఈ సిరీస్‌ తెరకెక్కింది. దేవిక అండ్‌ డానీ వెబ్ సిరీస్ నేడు జూన్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో సూర్య వసిష్ఠ, శివ కందుకూరి, సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్, శివన్నారాయణ, మౌనిక రెడ్డి.. పలువురు కీలక పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. తను పుట్టి పెరిగిన పల్లెటూళ్ళోనే దేవిక(రీతూ వర్మ) మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఊరి చుట్టుపక్కల దాటి ఎప్పుడూ బయటకి వెళ్ళలేదు. అసలు ఎవరి మాటకు ఎదురు చెప్పకుండా సైలెంట్ గా అన్నిటికి తల ఊపుతూ ఉండే అమ్మాయి దేవిక. దేవిక తాతయ్య పూజలు, హోమాలు చేస్తూ ఉంటారు. ఆయనకు ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటితో మాట్లాడటానికి నిరాకరిస్తాడు. దేవిక తనకు నచ్చకపోయినా ఇంట్లోవాళ్ళు చెప్పడంతో జగ్గీ(సుబ్బరాజు)తో నిశ్చితార్థం చేసుకుంటుంది. ఆ తర్వాత డానీ(సూర్య వసిష్ఠ) పరిచయం అవుతాడు. దీంతో దేవిక తన లైఫ్ లో ఏదో కోల్పోయాను అని తెలుసుకోవడం, డానీపై ఇష్టం ఏర్పడటం జరుగుతుంది. కానీ డానీ ఒక ఆత్మ అని తెలియడంతో షాక్ అవుతుంది.

డానీ తనకు ఒక సహాయం కావాలని, మీ తాతయ్య అసలు కలవనివ్వట్లేదని, తను ఓ తప్పు చేసానని బతిమాలడంతో ఒప్పుకొంటుంది. మరో వైపు దుర్గ, అతని మనుషులు డానీని వెతుకుతూ ఉంటారు. డానీ చేయాల్సిన తప్పుని సరిదిద్దడానికి దేవిక.. సుబ్బు(శివ కందుకూరి)సహాయంతో హైదరాబాద్ వెళ్తుంది. దేవిక ఇంట్లోంచి వెళ్లిపోయిందని తెలిసి జగ్గీ.. దేవిక ఫ్యామిలీని తీసుకొని హైదరాబాద్ బయలుదేరతాడు. అసలు డానీ ఎలా చనిపోయాడు? డానీ ఆత్మ దేవికకు ఎందుకు కనిపిస్తుంది? డానీ చేసిన తప్పేంటి? అసలు డానీ ఎవరు? హైదరాబాద్ వెళ్లి దేవిక – సుబ్బు లు ఏం చేసారు? డానీ చేసిన తప్పుని సరిదిద్దరా? జగ్గీ దేవికాని కలిశాడా? దేవిక జగ్గీని పెళ్లి చేసుకుంటుందా..తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

Also Read : Badmashulu : ‘బద్మాషులు’ మూవీ రివ్యూ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తాగుబోతుల కామెడీ..

సిరీస్ విశ్లేషణ.. ఇటీవల సినిమా స్టార్స్ అంతా వెబ్ సిరీస్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా రీతూ వర్మ మొదటిసారి వెబ్ సిరీస్ లో ఈ దేవిక & డానీ లో నటించింది. ఊళ్ళో సింపుల్ గా అమాయకంగా బతికే ఓ అమ్మాయికి ఆత్మ కనిపిస్తే ఆ ఆత్మ కోసం, తన కోసం ధైర్యం చేసి ఏం చేసింది అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ని ఏడు ఎపిసోడ్స్, ఒక్కో ఎపిసోడ్ సుమారు అరగంట ఉండేలా తెరకెక్కించారు.

అయితే ఫస్ట్ ఎపిసోడ్ అంతా సీరియల్ లా సాగుతుంది. సెకండ్ ఎపిసోడ్ చివర్లో డానీ ఆత్మ అని తెలియడంతో సిరీస్ పై ఆసక్తి నెలకొంటుంది. అయితే అప్పటివరకు డానీ ఆత్మ అనే సందేహం రాకుండా చాలా బాగా నడిపించారు. కామెడీ, లవ్, హారర్, యాక్షన్.. ఇలా అన్ని కలగలిపి చూపించారు. డానీ ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్ బాగుంటుంది. కోవై సరళ పాత్ర బాగా రాసుకున్నారు. దేవిక తాతయ్య పాత్రకు బాగా బిల్డప్స్ ఇచ్చారు కానీ ఆ పాత్ర గురించి పూర్తిగా క్లారిటీ ఇవ్వకుండా వదిలేసారు. అక్కడక్కడా జగ్గీ పాత్ర, దేవిక ఫ్రెండ్స్, సుబ్బు పాత్రలతో కామెడీ బాగానే వర్కౌట్ చేసారు. అయితే మొదట్లో దేవిక – డానీ మధ్య వచ్చే సీన్స్ రొటీన్ లవ్ స్టోరీ సీన్స్ లా అనిపిస్తాయి. వెబ్ సిరీస్ అంటే ప్రతి ఎపిసోడ్ కి ఒక ఆసక్తికర ఎండింగ్ ఉండి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా ఉండాలి అని భావిస్తారు ప్రేక్షకులు. కానీ ఒక్క సెకండ్ ఎపిసోడ్ కి తప్ప మిగిలిన ఎపిసోడ్స్ అన్ని ఎండింగ్స్ సింపుల్ గానే ఉంటాయి. ఒక ఆత్మకి హెల్ప్ చేయడం అనే కథ ముని, కాంచన.. లాంటి అనేక సినిమాల్లో చూసేసాం. అయితే అవి హారర్ గా చూపిస్తే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూపించారు. అక్కడక్కడా కాస్త ల్యాగ్ అనిపించినా ఓపిక ఉంటే ఫ్యామిలీతో చూసేయొచ్చు.

devika and danny

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇన్నాళ్లు సినిమాల్లో మెప్పించిన రీతూ వర్మ ఈ వెబ్ సిరీస్ లో అమాయకపు పల్లెటూరి అమ్మాయిలా, తన కోసం తాను నిలబడే ఓ మహిళగా రెండు వేరియేషన్స్ లో బాగా నటించింది. డానీ పాత్రలో సూర్య వసిష్ఠ లవర్ బాయ్ లా కనిపిస్తూనే నటనతో కూడా మెప్పించాడు. శివ కందుకూరి అక్కడక్కడా నవ్విస్తూ బాగానే నటించాడు. సుబ్బరాజు సీరియస్ గా ఉంటూనే కామెడీ కూడా చేస్తూ నవ్వించాడు. గోపరాజు రమణ, పల్లెటూళ్ళో మోడ్రన్ టీచర్ గా మౌనిక రెడ్డి, దేవిక ఫ్రెండ్ గా సోనియా సింగ్, ఐశ్వర్య, నెగిటివ్ షేడ్స్ లో అభినయశ్రీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించి అలరించారు.

Also Read : Gamblers : ‘గ్యాంబ్లర్స్’ మూవీ రివ్యూ.. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ సినిమా ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సింపుల్ గా బాగుంది. సిరీస్ సగ భాగం పల్లెటూళ్ళో పచ్చని పొలాల్లో షూటింగ్ చేసి అందమైన లొకేషన్స్ చూపించారు. రెగ్యులర్ కథే అయినా సింపుల్ కథనంతో తెరకెక్కించారు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘దేవిక & డానీ’ సిరీస్.. పల్లెటూళ్ళో ఉండే ఓ అమాయక టీచర్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఆత్మకు ఎలా సహాయం చేసింది, తనని తాను ఎలా మార్చుకుంది అని చూపించారు.

గమనిక : ఈ వెబ్ సిరీస్ రివ్యూ కేవలం విశేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.