Subham : ‘శుభం’ మూవీ రివ్యూ.. సమంత నిర్మాతగా మొదటి సినిమా ఎలా ఉంది?
ఇది సమంతకు నిర్మాతగా మొదటి సినిమా కావడం గమనార్హం.

Samantha Harshith Reddy Shriya Kontham Shalini Kondepudi Subham Movie Review and Rating
Subham Movie Review : ట్రాలాలా బ్యానర్ పై సమంత నిర్మాణంలో ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శుభం’. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. శుభం సినిమా నేడు మే 9న థియేటర్స్ లో రిలీజయింది. ఆల్రెడీ గత రెండు రోజులు పలు నగరాల్లో శుభం సినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. ఇది సమంతకు నిర్మాతగా మొదటి సినిమా కావడం గమనార్హం.
కథ విషయానికొస్తే.. భీముని పట్నం అనే ఊళ్ళో శ్రీనివాస్(హర్షిత్ రెడ్డి) కేబుల్ టీవీ నడిపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడే డిష్ టీవీలు వచ్చి తన వ్యాపారాన్ని దెబ్బ తీస్తాయి. అదే సమయంలో శ్రీనివాస్ కి శ్రీవల్లి(శ్రియ కొణతం)తో పెళ్లి అవుతుంది. శోభనం రోజు రాత్రి సరిగ్గా 9 గంటలకు శ్రీవల్లి టీవీ పెట్టుకొని జన్మ జన్మల బంధం అనే సీరియల్ చూస్తూ కూర్చుంటుంది. తనని కదిలిస్తే వింతగా ప్రవర్తించి, దయ్యం పట్టినట్టు భయపెడుతుంది. శ్రీనివాస్ ఈ విషయాన్ని తన ఇద్దరు ఫ్రెండ్స్(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి)లతో చెప్తాడు. వాళ్ళ భార్యలు కూడా ఆ సమయానికి అదే సీరియల్ చూస్తూ అలాగే బిహేవ్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఊళ్ళో చాలా మంది ఇళ్లల్లో ఆడవాళ్లు ఆ సీరియల్ టైంకి ఇలాగే వింతగా బిహేవ్ చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో శ్రీనివాస్ అతని ఫ్రెండ్స్ దగ్గర్లో ఉండే ఓ మాతాజీ(సమంత) దగ్గరికి వెళ్లి తమ సమస్య చెప్పి పరిష్కారం అడుగుతారు. మరి మాతాజీ ఏం పరిష్కారం ఇచ్చింది? ఊళ్ళో ఆడవాళ్లు సీరియల్ ని ఎందుకు అలా చూస్తున్నారు? ఎన్నో ఎపిసోడ్స్ గా సాగుతున్న ఆ సీరియల్ అయిపోయిందా? వాళ్లకు పట్టిన దయ్యం ఎవరు? ఆ సీరియల్ వల్ల ఊళ్ళో మగాళ్లు పడ్డ ఇబ్బందులు ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Hari Hara Veera Mallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ‘బుక్ మై షో’.. ఎప్పుడో తెలుసా?
సినిమా విశ్లేషణ.. కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సమంత నిర్మాతగా సినిమా తీసింది అని తెలియడంతో ఈ శుభంపై అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ తక్కువే చేసినా కొత్తగా చేయడానికి ప్రయత్నించారు. రెండు రోజుల ముందు నుంచి కూడా ప్రీమియర్స్ వేయడం గమనార్హం. ఈ కథ అంతా ఓ 15 ఏళ్ళ క్రితం జరుగుతుంది. డిష్ టీవీలు వచ్చిన కొత్తల్లో ఈ కథ జరిగినట్టు చూపించారు. అప్పటి నేపథ్యం ఎందుకు తీసుకున్నారు, హీరో కేబుల్ టీవీ ఆపరేటర్, సీరియల్స్ ఇలా అన్నిటికి పర్ఫెక్ట్ గా కనెక్షన్ ఇచ్చారు.
ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడం, పెళ్లి, సీరియల్ ని ఆడవాళ్లు వింతగా చూడటం, భర్తల్ని భయపెట్టడం, మాతాజీ దగ్గరికి పరిష్కారం కోసం వెళ్లడంతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ సీరియల్స్ తో ఇంట్లో భర్తలు ఇంకా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎలా పరిష్కరించారు అని చూపించారు. సినిమా అంతా ఒక చిన్న పాయింట్ తీసుకొని కొంచెం సాగదీసారు. అక్కడక్కడా కామెడీ అయితే బాగానే వర్కౌట్ చేసారు. కొంతమంది ఆడవాళ్లు సీరియల్స్ కి ఎంతగా అడిక్ట్ అయ్యారు అనేది కామెడీగా చూపించారు.
సమంత ఓ రెండు సార్లు సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా ఆ పాత్రకు పెద్ద స్కోప్ లేదు. ఏదో ప్రమోషన్ కోసం, ఫ్యాన్స్ కోసం సమంతని పెట్టినట్టు ఉంటుంది. ఇక సినిమాలో చాలా సేపు ఆ జన్మ జన్మల బంధం సీరియల్ చూపించినా కథే దాని చుట్టూ తిరుగుతుంది కాబట్టి తప్పదు అనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడి మొదటి సినిమా పాత్రలను ఇందులోకి తీసుకొచ్చి కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని చూపించడం బాగానే వర్కౌట్ అయింది. సీరియల్ చూపించి బాగానే నవ్వించారు. అక్కడక్కడా హారర్ తో కాస్త భయపెట్టారు కూడా. ఫ్యామిలీతో వెళ్లి సరదాగా నవ్వుకోడానికి ఒకసారి చూసేయొచ్చు.
నటీనటుల పర్ఫరామెన్స్.. దయ్యం పట్టినట్టు, సీరియల్స్ చూసి వింతగా ప్రవర్తించి భయపెట్టే పాత్రల్లో శ్రియ కొణతం అదరగొట్టింది. అలాంటి పాత్రల్లోనే శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి కూడా బాగా నటించారు. హరీష్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి కూడా వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. వంశీధర్ గౌడ్ అక్కడక్కడా నవ్వించాడు. సమంత పాత్ర కేవలం ఫ్యాన్స్ కోసమే. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. కథ ఓ 15 ఏళ్ళ క్రితం జరగడంతో అప్పటికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా అక్కర్లేని చోట చాలా సార్లు హారర్ బీజీఎమ్ ఇచ్చి భయపెట్టాలని ప్రయత్నించారు. సినిమా అంతా ఆల్మోస్ట్ ఒకే ఊళ్ళో, తక్కువ లొకేషన్స్ లోనే చేసేసారు. అప్పటి కాలానికి తగ్గట్టు డిష్ సెటప్స్, పెద్ద టీవీలు, కేబుల్ టీవీ సెటప్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా పనిచేసింది. కథ పరంగా కొత్త పాయింట్ తీసుకున్నా కథాంశం మాత్రం కాస్త సాగదీసి నవ్వించారు. డైరెక్టర్ తన రెండో సినిమాతో మరోసారి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘శుభం’ సినిమా సీరియల్ పిచ్చి ఉన్న ఆడవాళ్ళతో మగవాళ్ళు ఎలా ఇబ్బందులు పడ్డారు అని హారర్ కామెడీగా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.