Devil’s Double Next Level : ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ మూవీ రివ్యూ.. రివ్యూలు చెప్పే వాళ్ళ మీద పగతో దయ్యంగా మారిన డైరెక్టర్ ఏం చేసాడంటే..?
DD నెక్స్ట్ లెవల్ సినిమా ఒక సెటైరికల్ హారర్ కామెడీ. రివ్యూలు ఇచ్చేవారిపై, సినిమాలపై కౌంటర్లు వేస్తూ తెరకెక్కించారు.

Santhanam Arya Kasthuri Devil's Double Next Level Movie Review
Devil’s Double Next Level Movie Review : తమిళ్ స్టార్ కమెడియన్ సంతానం మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’. హీరో ఆర్య, వెంకట్ బోయినపల్లి నిర్మాణంలో ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 16న తమిళ్ లో థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు DD నెక్స్ట్ లెవల్ సినిమా జీ5 ఓటీటీలోకి వచ్చింది. నేడు జూన్ 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ సినిమా. సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతిక తివారీ, యషిక ఆనంద్, కస్తూరి, నిజలగల్ రవి.. పలువురు కీలక పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. హిచ్ కాక్ ఇరుతిరాజ్(సెల్వ రాఘవన్) ఓ డైరెక్టర్. అతని సినిమాలు ఫెయిల్ అయి చనిపోవడంతో దయ్యంగా మారుతాడు. రివ్యూల వల్లే తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని ఓ పాడుబడిన థియేటర్ కి రివ్యూలు చెప్పే వాళ్ళని పిలిపించి చంపేస్తూ ఉంటాడు. కొంతమంది రివ్యూలు ఇచ్చే ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చంపేస్తూ ఉంటాడు.
కిస్సా(సంతానం) ఓ స్టార్ రివ్యూయర్. యూట్యూబ్ లో సినిమాలకు రివ్యూలు ఇస్తూ ఉంటాడు. ఇతనికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఓ రోజు ఇతనికి స్పెషల్ షో అని టికెట్ పంపించి ఆ పాడుబడిన థియేటర్ కి రప్పిస్తారు. అనుకోకుండా కిస్సా తండ్రి(నిజలగల్ రవి), తల్లి(కస్తూరి), చెల్లి(యషిక ఆనంద్), గర్ల్ ఫ్రెండ్(గీతికా తివారి)లు కూడా ఆ థియేటర్ కి వస్తారు. మరో రివ్యూయర్ టైం పాస్ బాబు(రాజేంద్రన్) అనుకోకుండా ఆ థియేటర్ కి వస్తాడు. ఆ థియేటర్ లో హిచ్ కాక్ దయ్యం కనిపించి వీళ్ళందర్నీ మరో ప్రపంచానికి పంపిస్తాడు. కిస్సా, టైం పాస్ బాబు తప్ప మిగిలినవాళ్ళకి ఇదేమి గుర్తుండదు. వీళ్లంతా ఓ షిప్ లో వెళ్తూ ఓ ఐలాండ్ దగ్గర ఆగుతారు. ఆ ఐలాండ్ లో కొన్ని ప్రమాదాలు ఉంటాయి. ఆ ఐలాండ్ లో దయ్యం తన గర్ల్ ఫ్రెండ్ అని ఆశ్చర్యపోతాడు కిస్సా. తన ఫ్యామిలీ కూడా వివిధ పాత్రల్లో ఉంటారు. హిచ్ కాక్ ఇదంతా సినిమా అని, ఆ సినిమాలో అందర్నీ కాపాడి నువ్వు బయటకు రావాలని కిస్సాకు చెప్తాడు. దీంతో ఆ ఐలాండ్ లో తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? తన గర్ల్ ఫ్రెండ్ దయ్యం అవ్వకుండా గతంలోకి వెళ్లి ఏం చేసాడు? చివరికి రివ్యూల గురించి కిస్సా ఏం చెప్పాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Allu Arjun – Basil Joseph : మలయాళం స్టార్ హీరో డైరెక్టర్ గా.. అల్లు అర్జున్ తో సూపర్ హీరో సినిమా?
సినిమా విశ్లేషణ.. DD నెక్స్ట్ లెవల్ సినిమా ఒక సెటైరికల్ హారర్ కామెడీ. రివ్యూలు ఇచ్చేవారిపై, సినిమాలపై కౌంటర్లు వేస్తూ తెరకెక్కించారు. ఇలాంటి సినిమాల్లో లాజిక్స్, కథ, కథనాలు వెతక్కూడదు. ఒక స్పూఫ్ సినిమా చూసినట్టే. గతంలో దుల్కర్ సల్మాన్ హిందీలో రివ్యూలు ఇచ్చేవాళ్ళని చంపే కథతో చుప్ అనే సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేసాడు. ఈ DD నెక్స్ట్ లెవల్ సినిమా అదే కథతో మొదలుపెట్టినా హారర్ కామెడీగా తెరకెక్కించారు.
సినిమాలో కాస్త కష్టంగా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. బాగా రాసుకున్నా అది సాధారణ జనాలకు అర్ధం అవ్వాలంటే కాస్త కష్టమే. అయితే అక్కడక్కడా బాగానే నవ్వించి నెక్స్ట్ ఏంటి అనే ఆసక్తిని కలిగించారు. ఫస్ట్ హాఫ్ లో కథ పరిచయంతో కాస్త సాగదీసినా సినిమాలో సినిమా జరుగుతుంది అనే స్క్రీన్ ప్లే అర్దమవ్వడానికి కాస్త టైం పడుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఈ దయ్యం నుంచి, దయ్యం సృష్టించిన సినిమా నుంచి కిస్సా ఎలా బయటపడ్డాడు అని ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు.
ఈ సినిమా థియేటర్స్ లో అంతగా మెప్పించలేదు. అసలు తెలుగులో థియేట్రికల్ రిలీజ్ అనౌన్స్ చేసారు కానీ ప్రమోషన్స్ చేయలేదు. దాంతో తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా గురించి పెద్దగా పరిచయం లేకుండా పోయింది. ఇప్పుడు ఓటీటీలో అయితే ఒక్కసారి చూడొచ్చు. రిలీజ్ కి ముందు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వేంకటేశ్వరస్వామి గోవింద నామాలను ర్యాప్ చేసి పేరడీ చేసి ఒక పాట రిలీజ్ చేసారు. అది వివాదం అవ్వడంతో సినిమాలో తీసేసారు. మొత్తానికి సినిమా మొదట్లో రివ్యూయర్ల మీద పగ పట్టినట్టు కథ రాసుకున్నా చివర్లో మాత్రం మంచి సినిమాని ఎలాంటి బ్యాడ్ రివ్యూలు ఆపలేవు, బ్యాడ్ సినిమాని మంచి రివ్యూలు కాపాడలేవు అని సామరస్యంగా ఓ నిజమైన మెసేజ్ అయితే ఇచ్చారు. చివర్లో ఇటీవల సీక్వెల్స్ అంటూ ప్రతి సినిమాకి అనౌన్స్ చేస్తుంటే దానికి కూడా సెటైరికల్ కౌంటర్ వేస్తూ సినిమాకు శుభం పలకడం బాగుంది. డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో డైరెక్టర్ కే తెలియాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. కమెడియన్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న సంతానం ఇప్పుడు మెయిన్ లీడ్స్ లో సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ సరికొత్త యూట్యూబ్ రివ్యూయర్ గా కొత్త పాత్రల్లో బాగా మెప్పించాడు సంతానం. నిజలగల్ రవి, కస్తూరి, యషిక ఆనంద్, గీతికా తివారి.. నలుగురు రియల్ కథలో, దయ్యం సృష్టించిన సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రల్లో బాగా నటించారు. కమెడియన్ రాజేంద్రన్ కూడా ఎప్పటిలాగే ఫుల్ గా నవ్వించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, రెడిన్ కింగ్ స్లీ గెస్ట్ రోల్స్ ఎందుకు పెట్టారో డైరెక్టర్ కే తెలియాలి. ఇక దయ్యం పాత్రలో సెల్వ రాఘవన్ కూడా మెప్పించారు.
Also Read : Gamblers : ‘గ్యాంబ్లర్స్’ మూవీ రివ్యూ.. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ సినిమా ఎలా ఉందంటే..?
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఉన్న రెండు సాంగ్స్ బాగున్నాయి. కానీ తెలుగు డబ్బింగ్ లో అవి తమిళ్ లోనే ఉంచేశారు. ఒక మంచి పాయింట్ తీసుకున్నా సెటైరికల్ గా కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లే తో చెప్పడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. నిర్మాణ పరంగా అయితే సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది. ఓ పాడుబడ్డ థియేటర్, ఐలాండ్ లో బంగ్లా సెటప్స్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగా వర్క్ చేసింది.
మొత్తంగా ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ సినిమాలు, రివ్యూలపై సెటైరికల్ హారర్ కామెడీ సినిమా.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.