Private School fees: గళమెత్తిన శివ బాలాజీ.. మధుమిత కంటతడి..

  • Published By: sekhar ,Published On : October 2, 2020 / 03:38 PM IST
Private School fees: గళమెత్తిన శివ బాలాజీ.. మధుమిత కంటతడి..

Updated On : October 2, 2020 / 3:44 PM IST

Siva Balaji – Mount Litera Zee School: కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ప్రైవేటు పాఠశాలలు ఫీజుల రూపంలో పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని టాలీవుడ్ నటుడు శివ బాలాజీ గళమెత్తారు. కార్పొరేట్‌ స్కూళ్ల దోపిడీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరోనాతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాఠశాల యాజమాన్యాలు ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. లాక్‌డౌన్‌ కారణంగా ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోయారని, ఇలాంటి విపత్కరణమైన పరిస్థితుల్లో స్కూళ్ల ఫీజులు కట్టాలని ఒత్తిడి పెట్టడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఫీజులు కట్టకపోతే ఆన్‌లైన్‌ క్లాసుల ఐడీలు తొలగిస్తున్నారని, వ్యక్తిగతంగా ఈ మెయిల్స్ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాలాజీ వాపోయారు.

నగరంలోని మౌంట్ లిటేరా స్కూలు నుంచి తొలుత ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయని, ఆ తరువాత అనేక స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి మొదలైదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలన్నీ సిండికేట్ అయ్యాయని ఆరోపించారు. ప్రతి ఒక్క పేరెంట్‌ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తన పోరాటానికి వారంతా సపోర్టు చేయాలని కోరారు.


మధుమిత కంటతడి..
‘ముఖ్యమంత్రి మీద గౌరవంతో అడుగుతున్నాం. మౌంట్ లిటేరా స్కూళ్లు ఫీజులతో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని మీరు చెప్పిన స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో క్షోభకు గురిచేస్తున్నాయి. మేము ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించాం. ఫీజు కట్టలేదని పరీక్షలు రాయనివ్వటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి’ అని మధుమిత కోరారు.

కాగా, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తోందని శివ బాలాజీ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Madhumitha