Dear Uma : ‘డియర్ ఉమ’ మూవీ రివ్యూ.. కార్పొరేట్ హాస్పిటల్స్ లో మోసాల గురించి..
డియర్ ఉమ సినిమా నేడు ఏప్రిల్ 18న రిలీజ్ అయింది.

Sumaya Reddy Pruthvi Ambaar Dear Uma Movie Review and Rating
Dear Uma Movie Review : తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా తెరకెక్కించిన సినిమా ‘డియర్ ఉమ’. పృథ్వీ అంబర్ ఈ సినిమాలో హీరోగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డియర్ ఉమ సినిమా నేడు ఏప్రిల్ 18న రిలీజ్ అయింది. ఫైమా, భద్రం, కమల్ కామరాజు, ఆమని, రాజీవ్ కనకాల, సప్తగిరి, లోబో, అజయ్ ఘోష్.. పలువురు కీలక పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. ఉమ(సమయ రెడ్డి) ఓ పల్లెటూరి నుంచి బాగా చదువుకొని మెడికల్ లో సీట్ సంపాదించి సిటీకి వచ్చి డాక్టర్ చదివుతూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తుంది. దేవ్(పృథ్వీ అంబర్) సింగర్, రాక్ స్టార్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తాడు. అన్ని చోట్లా అతనికి ఛీత్కారాలు ఎదురవ్వడమే కాక ఇంట్లోంచి కూడా బయటకి పంపించేస్తారు. ఓ రోజు ఉమ కాలేజీలో దేవ్ పర్ఫార్మెన్స్ ఇస్తే అక్కడ కూడా అందరూ తిట్టి పంపిస్తారు. కానీ ఉమకి దేవ్ వాయిస్ నచ్చి అతనిలో ట్యాలెంట్ ఉందని గుర్తించి దేవా వెళ్లిపోవడంతో తను రాసిన పాటలు దేవ్ కి ఇమ్మని వాళ్ళ బ్యాండ్ వాళ్లకు ఇస్తుంది.
దేవ్ ని ఇంట్లోంచి పంపేయడంతో రోడ్డు మీద పడుకుంటే కొంతమంది రౌడీలు ఓ అమ్మాయిని తరుముతూ వెళ్లడం చూసి ఆమెని కాపాడటానికి ట్రై చేస్తాడు. కానీ రౌడీలు దేవ్ ని పొడిచి వెళ్లిపోవడంతో దేవ్ ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కి జాయిన్ అవుతాడు. బయటకి వచ్చాక ఓ రోజు దేవ్ కి ఉమ కనిపిస్తుంది. మొదటి చూపులోనే తనకి నచ్చేస్తుంది. దేవ్ ఇండియన్ ఐడల్ ప్రయాణం మొదలయ్యాక ఉమ పరిచయమై ఇద్దరూ క్లోజ్ అవుతారు. ఓ రోజు ఉమకి ప్రపోజ్ చేద్దామని తన ఇంటికి వెళ్తే అక్కడ ఉండదు. ఉమ ఏమైంది? దేవ్ రాక్ స్టార్ అయ్యాడా? రౌడీలు తరుముతున్న అమ్మాయి ఎవరు? దేవ్ జాయిన్ అయిన కార్పొరేట్ హాస్పిటల్ లో ఏం జరిగింది? ఉమ – దేవ్ ప్రేమ సక్సెస్ అయిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. హీరో ప్రయాణంలో హీరోయిన్ తోడు ఉండి సడెన్ గా మాయమవడం, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేసే మోసాలు నేపథ్యంలో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఈ డియర్ ఉమ కూడా అదే కోవలోకి చెందింది. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఉమ గురించి, దేవ్ గురించి చూపించి వీరి ప్రయాణం, వీరి కలయిక చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీశారు. ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ ఇచ్చి ఏం జరిగింది అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. సెకండ్ హాఫ్ ఆసక్తిగా సాగుతుంది. హీరో ఓ పక్క రాక్ స్టార్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు, మరో పక్క హీరోయిన్ గురించి కనుక్కోవడంతో సాగుతుంది. చివరి అరగంట ట్విస్టులతో ఆసక్తిగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ మాత్రం రొటీన్ గా ముగించారు.
అయితే సినిమాలో మెయిన్ ప్లాట్ ఠాగూర్ సినిమాని కచ్చితంగా గుర్తుకు చేస్తుంది. స్క్రీన్ ప్లే అక్కడక్కడా కన్ఫ్యూజ్ చేసినా, ఫస్ట్ హాఫ్ సాగదీసినా సెకండ్ హాఫ్ బాగానే వర్కౌట్ అయింది. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే మోసాల గురించి ఈ సినిమాలో చూపించారు. దేవ్ సింగర్ ప్రయాణం ఇంకాస్త ఆసక్తిగా, ఇన్‌స్పైర్ గా రాసుకుంటే బాగుండేది. పలుచోట్ల కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. కొత్త అమ్మాయి సమయ రెడ్డి బాగానే నటించింది. ప్రతి సీన్ లోను పద్దతిగా కనిపించి క్యూట్ గా మెప్పిస్తుంది. కథ రాసి, హీరోయిన్ గా నటిస్తూ మరో పక్క నిర్మాతగా సుమయ రెడ్డి బాగానే కష్టపడింది. కన్నడ నటుడు పృథ్వీ అంబర్ బాగానే నటించాడు. సప్తగిరి, భద్రం అక్కడక్కడా నవ్విస్తారు. ఆమని లాంటి నటిని పెట్టుకొని సింపుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వాడుకున్నారు. కమల్ కామరాజు, ప్రమోదిని, ఫైమా, పృథ్వీరాజ్, అజయ్ ఘోష్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Lokesh Kanagaraj : ‘మా నగరం’ మూవీ హీరోకి ఏమైంది? దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్లారిటీ..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. పాటలు ఒకసారి వినొచ్చు. రెగ్యులర్ కథే అయినా కాస్త కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా ఏ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘డియర్ ఉమ’ సింగర్ అవ్వాలనుకునే ఓ అబ్బాయి లైఫ్ లోకి ఓ డాక్టర్ అమ్మాయి వస్తే ఏం జరిగింది? కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగే మోసాలేంటి అని చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
https://www.youtube.com/watch?v=GFgOplIbPEs&t=78s
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.