Super Subbu Review : ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ రివ్యూ.. సె*క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సందీప్ కిషన్..
తెలుగులో నెట్ ఫ్లిక్స్ కి ఇదే మొదటి ఒరిజినల్ సిరీస్ కావడం గమనార్హం. (Super Subbu Review)
Super Subbu Review
Super Subbu Review : సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మిథిలా పాల్కర్, మానస చౌదరి, మురళీశర్మ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేడు జూలై 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో నెట్ ఫ్లిక్స్ కి ఇదే మొదటి ఒరిజినల్ సిరీస్ కావడం గమనార్హం. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే..
ఓ మారుమూల గ్రామం మాకిపూర్. అక్కడి జనాలకు సె*క్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహనా లేకపోవడం, అక్కడ మహిళలకు ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో జనాభా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ ఊళ్ళో పిల్లలు పుట్టించడం తగ్గించాలని అక్కడి వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం సె*క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ని పంపించినా ఆ ఊళ్ళో మగవాళ్ళు భయపెట్టి కొట్టి పంపిస్తూ ఉంటారు.
చాలా పద్ధతి, స్ట్రిక్ట్ రిటైర్డ్ లెక్కల టీచర్ కుక్కుటేశ్వరరావు(మురళీశర్మ) కొడుకు సుబ్బు(సందీప్ కిషన్). తండ్రికి భయపడుతూ బొమ్మరిల్లు కొడుకులా బతుకుతూ ఓ గవర్నమెంట్ స్కూల్ లో కంప్యూటర్ టీచర్ గా టెంపరరీ జాబ్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పట్నుంచి తన తప్పు లేకుండానే అనుకోకుండా ఏదో ఒక సంఘటనల వల్ల సుబ్బుపై కుక్కుటేశ్వరరావుకు మంచి అభిప్రాయం ఉండదు. సుబ్బుకు దివ్య(మానస చౌదరి)తో అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. అనుకోకుండా స్కూల్ లో జరిగిన ఓ సంఘటన తన తండ్రికి తెలియకూడదు అని ప్రిన్సిపాల్(బ్రహ్మానందం)ని బతిమాలడంతో మాకిపూర్కి సె*క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా వెళ్ళమంటాడు. దీంతో సుబ్బు అక్కడికి వెళ్తాడు.
అసలు ఆ పదం వింటేనే తిట్టే తండ్రికి ఈ జాబ్ చేస్తున్నట్టు తెలియకూడదు అని జాగ్రత్త పడుతూ ఉంటాడు సుబ్బు. ఇక ఆ ఊర్లో ఆ పేరు ఎత్తినా, కండోమ్ వాడమన్నా, మహిళలకు అవగాహన కలిపించినా రమేష్(జీవన్ కుమార్), అతని మనుషులు అందరూ సుబ్బు పైకి దాడికి వస్తారు. మరి సుబ్బు అక్కడి మగవాళ్ళను తప్పించుకొని ఆడవాళ్లకు అవగాహన కల్పిస్తాడా? మగవాళ్ళను మారుస్తాడా? తన జాబ్ పర్మనెంట్ చేయించుకుంటాడా? తన తండ్రికి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుంది? ఊళ్ళో హీరోయిన్ అవ్వాలి అని ప్రయత్నాలు చేసే స్వాతి(మిథిలా పాల్కర్)తో సుబ్బు ప్రయాణం ఎలా సాగుతుంది? సుబ్బు – దివ్య పెళ్లి జరుగుతుందా.. ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
సిరీస్ విశ్లేషణ..
సందీప్ కిషన్ సోలో హీరోగా మొదటిసారి వెబ్ సిరీస్ చేయడం, నెట్ ఫ్లిక్స్ మొదటిసారి డైరెక్ట్ తెలుగులో వెబ్ సిరీస్ చేయడం, అది కూడా సె*క్స్ ఎడ్యుకేషన్ పై కామెడీ మెసేజ్ తో అని ప్రమోట్ చేయడంతో ఈ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. గతంలో ఈ కాన్సెప్ట్, గ్రామాల్లో మహిళల సమస్యల గురించి మాట్లాడడం.. లాంటి కాన్సెప్ట్ లతో అనేక సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే. ఓ ఆఫీసర్ వెళ్లి ఒక ఊరిని ఎలా ఎడ్యుకేట్ చేసాడు అనే కథతో కామెడీ మెసేజ్ ఓరియెంటెడ్ గా సూపర్ సుబ్బుని ఏడు ఎపిసోడ్స్ లో తెరకెక్కించారు.
మొదటి ఎపిసోడ్ లోనే హీరో – అతని తండ్రి పాత్రలు, ఆ ఊరు ఎలా ఉంటుంది అని పరిచయం చేయడంతో సిరీస్ ఎలా ఉండబోతుంది అని ఓ క్లారిటీ వస్తుంది. రెండో ఎపిసోడ్ లో సుబ్బు మాకిపూర్ కి వెళ్లిన దగ్గర్నుంచి ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. కాస్త అడల్ట్ కామెడీతో ఈ సిరీస్ సాగుతుంది. అలాగే ఆ ఊళ్ళో మహిళలను ఎడ్యుకేట్ చేసే విధంగా సానిటరీ ప్యాడ్, పునరుత్పత్తి వ్యవస్థ, కండోమ్ వాడటం, ఎయిడ్స్ గురించి, ఆడపిల్లలు – మగపిల్లలు పుట్టడం, నెలసరి.. ఇలాంటి పలు అంశాలపై అవగాహన కల్పించేలాగా ఈ సిరీస్ సాగుతుంది. అయితే ఇవన్నీ ఓ రెండు ఎపిసోడ్స్ లోనే చర్చిస్తారు. మిగతా అంతా ఆ ఊర్లో సుబ్బు ఎలాంటి కష్టాలు పడ్డాడు, అక్కడి మగవాళ్ళు ఇతన్ని ఎలా ఇబ్బంది పెట్టారు అనే సాగుతుంది.
మధ్యలో స్వాతి సినిమా ట్రైల్స్, ఆమె సన్నివేశాలు కూడా బాగానే సాగుతాయి. కథకు ఎలాంటి ముగింపు ఇవ్వకుండా సెకండ్ సీజన్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం. క్లైమాక్స్ లో హీరో తండ్రి మారుతారు అని ఊహిస్తారు కానీ అది జరగదు. సమాజంలో కొంతమంది మనుషులు అలాగే ఉంటారు అనేలా మురళీశర్మ పాత్రను రాసుకున్నారు. సందీప్ కిషన్ పాత్ర అయితే బొమ్మరిల్లు సినిమాలో సిద్దార్థ్ గుర్తుకు వస్తాడు కానీ ఆ పాత్రని చాలా బాగా రాసుకున్నారు. కథకి ముగింపు ఇచ్చి సెకండ్ సీజన్ కి లీడ్ ఇస్తే బాగుండేది కానీ అర్దాంతరంగా మధ్యలోనే ఆపేసారు. చాలా చోట్ల నవ్వించినా ఎమోషన్ సీన్స్ ని ఇంకా బలంగా రాసుంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ సిరీస్ కాన్సెప్ట్ సె*క్స్ ఎడ్యుకేషన్.. దానిపై అవగాహన కలిపించే సీన్స్ ఇంకా ఉంటే బాగుండేది. సింపుల్ గా రెండు మూడు సీన్స్ తో అవగొట్టేసి కథ అంతా ఊరు వర్సెస్ హీరో అన్నట్టు నడిపించారు. ఇది మన దేశంలో చాలా చర్చ జరిగే టాపిక్. అలాంటి టాపిక్ తో సమాజంలో ఇంకా సె*క్స్ ఎడ్యుకేషన్ అంటే అవగాహన లేక తప్పుగా చూసేవాళ్ళు ఉన్నారని, ఇప్పటి పరిస్థితుల్లో అది ఎంతో అవసరం అని ఈ సిరీస్ తో కామెడీగా చెప్పే ప్రయత్నం చేసారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
సందీప్ కిషన్ సె*క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఓ కొత్త ప్రయత్నం చేసాడని చెప్పొచ్చు. తన నటనతో మెప్పిస్తాడు. మానస చౌదరి పర్వాలేదనిపిస్తుంది. మిథిలా పాల్కర్ గ్రామీణ యువతి పాత్రలో చాలా బాగా నటించింది. స్ట్రిక్ట్ తండ్రిగా మురళీశర్మ బాగా నటించారు. వేశ్య పాత్రలో దివ్య పిళ్ళై కూడా బాగానే నటించింది. బ్రహ్మానందం కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఇందులో ప్రిన్సిపాల్ పాత్రలో కనిపించి మెప్పించారు. గెటప్ శ్రీను, జీవన్ కుమార్, సంపూర్ణేష్ బాబు, రఘుబాబు.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : Isakapatnam Web Series Review : ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ రివ్యూ.. తండ్రి కూతుళ్ళ యుద్ధం..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ విలేజ్ సెటప్ కోసం బాగానే వర్క్ చేసారు. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండు. కనీస అవగాహన లేని గ్రామీణ ప్రజల దగ్గరకు వెళ్లి ఓ సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పడ్డ పాట్లు ఏంటి అనే కథాంశంతో ఈ సిరీస్ ని బాగానే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘సూపర్ సుబ్బు’ జనాలకు సె*క్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన కలిగించాలని చేసే ప్రయత్నంతో తెరకెక్కిన వెబ్ సిరీస్. ఈ సిరీస్ కి 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
