Vishwanath and Sons Review : ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ రివ్యూ.. సూర్య సినిమానే కానీ మమిత బైజు వన్ వుమెన్ షో..
Vishwanath and Sons Movie Review: వరుస హిట్స్ తో, నేషనల్ అవార్డు కూడా అందుకున్న వెంకీ అట్లూరి తమిళ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు అని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Vishwanath and Sons Review
Vishwanath and Sons Review : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విశ్వనాథ్ & సన్స్ సినిమా నేడు ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
సంజయ్ విశ్వనాధ్(సూర్య) ఓ పెద్ద వ్యాపారవేత్త. 2024 ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. 40 ఏళ్ళు వచ్చినా సంజయ్ పెళ్లి మాత్రం చేసుకోడు. తన తల్లి నిర్మల(రాధిక) పెళ్లి చేసుకో, వంశానికి ఒక వారసుడు కావాలి, ఆడుకోడానికి పిల్లలు కావాలని పోరుతూ ఉంటుంది. దీంతో సంజయ్ అమెరికా వెళ్లి సరోగసి ద్వారా ఓ బిడ్డను కని తీసుకొస్తాడు. మొదట షాక్ అయినా తర్వాత ఆ బాబును దగ్గరకు తీసుకొని అభయ్ అని పేరు పెట్టి చాలా బాగా చూసుకుంటుంది నిర్మల. కానీ ఆ బాబుకి బోన్ మ్యారోకి సంబంధించిన వ్యాధి రావడంతో బోన్ మ్యారో కావాల్సి వస్తుంది. తండ్రి సంజయ్ ది సరిపోదు అని తెలియడంతో సరోగసి ద్వారా జన్మనిచ్చిన తల్లి బోన్ మ్యారో కావాలి అని డాక్టర్లు చెప్తారు. దీంతో అమెరికాకు వెళ్లి తన బిడ్డకు జన్మనిచ్చిన మ్యాడీ(మమిత బైజు) అనే 22 ఏళ్ల అమ్మాయిని కలుస్తాడు.
ఇంత చిన్న అమ్మాయా అని షాక్ అయినా తన బాబుని కాపాడుకోవడానికి ఆ అమ్మాయితో డబ్బులు ఇచ్చి డీల్ మాట్లాడుకొని ఇండియాకు తీసుకువస్తాడు. కానీ మ్యాడీ జెన్ జీ అమ్మాయి, అల్లరి పిల్ల, సరదాగా ఉండే అమ్మాయి కావడంతో సంజయ్ ఆఫీసులో, ఇంట్లో, నిర్మలతో అందరితో కలిసిపోతుంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాల్సిన మ్యాడీ ఈ ప్రయాణంలో సంజయ్ కి దగ్గరయి అతన్ని లవ్ చేస్తుంది. నిర్మల ఒప్పుకున్నా సంజయ్ ఒప్పుకోకుండా ఆమెని అమెరికా వెళ్లిపొమ్మంటాడు. మరి మ్యాడీ అమెరికా వెళ్లిపోతుందా? సంజయ్ ని దక్కించుకోడానికి మ్యాడీ ఏం చేస్తుంది? అసలు మ్యాడీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సంజయ్ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటి? బాబు సంగతి ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Agadha Review : ‘అగధ’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ మాములుగా లేదుగా..
సినిమా విశ్లేషణ..
వరుస హిట్స్ తో, నేషనల్ అవార్డు కూడా అందుకున్న వెంకీ అట్లూరి తమిళ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు అని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రెగ్యులర్ గా యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో ఇది ఫుల్ లెంగ్త్ ఫామిలీ డ్రామాతో కామెడీ ఎమోషన్స్ తో ఉండబోతుందని అర్థం అయిపోయింది.
ఫస్ట్ హాఫ్ లో రిచ్ బిజినెస్ మాన్ అయిన సూర్య ఒలంపిక్స్ లో మెడల్ సాధించి ఇంటికి రావడంతోనే తల్లి పెళ్లి చేసుకోమని పోరాటం, సరోగసి ద్వారా బిడ్డను కనడం, ఆ బిడ్డకు బోన్ మ్యారో సమస్య రావడం, మ్యాడీని ఇంటికి తీసుకురావడం, ఆ తర్వాత మ్యాడీ చేసే అల్లరి, బోన్ మ్యారో ఆపరేషన్ తో ఆసక్తిగా ఫుల్ కామెడీగా సాగుతుంది. ఇంటర్వెల్ కి మ్యాడీ అమెరికా వెళ్లిపోతుందా లేదా అనే బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ మధ్య సీన్స్ తో, హీరో ఫ్యామిలీ, ఓ పెళ్లి, అక్కడి సమస్యలు, తల్లి ఎమోషన్ తో.. ఒక ఫ్యామిలీ డ్రామాను ఎమోషనల్ గా నడిపించారు.
సినిమా అంతా ఫుల్లుగా నవ్వుకుంటాము. మమత చేసే అల్లరితో బాగా ఎంటర్టైన్ అవుతాము. సినిమా టైటిల్ విశ్వనాధ్ & సన్స్ అని పెట్టారు కానీ కొడుకు కథ సింపుల్ గా ఫస్ట్ హాఫ్ లోనే అయిపోతుంది. కొడుకు ఎమోషన్ కూడా ఎక్కువ ఉండదు. సెకండ్ హాఫ్ లో కథ మొత్తం హీరో, అతని ఫ్యామిలీ, పెళ్లి చుట్టూ తిరుగుతుంది. సరోగసి మీద చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇందులో తీసుకున్న పాయింట్, సరోగసి తల్లి పాత్రను చాలా కొత్తగా రాసుకున్నారు. హీరో- హీరోయిన్ 20 ఏళ్ళ ఏజ్ డిఫరెన్స్ ని కూడా చివరి వరకు ఆసక్తిగా నడిపించారు. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కన్నీళ్లు పెట్టించారు. సెకండ్ హాఫ్ అంత త్రివిక్రమ్ స్టైల్ సినిమాలాగా ఒక పెళ్లి, ఫ్యామిలిలో ఉన్న సమస్యలు అన్ని హీరో సాల్వ్ చేయడం అన్నట్టు సాగుతుంది. చాన్నాళ్ల తర్వాత ఒక కొత్త కథతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాని చూసాము అనే ఫీలింగ్ కలుగుతుంది. జెన్ జీ అమ్మాయి – ఓ 40 ఏళ్ళ అబ్బాయిని ఇష్టపడితే ఆ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అని కూడా క్యూట్ గా రాసుకున్నారు. సర్, లక్కీ భాస్కర్ సినిమాలతో వెంకీ అట్లూరి రైటింగ్ లో స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడు ఆల్రెడీ. ఈ సినిమాతో మరోసారి తన రైటింగ్ బాగుంటుందని ప్రూవ్ చేసాడు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
సూర్య చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ డ్రామాలో కనిపించి చాలా స్టైలిష్ లుక్స్ లో రిచ్ లుక్స్ లో అలరించాడు. గజినీ సినిమాలో సంజయ్ రామస్వామి పాత్రను చూసినట్టే ఉంటుంది. మమత బైజు జెన్ జీ అమ్మాయిలా అల్లరి చేస్తూ ఫుల్ ఎనర్జిటిక్ పాత్రలో నటించి మెప్పించింది. ప్రేమలు సినిమా తర్వాత మరోసారి ఆ రేంజ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది మమత బైజు. చాలా సీన్స్ లో మమతనే నవ్విస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే సూర్య ఉన్నా ఈ సినిమా మమిత బైజు వన్ వుమెన్ షో అని చెప్పొచ్చు.
రాధిక శరత్ కుమార్ హీరో తల్లి పాత్రలో చక్కగా సరిపోయింది. ఆమె కూడా అక్కడక్కడ నవ్విస్తుంది. సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకు సునీల్ హీరో బావ పాత్రలో బాగానే నవ్వించి మెప్పించాడు. రవీనా టాండన్, రాజీవ్ మీనన్, వైవాహర్ష, హైపర్ ఆది.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. సూర్య సినిమా కావడంతో చాలామంది తమిళ నటీనటులను కూడా వాడారు.
Also Read : Hushar Pittalu Review: ‘హుషార్ పిట్టలు’ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో నవ్వించి..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా కలర్ ఫుల్ గా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. పాటల విషయంలో ఒక బటర్ఫ్లై సాంగ్ తప్ప మిగతావన్నీ యావరేజ్. మమత అల్లరి కొన్ని చోట్ల సాగదీసినట్టుంది. వాటిలో కొన్ని సీన్లు ఎడిటింగ్ లో కట్ చేస్తే ఇంకా బాగుండేది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేసింది. ప్రతి ఫ్రేమ్, హీరో పాత్ర చాలా రిచ్ అని చూపించడానికి బాగా కష్టపడ్డారు. సరోగసి ద్వారా పిల్లల్ని కన్న అమ్మాయి ఆ ఫ్యామిలీలోకి రావడం అనే ఒక కొత్త కాన్సెప్ట్ చుట్టూ మంచి ఫ్యామిలీ డ్రామాని రాసుకొని చాలా బాగా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణపరంగా ఈ సినిమాకి చాలా ఖర్చుపెట్టినట్టు తెరపై గ్రాండ్ గా కనిపిస్తుంది.
మొత్తంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
