Drugs Case Rakul : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరవుతారా?
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Rakul
Tollywood drugs case : టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. ఈనెల 6న విచారణకు హాజరు కావాలని రకుల్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనివార్య కారణాల వల్ల ఈడి విచారణకు హాజరు కాలేనంటూ ఈడీ అధికారులను రకుల్ కోరింది. విచారణకు తాను హాజరు అయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలని ఈడి అధికారులకు విన్నవించుకుంది. అయితే ఎక్సైజ్ అధికారుల విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు. ఈడీ విచారణలో రకుల్ కు సైతం పలు లింక్ లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈడీ అధికారులు రకుల్ కు నోటీసులు జారీ చేశారు.
మరోవైపు డ్రగ్స్ కేసులో సినీనటి ఛార్మీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు ఛార్మీని ఇవాళ ఈడీ అధికారులు విచారించారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనలపై ప్రశ్నల వర్షం కురిపించారు. కెల్విన్ తో ఛార్మీ చాటింగ్ వివరాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. కెల్విన్ నెంబర్ ను దాదా పేరుతో ఎందుకు ఫీడ్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఛార్మీ, పూరీ జగన్నాథ్ బ్యాంకు స్టేట్ మెంట్లను పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఛార్మీ మీడియాతో మాట్లాడుతూ ఈడీ అధికారులు అడిగిన పత్రాలు అన్ని సమర్పించానని తెలిపారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని తెలిపారు. ఈడి విచారణకు పూర్తిగా సహరించానని పేర్కొన్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని వెల్లడించారు. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేనని తెలిపింది. ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తులను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. కొంత విరామం తర్వాత మళ్లీ విచారణ చేపట్టారు. టాలీవుడ్ టు బాలీవుడ్ వయా శాండల్‌వుడ్ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. మొన్న టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను దాదాపు 10 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పూరీని, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ సమక్షంలో విచారించారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. నిందితుడు కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్‌గా మారాడు. ఆరు నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కెల్విన్‌పై కేసు నమోదు చేశారు. కాగా విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులకు ఏమాత్రం సహకరించని కెల్విన్.. ఇప్పుడు ఈడీ కేసుతో అప్రూవర్‌గా మారడంతో ఈ కేసుతో సంబంధమున్న సినీ తారల్లో అలజడి నెలకొంది.
అప్రూవర్‌గా మారిన కెల్విన్ ఈడీ అధికారుల ముందు డ్రగ్స్ తీసుకున్న సినిమా స్టార్స్ చిట్టా విప్పాడు. అతని స్టేట్‌మెంట్ ఆధారంగానే సినిమా స్టార్లకు ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. డ్రగ్స్ లావాదేవీల వివరాలను కెల్విన్ ఈడీ ముందు బయటపెట్టడంతో.. సినీ తారలకు ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ కోసం కెల్విన్ అకౌంట్లోకి సినిమా వాళ్లు భారీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు కెల్విన్ బ్యాంక్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేశారు. అతని బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఈడీ అధికారులు సినీ తారల అకౌంట్లను ఫ్రీజ్ చేసే యోచనలో ఉన్నారు.