Teenmar Mallanna : పుష్ప 2 సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్న.. అలాంటి సీన్ ఉంటే సెన్సార్ ఎలా ఇచ్చారు?
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేడు పుష్ప 2 సినిమాపై ఫిర్యాదు చేశారు.

Teenmar Mallanna Police Complaint on Allu Ajun Pushpa 2 Movie
Teenmar Mallanna : అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన దగ్గర్నుంచి ఎవరో ఒకరు అల్లు అర్జున్ పై, పుష్ప 2 సినిమాపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై, సంధ్య థియేటర్ ఘటనపై, పుష్ప 2 సినిమాపై మాట్లాడుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేడు పుష్ప 2 సినిమాపై ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పుష్ప 2 సినిమాపై తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. థియేటర్ కి వెళ్లి మరీ నేను పుష్ప 2 సినిమా చూశాను. సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా పోలీసుల పట్ల చిన్నచూపు చూసే విధంగా, గంధపు చెక్కల స్మగ్లర్ పెద్ద హీరోగా, స్మగ్లర్ వచ్చి పోలీస్ ఆఫీసర్ కారును ఢీ కొట్టి పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిన తర్వాత ఏకంగా స్విమ్మింగ్ పూల్ లోనే హీరో అల్లు అర్జున్ ఉచ్చ పోయడం సీన్స్ ఉన్నాయి.
ఇలాంటి సీన్స్ పోలీసులను చాలా అవమానించడమే. దీనిపైన డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు, హీరో అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలి. చట్టరీత్యా ఆ సీన్ కట్ చేయాలి. ఇలాంటి సీన్లకు, ఇటువంటి సినిమాలకు సెన్సార్ బోర్డు ఎందుకు అనుమతిస్తుంది. సెన్సార్ బోర్డులో ఏం జరుగుతుంది అని ప్రశ్నించారు.
అలాగే.. తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు స్మగ్లర్లే హీరోలుగా చూపిస్తే నేటి యువత అదే మార్గంలో వెళ్తే ఇది సమాజాన్ని నాశనం చేయడం కాదా. ఇటువంటి సినిమాలను ప్రోత్సహించకుండా మంచి సినిమాలను ప్రోత్సహించి పదిమందికి ఉపయోగపడే సినిమాలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు, యాక్టింగ్ చేసిన హీరోల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు తీన్మార్ మల్లన్న.
Also Read : Kancharla Chandrashekar Reddy : అల్లుడి కోసం మామ.. గాంధీభవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
దీంతో తీన్మార్ మల్లన్న పుష్ప 2 పై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మరి దీనిపై మూవీ టీమ్ ఎవరైనా స్పందిస్తారా చూడాలి.