Ramayana : ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ మూవీ రివ్యూ.. జపనీస్ యానిమేషన్ రామాయణం ఎలా ఉందంటే..
'రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' సినిమా మన వాల్మీకి రామాయణం ఆధారంగా జపనీస్ యానిమే స్టైల్ లో తెరకెక్కించిన అద్భుత కావ్యం.

Timeless japanese Anime Ramayana The Legend Of Prince Rama Movie Review
Ramayana: The Legend Of Prince Rama : మన రామాయణంపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ 31 ఏళ్ళ క్రితం జపాన్ వాళ్ళు ఇండియన్ టీమ్ తో కలిసి యానిమేషన్ రామాయణం తీశారు. ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ అనే పేరుతో జపాన్ యానిమే స్టైల్ లో సినిమాని తీశారు. 1997లోనే జపాన్ లో ఈ సినిమా రిలీజయింది. ఈ సినిమాపై చాలా ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత అనేక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా అవార్డులు వచ్చాయి. కానీ అప్పుడు పలు రాజకీయ కారణాలతో ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. ఇన్నేళ్ల తర్వాత జపనీస్ రామాయణం సినిమా ఇప్పుడు ఇండియాలో రిలీజయింది.
ఈ సినిమాని జపాన్ కి చెందిన కోయిచి ససకి, యుగో సాకి, ఇండియాకు చెందిన రామ్ మోహన్ లు కలిసి తెరకెక్కించారు. ఇన్నేళ్ల తర్వాత గీక్ పిక్చర్స్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, AA ఫిలిమ్స్ ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. నేడు జనవరి 24న ఈ సినిమా ఇండియాలో రిలీజయింది.
Also Read : Gandhi Tatha Chettu : ‘గాంధీ తాత చెట్టు’ మూవీ రివ్యూ.. సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?
కథ విషయానికొస్తే.. రామాయణం కథ మన అందరికి తెలిసిందే. ఈ కథని వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. దశరథుడు గురించి రాముడు పుట్టడం గురించి మొదట వాయిస్ ఓవర్ లో చెప్పి రాముడికి 15 ఏళ్ళు వచ్చాక విశ్వామిత్రుడు తన యజ్ఞయాగాదులని తాటకి నుంచి కాపాడటానికి రామ లక్ష్మణులను పంపమని దశరథుడిని అడగడం నుంచి కథని మొదలుపెట్టారు. రామ లక్ష్మణులు తాటకిని చంపి ఋషులను కాపాడటం, శివధనస్సు విరిచి సీతని పెళ్లి చేసుకోవడం, దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్న సమయంలో మంథర మాటలు విని కైకేయి దశరథుడిని వరాలు అడగడం, రాముడు తండ్రి మాటకు కట్టుబడి వనవాసానికి వెళ్లడం, రాముడితో పాటే సీత, లక్ష్మణుడు వెళ్లడం, దశరథుడు చనిపోవడం, భరతుడు రాముడ్ని వెతుక్కుంటూ అడవులకు రావడం, రాముడు పర్ణశాల నిర్మించడం, శూర్పణఖ ముక్కుని లక్ష్మణుడు కోయడం, రావణాసురుడు సీతను అపహరించడం, రాముడు హనుమంతుడిని కలిసి సుగ్రీవుడి సహాయం తీసుకోవడం, సీత జాడను హనుమంతుడు కనిపెట్టడం, హనుమంతుడు లంకకు నిప్పు పెట్టడం, రాముడు వానర సేనతో కలిసి సముద్రాన్ని దాటడం, రామ – రావణ యుద్ధంతో కథని ముగించారు. క్లైమాక్స్ మళ్ళీ వాయిస్ ఓవర్ తోనే రాముని పట్టాభిషేకం గురించి అవతారం చాలించడం గురించి చెప్పారు.
సినిమా విశ్లేషణ.. రామాయణ మహాభారతాలు ఎన్నిసార్లు విన్నా, చూసినా తనివి తీరదు. ఈ సినిమా వాల్మీకి రామాయణం ఆధారంగా చిత్రీకరించారు. మన ఇండియాలో ఇన్నాళ్లు రిలీజ్ అవ్వకపోయినా ఇండియాలో చాలా సార్లు ఈ సినిమా ప్రస్తావన వచ్చినా, ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ సినిమా చూసినా గొప్పగా పొగిడేవాళ్లు. దీంతో చాలా మంది ఇండియన్ సినిమా లవర్స్ కి, రామాయణ ప్రేమికులకు ఈ సినిమాని ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూసేవాళ్ళు. ఇన్నేళ్లకు జపనీస్ వాళ్ళు తీసిన మన రామాయణం చూసే భాగ్యం మనకు దక్కింది.
సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. యానిమే సినిమా అయినా నిజంగా కథ జరుగుతున్నంత ఎమోషన్ ని పండించగలిగారు. అయితే క్లైమాక్స్ మాత్రం రామ – రావణ యుద్ధంతోనే సింపుల్ గా ముగించేశారు తర్వాత కథేమీ లేకుండా అనిపిస్తుంది. హనుమంతుడికి ఇచ్చే ఎలివేషన్స్ చాలా బాగా చూపించారు. తెలుగు డైలాగ్స్ కూడా అద్భుతంగా రాసుకున్నారు. చూపించిన సీన్స్ వరకు డిటైలింగ్ గా చక్కగా చూపించారు. కానీ పాటలు మాత్రం హిందీ వర్షన్ వి ఉంచేశారు. ఇటీవల కాలంలో జపాన్ యానిమే స్టైల్ సినిమాలకు ఆదరణ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటి జనరేషన్ వాళ్ళు, చిన్న పిల్లలకు ఈ సినిమాని కచ్చితంగా చూపించాలి. యానిమే స్టైల్ లో సినిమాని ఎంజాయ్ చేస్తూనే రామాయణం చరిత్ర గురించి తెలుసుకుంటారు. పిల్లలు ఈ సినిమాని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
సాంకేతిక అంశాలు.. తెలుగు డబ్బింగ్ బాగున్నా కొన్ని సీన్స్ లో మాత్రం మరీ ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తుంది. జపాన్ యానిమే సినిమాలు యానిమేషన్ అద్భుతంగా ఉంటుందని తెలిసిందే. ఈ రామాయణం కూడా యానిమేషన్ ఎక్కడా వేలెత్తి చిన్న తప్పు కూడా చూపించలేని విధంగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇదంతా 1993 లోనే ఇంత అద్భుతంగా చేశారు. అప్పట్లోనే ఈ సినిమాకు 450 మంది వరకు సాంకేతిక నిపుణులు యానిమేషన్ కోసం పనిచేసారు. 1993 లో తీసినా ఇప్పుడు 4K HD క్వాలిటీ అనుగుణంగా సినిమా పిక్చరైజేషన్ చాలా క్లారిటీగా ఉండేలా మార్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. పక్షుల కిలకిలారావాలు, జంతువుల అరుపులు, సముద్రపు అలలు.. ఇలాంటివన్నీ కూడా చాలా సహజంగా రికార్డ్ చేశారు. పాటలు తెలుగులో హిందీ వర్షన్ వినిపించిన అవినడానికి చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే కూడా కథ మనకు తెలిసిన వరుస క్రమంలోనే తీసుకెళ్లారు.
మొత్తంగా ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమా మన వాల్మీకి రామాయణం ఆధారంగా జపనీస్ యానిమే స్టైల్ లో తెరకెక్కించిన అద్భుత కావ్యం. ఈ జనరేషన్ పిల్లలకు కచ్చితంగా చూపించాల్సిన సినిమా.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.