Gandhi Tatha Chettu : ‘గాంధీ తాత చెట్టు’ మూవీ రివ్యూ.. సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ముఖ్య పాత్ర‌లో న‌టించిన సినిమా 'గాంధీ తాత చెట్టు'

Gandhi Tatha Chettu : ‘గాంధీ తాత చెట్టు’ మూవీ రివ్యూ.. సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?

Sukumar Daughter Sukriti Veni Gandhi Tatha Chettu Movie Review and Rating

Updated On : January 24, 2025 / 11:01 AM IST

Gandhi Tatha Chettu Movie Review : స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్(Sukumar) కూతురు సుకృతి వేణి ముఖ్య పాత్ర‌లో న‌టించిన సినిమా ‘గాంధీ తాత చెట్టు’. మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్ బ్యానర్స్ పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌, శేష సింధు రావు నిర్మాణంలో పద్మావతి మల్లాది దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. సుకుమార్‌ భార్య తబితా సుకుమార్(Thabitha Sukumar) ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. రిలీజ్ కి ముందే దేశ విదేశాల్లో పలు అవార్డులు సాధించింది ఈ సినిమా. నేడు జనవరి 24న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. తెలంగాణలోని చెరుకు పండించే రంగంపేట ఊర్లో గాంధీ సిద్ధాంతాలను అనుసరించే రామచంద్రయ్య(ఆనంద్ చక్రపాణి) తన మనవరాలికి కూడా గాంధీ(సుకృతి వేణి) అని పేరు పెట్టి గాంధీ మార్గంలోనే పెంచుతాడు. ఆ ఊరి దగ్గర ఉన్న చక్కర ఫ్యాక్టరీ మూత పడటంతో ఊళ్ళో వాళ్లకు ఏం చేయాలో అర్ధం కాదు. అలాంటి సమయంలో అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెడతాం, మీ పొలాలు అమ్మేయండి అంటూ సతీష్(రాగ్ మయూర్) వస్తాడు. ఊళ్ళో జనాలు వాళ్ళ కష్టాలు తీరడానికి డబ్బుల కోసం పొలాలు అమ్మడానికి ఒప్పందాలు చేసుకుంటారు.

కానీ రామచంద్రయ్య మాత్రం తన పొలం అమ్మను అంటాడు. ఆ పొలంలో గాంధీ జ్ఞాపకార్ధం నాటిన చెట్టుని కొట్టడానికి ఒప్పుకోడు. అతని కొడుకు మాత్రం డబ్బుల కోసం పొలం అమ్మేయమని గొడవపెట్టుకోవడంతో ఆ చెట్టు పోతుందేమో అని బాధతో మరణిస్తాడు రామచంద్రయ్య. చనిపోయేముందు తన మనవరాలు గాంధీ దగ్గర ఎలాగైనా చెట్టుని కాపాడాలని మాట తీసుకుంటాడు. మరి ఆ చెట్టుని కాపాడటానికి గాంధీ ఏం చేసింది? ఊళ్ళో కెమికల్ ఫ్యాక్టరీ రాకుండా గాంధీ ఏం చేసింది? అహింస మార్గంలో గాంధీ ఊరందర్నీ ఎలా ఒక్కటి చేసింది అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also See : Daaku Maharaaj : డాకు మ‌హారాజ్ నుంచి సుక్క నీరే సాంగ్..

సినిమా విశ్లేషణ.. ముందునుంచి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చూస్తే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా, అవార్డుల సినిమా, డాక్యుమెంటరీ అనే అనిపిస్తుంది. కానీ కాసిన్ని కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి. అలాగే పుష్పతో నేషనల్ వైడ్ స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ కూతురు ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేయడంతో సినిమాపై అంచనాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా రామచంద్రయ్య, చెట్టు, మనవరాలు గాంధీ పాత్రల పరిచయం, ఊళ్ళో కష్టాలతో పొలాలు అమ్మడానికి సిద్దపడటం, రామచంద్రయ్య – కొడుకు గొడవతో సాగుతుంది. ఇంటర్వెల్ కి రామ చంద్రయ్య చనిపోవడంతో గాంధీ ఏం చేస్తుంది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో గాంధీ ఏం చేసింది, ఎలా ఆ చెట్టుని కాపాడింది? వాళ్ళ నాన్నని ఎలా మార్చింది? ఊళ్ళో పిల్లల్ని ఎలా ఒక్కటి చేసింది అంటూ ఆసక్తిగా చూపిస్తారు.

సినిమా అంతా 2000 సంవత్సరం బ్యాక్ డ్రాప్ లో జరిగినట్టు చూపించారు. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఓ డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని హీరోలు ఒక్క సాంగ్ లో ఎదిగిపోయినట్టు గాంధీ పాత్ర కూడా ఒక్క పాటలో ఊళ్ళో ఇండైరెక్ట్ గా ఏదో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తుందని చూపిస్తారు. కాకపోతే గాంధీ పాత్రతో ఎమోషన్ కూడా బాగానే పండించారు. క్లైమాక్స్ సింపుల్ గా అయిపోయింది, ఇంతేనా అనిపిస్తుంది. కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో చెట్లు, ఊరు ఎంత ముఖ్యం అనేది మాటల్లో అందరూ ఆలోచనలో పడే విధంగా చాలా బాగా చెప్పారు. ఒక 13 ఏళ్ళ అమ్మాయి గాంధీ అహింసావాదంతో తన ఊరిని, చెట్టుని ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో గాంధీ, తాత, చెట్టు ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటి జనరేషన్ పిల్లలకు, వాళ్ళ పేరెంట్స్ కు కూడా చూపించాల్సిన సినిమా ఇది.

Sukumar Daughter Sukriti Veni Gandhi Tatha Chettu Movie Review and Rating

నటీనటుల పర్ఫార్మెన్స్.. సుకుమార్ ఎంత స్టార్ డైరెక్టర్ అందరికి తెలిసిందే. ఈ సినిమా చూసాకా సుకృతిని తండ్రికి తగ్గ కూతురు అనాల్సిందే. ఒక అమాయక టీనేజ్ అమ్మాయి పాత్రలో సుకృతి క్యూట్ గా కనిపించి తన నటనతో మెప్పించింది. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు గుండు గీయించుకోమంటే చాలా కష్టం. కానీ ఈ సినిమా కోసం సుకృతి నిజంగానే గుండు గీయించింది. ఈ విషయంలో సుకృతిని అభినందించకుండా ఉండలేం.

ఇక తాత రామచంద్రయ్య పాత్రలో ఆనంద్ చక్రపాణి చాలా బాగా నటించారు. నెగిటివ్ షేడ్స్ లో రాగ్ మయూర్ మెప్పిస్తాడు. గాంధీ తండ్రి పాత్రలో చేసిన నటుడు కూడా కాస్త నెగిటివ్ షేడ్స్ తో ఆ పాత్రని పండించాడు. గాంధీ తల్లి పాత్రలో లావణ్య, ఫ్రెండ్స్ పాత్రల్లో భాను ప్రకాష్, మరో చైల్డ్ ఆర్టిస్ట్, మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. సినిమాలో చాలా పాత్రలకు ఆ ఊరి జనాలనే తీసుకోవడం విశేషం. చెట్టుకి తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ కొన్ని సీన్స్, షాట్స్ లో అద్భుతంగా చూపించినా కొన్ని చోట్ల మాత్రం కాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కాస్త డామినేటెడ్ గా అనిపిస్తుంది. ఉన్న రెండు పాటలు బాగున్నాయి. లొకేషన్స్ కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. అన్నీ రియల్ లొకేషన్స్ ని చాలా బాగా చూపించారు. చెట్టుని, ఊరిని కాపాడాలి అనే రెగ్యులర్ కథని ఒక మంచి ఎమోషన్ తో రాసుకొని చక్కని డైలాగ్స్ తో చూపించారు. డైరెక్టర్ సాంకేతికంగా ఇంకా కొంత నేర్చుకోవాలి. ఇది క్రౌడ్ ఫండింగ్ సినిమా కావడంతో లిమిటెడ్ బడ్జెట్ లోనే బెటర్ అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించారు.

మొత్తంగా ఓ ఊరిని, ఓ చెట్టుని కాపాడుకోవడానికి గాంధీ మార్గాన్ని అనుసరించే ఓ 13 ఏళ్ళ అమ్మాయి అహింసావాదంతో ఏం చేసింది, ఎలా కాపాడుకుంది అని మంచి మెసేజ్, ఎమోషన్ తో చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.