రియ‌ల్ హీరో ఈ దేవ‌ర‌కొండ‌ : సైనిక హీరోల కోసం సాయ‌మందించాడు

  • Published By: venkaiahnaidu ,Published On : February 16, 2019 / 04:04 AM IST
రియ‌ల్ హీరో ఈ దేవ‌ర‌కొండ‌ : సైనిక హీరోల కోసం సాయ‌మందించాడు

క‌ష్టాల్లో ఉన్న‌వారికి సాయ‌మందించ‌డంలో హీరో విజ‌య్ దేవ‌రకొండ ఎప్పుడూ ముందుంటాడు. అనేక సంద‌ర్భాల్లో క‌ష్టాల్లో ఉన్న‌వారి కోసం ఇండస్ట్రీ వైపు నుంచి మొద‌టిగా సాయం అందించి మిగ‌తా న‌టుల‌కు స్ఫూర్తిగా నిలిచిన దేవ‌ర‌కొండ ఇప్పుడు మ‌రో మంచి ప‌నితో అంద‌రి మ‌న‌సులు గెల్చుకున్నాడు. పుల్వామా ఉగ్ర‌దాడిలో 49మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన‌ విష‌యం తెలిసిందే. దేశం మొత్తం ఈ ఘ‌ట‌న‌ను ముక్త‌కంఠంతో ఖండించింది.

అమ‌ర జ‌వాన్ల కుటుంబాల‌ను అండ‌గా నిల‌బ‌డాల‌ని మిగ‌తా హీరోల్లా ట్వీట్ చేసి ఊరుకోకుండా  ప్రాణాలు కోల్పోయిన అమ‌ర‌జ‌వాన్ల‌ను ఆదుకునేందుకు ఆర్థిక‌సాయం అందించి ఆ స‌ర్టిఫికెట్ ను త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అంద‌రిచేత రియ‌ల్ హీరో అనిపించుకొన్నాడు దేవ‌ర‌కొండ‌.

మ‌న కుటుంబాల‌ను వాళ్లు కాపాడుతున్నారు. ఆ సైనికుల కుటుంబాల‌కు అండ‌గా నిల‌బ‌డాలి. ఏ సాయంతో మ‌న సైనికుల జీవితాల‌ను వెల‌క‌ట్ట‌లేం కానీ మ‌న‌వంతు స‌హ‌కారం అందించాలి. నా వంతు స‌హ‌కారం నేను చేశా.మ‌నందరం క‌లిసి సాయం చేద్దాం. అంద‌రం క‌లిసిక‌ట్టుగా స‌పోర్ట్ సిస్ట‌మ్ క్రియేట్ చేద్దామంటూ విజ‌య్ త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అంద‌రికి స్ఫూర్తిదాయ‌కంగా నిలిచాడు.

నువ్వు బాస్ నిజ‌మైన హీరో అంటే అంటూ విజ‌య్ చేసిన ప‌నిని అంద‌రూ స‌పోర్ట్ చేయ‌డ‌మే కాకుండా కొంద‌రు తాము కూడా విజ‌య్ బాట‌లోనే అంటూ జ‌వాన్ల కుటుంబాల‌కు త‌మ వంతు సాయం అందించామంటూ స‌ర్టిఫికెట్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. విజ‌య్ త‌న మంచి మ‌న‌సుతో ఎదుటివారికి సాయ‌మందించ‌డంలో ఎప్పుడూ ముందే ఉంటార‌ని నెటిజ‌న్లు అంటున్నారు.