Anushka Shetty : అనుష్క బర్త్‌డే స్పెషల్.. జార్జియా కారు డ్రైవర్ కథ తెలిస్తే.. స్వీటీకి సెల్యూట్ అంటారు.. అనుష్క 50వ సినిమా?
అనుష్క నటిగా ఎంత మంది పేరుని, అవార్డులను సొంతం చేసుకున్నారు. వ్యక్తిత్వంతో అంతకు మించి స్థాయిని, ప్రశంసలను అందుకున్నారు. స్వీటీ స్వీట్ మనసు గురించి చెప్పాలంటే ఒక జార్జియా కారు డ్రైవర్ కథ చెబితే చాలు.

Tollywood Star Heroine Anushka Shetty Birthday special story
Anushka Shetty : టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి.. అందం, అభినయానికి మరో రూపం అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా ఫేమ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉంటారు. వారిలో ఒకరు అనుష్క శెట్టి. అరుంధతిగా బాక్స్ ఆఫీస్ ని భయపెట్టి దేవసేనగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదాని అందుకుంది. నవంబర్ 7న కర్ణాటకలోని ఒక తుళు భాష మాట్లాడే కుటుంబంలో అనుష్క జన్మించారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీ.
అనుష్క సూపర్ ఎంట్రీ..
అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగ టీచర్ గా వర్క్ చేసేవారు. పూరీజగన్నాధ్ నాగార్జునతో తెరకెక్కించే ‘సూపర్’ సినిమా కోసం ముంబైలో హీరోయిన్స్ వేట మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే అనుష్క పేరుని పూరీకి ఒకరు చెప్పగా.. ఆమెను ఒక హోటల్ లో కలుసుకున్నారు. ఆ మీటింగ్ లో పూరీ, అనుష్కని యాక్టింగ్ వచ్చా, డాన్స్ వచ్చా అని ప్రశ్నలు అడిగితే, ఆమె.. వచ్చు, రాదు అని సమాధానాలు కాకుండా ఏమో తెలియదు అని క్రేజీ ఆన్సర్ ఇచ్చారట.
అయితే అనుష్క హైట్, అందం పూరీకి బాగా నచ్చడంతో ఆమెను కాదనలేక హైదరాబాద్ తీసుకు వచ్చాడు. నాగార్జున కూడా చూడగానే ఒకే చెప్పేశాడట. అయితే సినిమా షూటింగ్ వెళ్లే ముందు.. అన్నపూర్ణ స్టూడియోలోనే కొన్ని రోజులు పాటు యాక్టింగ్ పై శిక్షణ ఇచ్చారట.
అనుష్క నామకరణం..
అనుష్క అసలు పేరు స్వీటీ. అయితే సినిమాల్లో ఈ పేరు బాగోదు, ఒక మంచి పేరు పెట్టాలని నాగార్జున, పూరీ.. అనుష్కకు పేరు పెట్టే బాధ్యత తీసుకున్నారు. సూపర్ మూవీలో ‘మిల మిల’ అనే సాంగ్ ఉంటుంది. ఆ పాట పడడానికి ముంబై నుంచి ఒక అమ్మాయి వచ్చిందట. ఆమె పేరు అనుష్క. ఆ పేరు బాగుంది కదా అని అదే పెట్టేశారు.
బాక్స్ ఆఫీస్ అరుంధతి..
సూపర్ తో మొదలైన అనుష్క కెరీర్ విక్రమార్కుడు, లక్ష్యం, బలాదూర్, శౌర్యం వంటి హిట్స్ తో గ్లామర్ హీరోయిన్ గా మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. కానీ 2009లో వచ్చిన ‘అరుంధతి’ సినిమాతో నటిగా తను ఏంటో అందరికి చూపించారు. జేజమ్మగా రాజసం చూపిస్తూనే, అరుంధతిగా భయపడుతూ భయపెడుతూ నటిగా ఆడియన్స్ మనసు గెలిచారు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో ఈ చిత్రం అప్పటి హైయెస్ట్ గ్రాసర్.
వేశ్యగా అనుష్క వేదం..
వేశ్య పాత్రలు చేయడానికి చాలామంది యాక్ట్రెస్ లు ముందుకు రారు. ఆ పాత్ర చేసిన తరువాత ఫ్యామిలీ కథలు, ప్రేమ కథల్లో ఆడియన్స్ తమని చూడలేరని, ఆఫర్స్ తగ్గుతాయని భావిస్తుంటారు. వేదం సినిమాలో అలాంటి పాత్రని చేయడానికి హీరోయిన్స్ బయపడుతుంటే.. అనుష్క ఆ పాత్ర చేసి ధైర్యం చేశారు. ఆ తరువాత రుద్రమ్మ దేవి, రాణి లక్ష్మి భాయ్, దేవసేన వంటి గొప్ప పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకొని.. తప్పు అపోహతో ఉన్న హీరోయిన్స్ కి వేదంగా నిలిచారు.
జార్జియా కారు డ్రైవర్ కథ..
అనుష్క నటిగా ఎంత మంది పేరుని, అవార్డులను సొంతం చేసుకున్నారు. వ్యక్తిత్వంతో అంతకు మించి స్థాయిని, ప్రశంసలను అందుకున్నారు. స్వీటీ స్వీట్ మనసు గురించి చెప్పాలంటే ఒక జార్జియా కారు డ్రైవర్ కథ చెబితే చాలు. అనుష్క ఒక తమిళ సినిమా షూటింగ్ సమయంలో జార్జియా వెళ్లారు. అక్కడ అనుష్క ఉన్నంత కాలం ఆమెకు ‘జాజా’ అనే వ్యక్తి కార్ డ్రైవర్ గా, కేర్ టేకర్ గా పని చేశాడట.
అయితే ఒక రోజు ఆ జాజా రాకుండా వేరే వ్యక్తి వచ్చాడట. అనుష్క ఆమె మేనేజర్ ని పిలిచి జాజాకి ఏమైంది అని అడిగారట. దానికి మేనేజర్ బదులిస్తూ.. “జాజా తన కారుకి కట్టాల్సిన లోన్ అమౌంట్ కట్టలేదట. అందుకనే అతని కారుని కంపెనీ వాళ్ళు తీసుకు వెళ్లిపోయారు” అని చెప్పాడట. ఇక అది తెలుసుకున్న అనుష్క.. జాజాని పిలిపించి ఒక షో రూమ్ కి తీసుకు వెళ్లి బెంజ్ కారు కొనిపెట్టారట.
ఈ విషయం చాలా కాలం ఎవరికి తెలియదు. ఒక సినిమా పని మీద అరుంధతి నిర్మాత శ్యామ్ ప్రసాద్ జార్జియా వెళ్ళినప్పుడు.. జాజా శ్యామ్ ప్రసాద్ కారు డ్రైవర్ గా పని చేశాడట. ఆ సమయంలో శ్యామ్ ప్రసాద్ హైదరాబాద్ అని తెలుసుకొని, అనుష్క స్నేహితుడని తెలుసుకొని.. జాజా ఆయనను చాలా జాగ్రత్తగా చేసుకున్నాడట. జాజా కుటుంబం అనుష్కని ఒక దేవతలా భావిస్తారట. అలా ఆ విషయం శ్యామ్ ప్రసాద్ ద్వారా టాలీవుడ్ లోని ఆడియన్స్ తో పాటు ప్రముఖులకు కూడా తెలిసింది.
అనుష్క 50వ సినిమా..
ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కనిపిస్తున్న అనుష్క.. రీసెంట్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నారు. ప్రెజెంట్ మలయాళంలో ఒక పీరియాడిక్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. త్వరలో ఆమె కెరీర్ లో 50వ సినిమాని తీసుకు రాబోతున్నారు. ఈ మైల్ స్టోన్ మూవీ కోసం ఆమె సూపర్ హిట్ మూవీ ‘భాగమతి’కి సీక్వెల్ తీసుకు రాబోతున్నారు.