Saindhav Review : ‘సైంధవ్’ మూవీ రివ్యూ.. కూతురు కోసం వెంకీమామ విధ్వంసం..
విక్టరీ వెంకటేశ్(Venkatesh) తన 75వ సినిమాగా ‘సైంధవ్’తో వచ్చాడు. నేడు జనవరి 13న సైంధవ్ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.

Venkatesh 75th Movie Saindhav Review and Rating full Report
Saindhav Review : శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్(Venkatesh) తన 75వ సినిమాగా ‘సైంధవ్’తో వచ్చాడు. నేడు జనవరి 13న సైంధవ్ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ తోనే ముందు నుంచి ఈ సినిమా ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లతో ఉంటుందని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా.. తదితరులు నటించారు.
కథ విషయానికొస్తే.. చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో సైంధవ్(వెంకటేష్) తన పాపతో(బేబీ సారా) కలిసి అక్కడి పోర్ట్ లో క్రేన్ ఆపరేటర్ గా పనిచేసుకుంటూ బతుకుతుంటాడు. వీళ్ళ ఇంటి పక్కనే భర్తకు విడాకులు ఇచ్చేసి సింగిల్ గా ఉంటున్న మనో(శ్రద్ధ శ్రీనాధ్) సైంధవ్ తో, పాపతో అటాచ్మెంట్ పెంచుకుంటుంది. అనుకోకుండా పాప కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా స్పైనల్ మస్క్యులార్ అట్రోఫీ(SMA) అనే జబ్బు ఉందని తెలుస్తుంది. ఆ జబ్బుని నయం చేయడానికి ఒక్క ఇంజెక్షన్ చాలు, కానీ దాని విలువ 17 కోట్లు. దీంతో పాపని ఎలా బతికించాలా అని బాధపడుతుంటాడు సైంధవ్. ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారని తెలుస్తుంది.
అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇస్తున్న పిల్లలకు గన్స్ ఇచ్చి టెర్రరిస్టుల దగ్గరకు పంపించేందుకు భారీగా గన్స్, డ్రగ్స్ షిప్ లో వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడంతో వీటిని పోర్ట్ కస్టమ్ ఆఫీసర్ పట్టుకుంటాడు. అతన్ని చంపి వాటిని తెచ్చుకోవాలని వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్దికీ) ప్రయత్నించగా సైంధవ్ అడ్డుపడతాడు. ఆ కంటైనర్ల నంబర్లు మార్చి దాచేస్తాడు. సైంధవ్ మళ్ళీ బరిలోకి దిగాడని చంద్రప్రస్థ మాఫియా గ్యాంగ్ అంతా భయపడుతుంది. సైంధవ్ ని చూసి అందరూ ఎందుకు భయపడతారు? సైంధవ్ గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? ఆ కంటైనర్లు బయటకి వచ్చాయా? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. వెంకటేష్ గతంలోనే ఇలాంటి ఎమోషనల్, మాస్ సినిమాలు ఎన్నో చేశారు. కథ కూడా గతాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్న హీరోకి ఓ సమస్య వస్తే మళ్ళీ ఆ గతంలోని మనుషులు రావడం అనేది చాలా సినిమాల్లో చూశాము. సైంధవ్ కూడా ఆల్మోస్ట్ అలాంటి కథే. ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్, తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్లు గురించి గొడవ, సైంధవ్ మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్ కి పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకొని సైంధవ్ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. చివరి ఇరవై నిముషాలు ఓ పక్క పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి.
ప్రీ క్లైమాక్స్ నుంచే ప్రేక్షకులని కూడా ఎమోషన్ చేసి కన్నీళ్లు పెట్టిస్తారు. చివర్లో ఓ లీడ్ ఇచ్చి సైంధవ్ మళ్ళీ వస్తాడు అంటూ సీక్వెల్ అనౌన్స్ చేయడం గమనార్హం. అయితే సినిమాలో సైంధవ్ గతంలో తోపు అనే రేంజ్ లో ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ ఇస్తారు కానీ అసలు గతాన్ని చూపించరు, దానిపై క్లారిటీ లేదనిపిస్తుంది. ఇది కొంత నిరుత్సాహ పరుస్తుంది. కొన్ని షాట్స్ లో మాత్రం వైలెన్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.
నటీనటుల విషయానికొస్తే.. వెంకటేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 74 సినిమాల నుంచి ఎమోషన్, లవ్, యాక్షన్ అన్ని కంటెంట్స్ తో మెప్పించాడు. ఇప్పుడు 75వ సినిమాలో కూడా తనకి బాగా కలిసొచ్చిన ఎమోషన్ ని ఎంచుకొని దానికి యాక్షన్ సీక్వెన్స్ లతో మెప్పించాడు. చివర 10 నిముషాలు మాత్రం వెంకటేష్ ఓ పక్క బాధపడుతూనే మరో పక్క యాక్షన్ సీన్స్ లు చేస్తూ ఉంటాడు. అప్పుడు మాత్రం వెంకీ మామ నటన అద్భుతం.
ఇక శ్రద్ద శ్రీనాధ్ భర్త హరాజ్మెంట్ కి అతన్ని వదిలేసి సైంధవ్ కి, పాపకి దగ్గరయ్యే పాత్రలో మెప్పించింది. డాక్టర్ పాత్రలో పిల్లల్ని కాపాడాలి అని తాపత్రయపడుతూ రుహాణి శర్మ అలరించింది. బాలీవుడ్ లో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధికి విలన్ గా మెప్పించాడు. అతని అసిస్టెంట్ గా, లేడీ విలన్ గా ఆండ్రియా కూడా మెప్పిస్తుంది. ఇక తమిళ నటుడు ఆర్య మాత్రం మధ్యమధ్యలో వచ్చి సైంధవ్ కి హెల్ప్ చేసి వెళ్లే పాత్రలో పర్వాలేదనిపిస్తాడు. శ్రద్ద శ్రీనాధ్ ఎక్స్ హస్బెండ్ పాత్రలో గెటప్ శ్రీను సీరియస్ గా కనిపించినా కామెడీని పండిస్తాడు.
Also Read : Hanuman Review : ‘హనుమాన్’ రివ్యూ.. జై హనుమాన్ అనాల్సిందే.. గూస్‌బంప్స్ గ్యారెంటీ..
సాంకేతిక అంశాలు.. సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో, బుజ్జికొండవే సాంగ్ లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుంది. మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంటుంది. వెంకీమామని చాలా స్టైలిష్ గా చూపించారు. చంద్రప్రస్థ అనే ఊరిని, సముద్రం లొకేషన్స్, పోర్ట్.. అన్నిటిని చాలా చక్కగా చూపించారు. ఇక దర్శకుడు శైలేష్ కొలను ఆల్రెడీ ‘హిట్’ సినిమాలతో సక్సెస్ అయ్యాడు. ఇందులో కూడా కథ కథనాన్ని చక్కగా రాసుకొని దర్శకుడిగా కూడా బాగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.
మొత్తంగా సైంధవ్ సినిమా పాప సెంటిమెంట్ తో స్టైలిష్ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తుంది. వెంకీమామ 75వ సినిమా కూడా తనకి బాగా కలిసొచ్చిన ఎమోషన్ తోనే రావడం విశేషం. ఈ సినిమాకు రేటింగ్ 2.5 ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.