Saiyaara: ‘సైయారా’ సినిమాపై కాసుల వర్షం ఎందుకు కురుస్తోంది? ఇంతటి సంచలనం ఎలా సృష్టిస్తోంది? జెన్-జెడ్‌కు ఇంతలా ఎందుకు నచ్చుతోంది?
ఈ సినిమా చూస్తున్న అభిమానులు థియేటర్లలోనే ఏడుస్తుండడం, మూవీలోని పాటలకు ఉత్సాహంతో ఊగిపోతుండడం వంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో భావోద్వేగాలు పండిన తీరు అద్భుతం.

Saiyaara:Ahaan Panday-Aneet Padda
Saiyaara: దేశంలోని సినీ అభిమానులు అంతా ఇప్పుడు ‘సైయారా’పై అమితాసక్తి కనబర్చుతున్నారు.. ముఖ్యంగా యూత్. ఈ బాలీవుడ్ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు కూడా లేరు. అయినప్పటికీ కథాబలం, యూత్‌ను ఆకట్టుకునే కంటెంట్ ఉంటే ఎలాంటి సంచలనం సృష్టించవచ్చో ఈ సినిమా నిరూపించింది.
ఈ సినిమా చూస్తున్న అభిమానులు థియేటర్లలోనే ఏడుస్తుండడం, మూవీలోని పాటలకు ఉత్సాహంతో ఊగిపోతుండడం వంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. నవరసాలను పండిస్తూ, ప్రేక్షకులను ఉర్రతలూగిస్తోంది. ఈ సినిమాలో భావోద్వేగాలు పండిన తీరు అద్భుతం. ఇదే ఈ సినిమాను ఇంత భారీ హిట్ చేసింది. ఒక్క సినిమా మానసిక స్థాయిలో ఎంతగా ప్రభావం చూపగలదో సైయారా తేటతెల్లం చేస్తోంది.
మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన సైయారా సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ప్రేమకథా చిత్రం తొలి వారం లోనే దేశంలో దాదాపు రూ.160 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో అహాన్ పాండే, అనీత్ పడ్డా ప్రధాన పాత్రల్లో నటించారు. తొలిసారి హీరో, హీరోయిన్లుగా నటించినప్పటికీ వారి యాక్టింగ్ అందరితో చప్పట్లు కొట్టిస్తోంది. యాక్టర్ చంకీ పాండే సోదరుడి పేరు చిక్కీ పాండే. చిక్కీ కొడుకే అహాన్ పాండే.
ఇక అనీత్ పడ్డా గతంలో కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో నటించింది. అలాగే, సలామ్ వెంకీ మూవీలో ఓ పాత్రలో నటించింది. ఈ సినిమా మ్యూజిక్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. సినిమాలోని సీన్లకు తగ్గ వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
సైయారా, బర్భాద్, హంసఫర్, ధున్ వంటి పాటలు ప్రేక్షకుల మనసులను తాకాయి. ఈ మూవీని ‘ఆషికీ 2’తో పోలుస్తున్నారు చాలా మంది. ఈ రెండు సినిమాలకు దర్శకుడు మోహిత్ సూరినే. కొందరు సైయారా మూవీని ఓ కొరియన్ సినిమాకు రీమేక్ అని కడా అంటున్నారు.
రిలీజ్ సమయంలో 800 థియేటర్లలోనే విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు 2,000 స్క్రీన్లకు పెరిగింది. ఈ సినిమా విడుదలకు ముందు పెద్దగా ప్రచారం లేకపోయినా నోటిమాటతో దూసుకెళ్లింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి పోస్టులు కనపడుతున్నాయి. యూత్, జెన్-జెడ్ ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్పందించడంతో సైయారా ఓ కల్చరల్ ఫినామినాగా నిలిచింది.
కథ సారాంశం ఏంటి?
ఈ సినిమాలో క్రిష్, వాణి పాత్రల్లో అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించారు. క్రిష్ కపూర్‌కు పెద్ద మ్యూజిక్ కంపోజర్ కావాలని కలలు కంటాడు. అతడిని వాణి ప్రేమిస్తుంది. అంతకుముందే లవ్ పేరుతో వాణిని మహేశ్ మోసం చేస్తాడు. క్రిష్‌తో ప్రేమలో పడ్డాక వాణి జీవితంలోకి మహేశ్ మళ్లీ వస్తాడు. వాణికి మానసిక సమస్యలు ఉంటాయి. వాణి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది. క్రిష్ కపూర్‌కు మ్యూజిక్ కంపోజర్ అవుతాడా? అనేది తదుపరి స్టోరీ.
గతంలో సంచలన ప్రేమకథలు ఇవే..
భారతీయ సినిమాలో ఇంతటి సంచలనాన్ని సృష్టించిన ప్రేమ కథలు కొన్నే ఉన్నాయి. ప్రతి తరం తన అభిరుచులకు అనుగుణంగా ప్రేమ కథలను తిరిగి నిర్వచించుకుంటోంది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమాను మనం ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉన్నాం. ఆ తరంవారిని అది బాగా ఆకట్టుకుంది.
గతంలో దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, గీతాంజలి, ప్రేమికుల రోజు, ప్రేమ దేశం వంటి కొన్ని సినిమాలు సంచలనం సృష్టించాయి. ప్రేమికుల కలల లోకాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయి. అప్పటి యూత్‌ను కట్టిపడేశాయి. అప్పటి యూత్‌కు తగ్గట్లు అవి వచ్చాయి. ఇప్పటి యూత్‌కు తగ్గట్లు సైయారా సినిమా వచ్చింది. ప్రేమను మరింత లోతుగా, భావోద్వేగపూరితంగా, నిజాయితీగా చూపించింది.
ప్రేమపై ఉన్న అభిప్రాయాలు ఇప్పుడు చాలా వరకు మారిపోయాయి. ప్రేమ కథలు కాలాన్ని బట్టి మారుతున్నాయి. సైయారా ఈ మార్పుని మరోసారి చూపించిన చిత్రం. ప్రేక్షకులు ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ కన్నా, హృదయాన్ని తాకే ప్రేమను కోరుకుంటున్నారు. అందుకే సైయారా చూస్తున్న నేటి యూత్ అందులో లీనమైపోయి భావోద్వేగానికి గురవుతోంది.