యాత్ర-మూవీ రివ్యూ

రాజకీయాలకు అతీతంగా, జననేతగా.. చాలా మంది మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి లాంటి ఓ మహానేత జీవితంలోని అత్యంత కీలక ఘట్టాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అనగానే అందరిలో ఆసక్తి కలిగింది. దానికి తోడు వై.ఎస్.ఆర్. పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు అనగానే.. సినిమాపై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్‌తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఎక్సైట్‌మెంట్ ఏర్పడింది. పొలిటికల్ సపోర్ట్ కూడా కలిసి రావడంతో ఫుల్ బజ్ క్రియేట్ చేసుకుని థియేటర్స్‌లోకి వచ్చింది యాత్ర. ఈ యాత్ర విజయం వైపు సాగిందా..? లేదా అనేది చూద్దాం.
సినిమా కథ విషయానికొస్తే.. కడపలో ప్రాంతీయ నేతగా బలమైన అభిమాన గణం, కార్యకర్తలు ఉన్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముందస్తుగా వచ్చిన ఎన్నికలను ఎదుర్కొనే శక్తిలేదని డీలా పడతాడు. తండ్రికి ఇచ్చిన మాటకూడా నిలబెట్టుకోలేను అనే నిర్ణయానికి వచ్చేస్తాడు. కానీ, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం.. రాజశేఖర్ రెడ్డిలో ప్రజల కన్నీళ్లు తుడవాలి అనే కసిని రేకెత్తిస్తాయి. కడప దాటి.. ప్రతి గడపలోకి వెళ్లి.. ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటాడు. అక్కడికక్కడే వాళ్లకు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను రూపొందిస్తూ.. ప్రజల్లో నేనున్నాననే నమ్మకాన్ని నిలుపుతాడు. సీఎంగా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటారు… ఈ అంశాలనే కథగా మలిచారు..
నటీనటుల విషయానికొస్తే.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే మమ్ముట్టి.. ఈ సినిమాకు అదే తరహా మ్యాజిక్ రిపీట్ చేశాడు. హావభావాలు, నడిచే పద్దతి అన్నింటిలోనూ వైఎస్ నే గుర్తు చేశాడు. డబ్బింగ్ పరంగా అక్కడక్కడా కాస్త పట్టి పట్టి మాట్లాడినట్టు అనిపించినా.. సినిమా సాగుతున్న కొద్దీ, తానే వైఎస్ అని నమ్మించేశాడు. ఈ సినిమాకి అతి పెద్ద ఎసెట్ మమ్ముట్టి. వైఎస్ ఆత్మ బంధువుగా, ఆత్మీయుడిగా అందరికీ తెలిసిన కేవీపీ పాత్రలో రావు రమేష్ అచ్చుగుద్దినట్టు సరిపోయాడు. ఇక జగపతిబాబు, సుహాసిని, అనసూయ, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్ , నాగినీడు, ఆశ్రిత.. వీళ్లంతా ఒకటీ, రెండు సీన్స్‌లో కనిపించినా.. ఆ సీన్స్ సినిమాకి కీలకం కావడంతో గుర్తుండిపోయేలా ప్రేక్షకులకు కనెక్ట్ చెయ్యగలిగాడు. పృధ్వి, సచిన్ కేద్‌కర్, పోసాని, జీవా, వినోద్ కుమార్, తోటపల్లి మధు తదితరులంతా.. కాంటెపరరీ పొలిటీషియన్స్‌గా తమ షేడ్స్‌ని పరిపూర్ణంగా పోషించి మెప్పించారు.
టెక్నీషియన్స్ విషయానికొస్తే.. వైఎస్ అభిమానిగా సినిమా స్టార్ట్ చేసిన మహి.వి.రాఘవ.. స్క్రిప్ట్ పై చాలా వర్క్ చేశాడు అని.. సినిమా చూస్తే అర్థం అవుతుంది. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా క్లియర్‌గా కన్వే చేశాడు. ఫస్టాఫ్ వరకూ ఎక్కడా తడపడకుండా చకచకా సాగిపోయిన యాత్ర.. సెకండాఫ్ వచ్చేసరికి కాస్త డల్ అయ్యింది. పూర్తిగా పొలిటికల్ కలర్ ఉన్న సినిమా కావడంతో, పాటలు ఎక్కువగా ఉండడం.. కొన్ని రిపిట్ సీన్స్‌లాంటివి సినిమా వేగాన్ని తగ్గించాయి. క్లైమాక్స్‌కి వచ్చేసరికి కుదురుకున్న డైరెక్టర్, హెవీ ఎమోషనల్ ఎపిసోడ్స్‌తో కన్ క్లూజన్ ఇచ్చాడు. చివరి 20 నిమిషాలు బాగా కనెక్ట్ అవుతారు ప్రేక్షకులు. సినిమాలో లీనం అయిపోతారు. సినిమా చివర్లో చూపించిన ఒరిజినల్ ఫుటేజ్ అభిమానుల్ని ఎమోషనల్‌గా కదిలించింది. ప్రతిపక్షంపై సెటైర్స్, లాస్ట్‌లో వైఎస్ జగన్‌ని ప్రొజెక్ట్ చెయ్యడం వంటివి ఉన్నాయి.
ఇక, సత్య సూర్యన్ సినిమాటోగ్రఫీ సినిమాకు జీవం పోసింది. అతను వాడిన కలర్ స్కీమ్ అండ్ షార్ట్ కంపోజిషన్ సినిమాకు కావల్సిన షార్ప్‌నెస్‌ను తీసుకొచ్చింది. ప్రతిసీన్‌లో కంటెంట్ బాగా ఎలివేట్ అయ్యింది. మ్యూజిక్ కూడా సినిమా థీమ్‌ని, కంటెంట్‌ని డ్రైవ్ చేసే విధంగా ఉంది. పెంచల్ దాస్ పాడిన పాట, క్లైమాక్స్‌కి వెయిట్ పెంచి పర్‌ఫెక్ట్ ఎండింగ్ అనిపించింది. విజయ్, శశిధర్ రెడ్డి నిర్మాణ విలువలు బావున్నాయి.
ఓవరాల్‌గా చెప్పాలంటే వై.ఎస్.ఆర్.కి ట్రిబ్యూట్‌గా తెరకెక్కిన యాత్ర.. కాస్తో, కూస్తో పొలిటికల్ రంగు పులుముకున్నా కూడా.. ఒక సిన్సియర్ ఎటెంప్ట్‌గా నిలిచింది. స్లో నెరేషన్, కొన్ని ల్యాగింగ్ సీన్స్ మినహాయిస్తే.. ఓవరాల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఓ.కే. అనిపిస్తుంది. వైఎస్ ఫాలోయర్స్‌కి అమితంగా కనెక్ట్ అయ్యే అంశాలున్న ఈ సినిమాలో, రెగ్యులర్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కింది. టాక్ పరంగానే కాకుండా కమర్షియల్‌గా కూడా డీసెంట్ హిట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్లస్ ..
మమ్ముట్టి నటన
డైలాగ్స్, ఆర్.ఆర్
సినిమాటోగ్రఫీ
క్లైమాక్స్
…..
మైనస్
స్లో నెరేషన్
అక్కడక్కడా డీవియేషన్స్