Zee Telugu: సంస్కృతి, సమైక్యత మేళవింపుగా.. ‘ప్రేమతో.. జీ తెలుగు’!

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.

Zee Telugu: సంస్కృతి, సమైక్యత మేళవింపుగా.. ‘ప్రేమతో.. జీ తెలుగు’!

Updated On : June 9, 2025 / 5:17 PM IST

Zee Telugu: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్​.. జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్​లో భాగంగా, జీ తెలుగు ఛానల్​ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు సంస్కృతి, సమాజం, సమిష్టి భావాల సంగమం.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ బ్రాండ్‌ ఫిల్మ్‌లో సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలిచే తెలుగువారి లోగిలిలో జరిగే పెళ్లి తంతును కళ్లకి కట్టినట్లు చూపించారు. బంధుమిత్రుల కోలాహలాల మధ్య తాటాకు పందిళ్లు, రంగవల్లులు, ఆవకాయ అన్నం, బూందీ లడ్డూ, కన్యాదానం పెళ్లి బుట్ట మొదలైన సంప్రదాయ వేడుకలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తెలుగువారి హృదయాలను హత్తుకుంటోంది.

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి వివాహానికి ముందు అనివార్య కారణాలతో సైనికుడైన తండ్రి విధుల్లో చేరవలసి వస్తుంది. ఆ వేడుకకు తండ్రి దూరంగా ఉన్నాడనే లోటు తెలియకుండా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు అంతా ఒక్కటై ఆ వివాహ వేడుకను వైభవంగా జరిపించారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సైనికుడికి ‘ఇంత పెద్ద కుటుంబం కారణంగానే పెళ్లి ఘనంగా జరిగింది’ అని భార్య గర్వంగా చెబుతుంది. ఈ వేడుక ‘మమతతోనే మాట మధురం’ అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.

Also Read: అఖిల్ రిసెప్షన్‌లో మహేశ్ బాబు ధ‌రించిన టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలుసా? మైండ్ బ్లాకే..

ఈ వేడుకలో జీ తెలుగు సీరియల్స్​ నటీనటులైన జగద్ధాత్రి- కేదార్, అరుంధతి, భాగమతి, అమరేంద్ర, చామంతి-ప్రేమ్​, ఆద్య- శ్రీను, రామలక్ష్మి-శౌర్య, భూమితోపాటు మరికొందరు సందడి చేశారు. ఈ బ్రాండ్ ఫిల్మ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి మనసు దోచేలా ఉంది.

ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. “‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్​ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలే ప్రధానంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనేందుకు జీ తెలుగు ఎల్లప్పుడూ ముందుంటుంది. మన వివాహ పద్ధతిలోని సౌందర్యాన్ని కళ్లకి కట్టినట్లు చూపించే ఈ బ్రాండ్ ఫిల్మ్​ తెలుగు సంస్కృతి, విలువలు, ఆచారాలను ఆవిష్కరిస్తుంది. ఇది కేవలం రీబ్రాండింగ్​ మాత్రమే కాదు, ప్రేక్షకులతో జీ తెలుగు అనుబంధం మరింత బలపడటానికి దోహదపడుతుంది. ఎప్పటిలాగే తెలుగు ప్రేక్షకులు జీ తెలుగు నూతన ప్రయాణాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు.

ఈ బ్రాండ్ ఫిల్మ్ భారతదేశంలోనే మొదటిసారిగా ఏడు విభిన్న సాంస్కృతిక కథలతో రూపొందించిన బహుభాషా సిరీస్‌. 23వ జీ సినీ అవార్డ్స్ సందర్భంగా జీ జాతీయ, ప్రాంతీయ ఛానెల్స్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేసారి ఈ బ్రాండ్ ప్రసారమైంది. ప్రముఖ గాయకులు రేవంత్​, జయశ్రీ ఈ బ్రాండ్​ ఫిల్మ్​ తెలుగు ఒరిజినల్​ ట్రాక్​ను ఆలపించారు. ఈ పాట తెలుగువారి అనుబంధాలు, ప్రేమ, అభిమానం, ఆప్యాయతలను ప్రతిబింబిస్తుంది.

‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్​ అన్ని ప్రసారాలు, డిజిటల్​ ఫ్లాట్​ఫామ్స్​లో కొనసాగుతుంది. ఈ క్యాంపెయిన్​లో జీ తెలుగు సీరియల్స్ జగద్ధాత్రి, నిండు నూరేళ్ల సావాసం, చామంతి, ఘరానా మొగుడు, పడమటి సంధ్యారాగం, ముక్కుపుడక నుంచి పలువురు నటీనటులతోపాటు మరికొందరు నటులు సందడి చేశారు. జీ తెలుగు.. కేవలం వినోదం పంచే ఛానల్​గానే కాకుండా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ కొనసాగుతుందని ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్​ మరోసారి నిరూపించింది.