అసోం కల్తీసారా ఘటన : 140కి చేరిన మృతులు..

అసోం : కల్తీ సారా తాగి మృతి చెందిన ఘటనలో మృతుల సంఖ్య 140 మందికి చేరారు.గోలాఘాట్, జోర్హాత్ జిల్లాల పరిధిలోకి వచ్చే తేయాకు తోటల్లో పని చేసే కూలీలు గురువారం (ఫిబ్రవరి 21)రాత్రి ఓ వివాహ విందులో భాగంగా కల్తీ సారా తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతో మరికొందరు మృతి చెందారు. మరో 300ల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.
వివాహ విందులో నాటు సారా తాగిన వందలాదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో స్థానికులు దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. తరలించే మార్గంలోనే 12 మంది మృతి చెందగా, మిగిలిన వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకీ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన కొనసాగుతోంది.
కూలీలు తాగిన మద్యంలో కల్తీ తీవ్రంగా జరిగినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అందుకే మృతుల సంఖ్య తీవ్రంగా ఉందన్నారు. ఈ ఘటనపై అసోం సీఎం శర్వానంద సోనోవాల్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 12మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 90కి పైగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా తయారుచేసే కేంద్రాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.