2020-21 Budget: మనదేశం షాలిమార్ తోట..దాల్ సరస్సులోని విరబూసిన కమలంలాంటిది

పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తనదైన శైలి 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ నోటి వెంట కశ్మీరీ పద్యం జాలువారింది. మన దేశం దాల్ సరస్సులోని విరబూసిన కమలం లాంటిదని నిర్మలా చెప్పడంతో సభలోని సభ్యులు కరతాళ ధ్వనులు చేశారు.
మన దేశం జమ్మూకశ్మీర్‌లోని షాలిమార్ తోట లాగా వికసిస్తుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్థావిస్తూ కశ్మీరీ పద్యాన్ని వల్లె వేశారు. ‘‘మన దేశం షాలిమార్ తోటలాగా వికసిస్తుంది…మన దేశం దాల్ సరస్సులోని విరబూసిన కమలంలాంటిది, మన దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం లాంటిది…మన దేశం ప్రపంచంలోనే అందరి కంటే మనోహరమైంది’’ అని నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
కేంద్రమంత్రి నిర్మలా కశ్మీరీ పద్యానికి సభలోని సభ్యులు బల్లలు చరిచి మరీ ప్రశంసించారు. కాగా గతంలో కూడా మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చక్కటి పద్యాలను..కవితలను చదివి వాతావరణాన్ని ఆహ్లాదపరిచిన విషయం తెలిసిందే.