తమిళనాడు కల్తీసారా ఘటనలో 25కి చేరిన మృతుల సంఖ్య

Kallakurichi: కల్తీ మద్యాన్ని అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

తమిళనాడు కల్తీసారా ఘటనలో 25కి చేరిన మృతుల సంఖ్య

తమిళనాడులోని కల్లకురిచిలో కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 25కి చేరింది. ఆసుపత్రిలో ఇంకా సుమారు 60 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ సారా ఘటనపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ.. కల్తీ మద్యం సేవించి పలువురు మరణించిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.

నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశామని స్టాలిన్ తెలిపారు. కల్తీ మద్యాన్ని అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి ప్రజలకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని స్టాలిన్ చెప్పారు.

కాగా, కల్లకురిచి జిల్లా కలెక్టరు శ్రవణ్ కుమార్, ఎస్పీ సమయ్ సింగ్ మీనాపై వేటు వేశారు. మరో తొమ్మిది మంది పోలీస్, ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు. కొత్త కలెక్టరుగా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేది నియమితులయ్యారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని స్టాలిన్ చెప్పారు. తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి ముత్తు స్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేశారు.

Also Read: ‘బేటీ బచావో, బేటీ పఢావో’ నినాదాన్ని తప్పుగా రాసిన కేంద్ర మంత్రి