ఈ ఊరి జనాభా 1,500 మాత్రమే.. వారు 3 నెలల్లో ఏకంగా 27,000 మంది శిశువులకు జన్మనిచ్చారంటూ..

ప్రభుత్వ పరంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే డిజిటల్ వ్యవస్థలో ఈ వివరాలు ఉన్నాయి.

ఈ ఊరి జనాభా 1,500 మాత్రమే.. వారు 3 నెలల్లో ఏకంగా 27,000 మంది శిశువులకు జన్మనిచ్చారంటూ..

Updated On : December 18, 2025 / 6:42 PM IST

Birth Certificate Scam: మహారాష్ట్రలోని ఒక గ్రామంలో కేవలం 3 నెలల వ్యవధిలో 27,397 మంది శిశువులు జన్మించారని రికార్డుల్లో రాశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ గ్రామ జనాభా 1,500 మాత్రమే. ఇది ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద జనన ధ్రువపత్రాల మోసమని అధికారులు భావిస్తున్నారు.

ఈ అవకతవకలు యవత్మాల్ జిల్లా ఆర్నీ తాలూకాలోని శేందురుసానీ గ్రామపంచాయతీలో బయటపడ్డాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో అంతమంది పుట్టారంటూ రికార్డుల్లో రాశారు. జనన, మరణ వివరాల పరిశీలన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ విషయం అధికారుల దృష్టిలోకి వచ్చింది. గ్రామ జనాభాతో పోలిస్తే జననాల సంఖ్యలు సమంగాలేవని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. (Birth Certificate Scam)

సైబర్ నేర ముఠా పనే జనన, మరణాల నమోదు వ్యవస్థ దుర్వినియోగానికి గురైనట్లు దర్యాప్తులో తేలింది. జనన, మరణాల నమోదును సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌లో చేస్తారు. ప్రభుత్వ పరంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే డిజిటల్ వ్యవస్థ ఇది.

Also Read: స్పీకర్‌ తీర్పుపై వాళ్లు ఇలా చేయొచ్చు: పార్టీ ఫిరాయింపుల ఇష్యూపై రేవంత్‌ రెడ్డి

గ్రామపంచాయతీ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లాగిన్ ఐడీ ముంబైకి మ్యాప్ అయి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. ఇది బాగా శిక్షణ పొందిన సైబర్ నేర ముఠా పనిగా అధికారులు భావిస్తున్నారు. ఇటువంటి ముఠాలు డిజిటల్ వ్యవస్థల ద్వారా అక్రమంగా డేటాను మార్చి లాభం పొందే నేరాలకు పాల్పడతాయి.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా ఆరోగ్య అధికారి యవత్మాల్ నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి మందార్ పాట్కీ పంచాయతీ విభాగం ఉప ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.

శేందురుసానీ గ్రామంలో ప్రత్యక్ష పరిశీలన చేసిన కమిటీ.. 27,397 జనన నమోదు వివరాలు, అలాగే 7 మరణ నమోదు వివరాలు గ్రామపంచాయతీ పరిధికి సంబంధించినవి కావని నిర్ధారించింది.

సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఐడీ ఎలా హ్యాక్ అయిందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఐడీలకు సంబంధించిన మోసాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు లేదా ఇతర అక్రమ కార్యకలాపాల కోసం సైబర్‌ నేరగాళ్లు ఈ డేటాను వినియోగించారా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.

అక్రమంగా నమోదు చేసిన పేర్లలో 99 శాతం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవిగా ఉన్నాయని సీనియర్ బీజేపీ నేత కిరిట్ సోమయ్య తెలిపారు. ఈ జనన నమోదు వివరాలన్నీ రద్దు చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కి విజ్ఞప్తి చేసినట్లు సోమయ్య మీడియాకు తెలిపారు. జనన, మరణాల నమోదులో జరిగిన తేడాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.