Santhara: మూడేళ్ల బాలికతో సంతార చేయించిన తల్లిదండ్రులు.. చిన్నారి మృతి.. అసలేంటీ సంతార, ఎందుకు ఎంచుకున్నారు?

పీయూష్‌ జైన్‌, వర్ష జైన్‌లు తమ మూడేళ్ల కుమార్తె వియానాకు బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నట్లు 2024 డిసెంబర్ లో గుర్తించారు.

Santhara: మూడేళ్ల బాలికతో సంతార చేయించిన తల్లిదండ్రులు.. చిన్నారి మృతి.. అసలేంటీ సంతార, ఎందుకు ఎంచుకున్నారు?

Updated On : May 6, 2025 / 12:39 AM IST

Santhara: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్న వియానా జైన్ అనే మూడేళ్ల బాలికతో ఆమె తల్లిదండ్రులు పురాతన జైన మతపరమైన ఆచారం సంతార ఆచరింపజేశారు. ఆ ఆచారం పాటించిన చిన్నారి మరణించింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు మిగిలింది ఏంటంటే.. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ మాత్రమే.

ఆ చిన్నారి తల్లిదండ్రులు పీయూష్ జైన్ (35), వర్ష జైన్ (32) ఐటీ ఉద్యోగులు. వియానా వారి ఏకైక కుమార్తె. బాలిక మార్చి 21న మరణించింది. వారి ఆధ్యాత్మిక గురువు, జైన సన్యాసి రాజేష్ ముని మహారాజ్ సలహా మేరకు బాలిక తల్లిదండ్రులు సంతార చేయించారు. “ప్రపంచంలోనే జైన ఆచారమైన సంతారను పాటించిన అతి పిన్న వయస్కురాలు వియానా” అని ప్రకటిస్తూ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జారీ చేసిన సర్టిఫికెట్ తో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

జైన ఆచారం సంతార అంటే ఏమిటి?
అసలు.. బాలిక తల్లిదండ్రులు పాటించిన జైన ఆచారం ఏంటి? దాన్ని ఏమంటారు? అందులో ఏం చేస్తారు? ఆ వివరాల్లోకి వెళితే.. సంతార.. సల్లేఖన లేదా సమాధి మారన్ అని కూడా పిలుస్తారు. సంతార జైన మతంలో ఒక గంభీరమైన ప్రతిజ్ఞ. ఇది ఆమరణ నిరాహార దీక్ష(ఉపవాస దీక్ష). దీనిలో ఒక వ్యక్తి క్రమంగా ఆహారం, నీటిని వదులుకుని ఆధ్యాత్మిక నిర్లిప్తతతో మరణాన్ని స్వీకరించడం.

ఇది కర్మ నుండి ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. భౌతిక ప్రపంచం నుంచి దూరం కావడాన్ని సంతార అంటారు. ముఖ్యంగా మరణం దగ్గరపడిందని నమ్మినప్పుడు ఇలా చేస్తారు. ఈ ఆచారాన్ని సాధారణంగా వృద్ధులు లేదా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు అనుసరిస్తారు. జైన మతాచారాల ప్రకారం మరణించే వరకు ఉపవాసం చేసే దీక్షను సంతార అంటారు.

Also Read: ఐదేళ్ల తర్వాత కైలాస మానసరోవర యాత్ర.. ఎవరెవరు వెళ్లొచ్చు, అర్హతలు నిబంధనలేంటి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి.. పూర్తి వివరాలు..

పీయూష్‌ జైన్‌, వర్ష జైన్‌లు తమ మూడేళ్ల కుమార్తె వియానాకు బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నట్లు 2024 డిసెంబర్ లో గుర్తించారు. ఆమెకు ముంబైలో శస్త్ర చికిత్స చేయించారు. ఆమె పరిస్థితి మొదట్లో మెరుగుపడే సూచనలు కనిపించాయి. కానీ మార్చి నాటికి మళ్లీ తీవ్రమైంది. పాప ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వైపు మొగ్గు చూపారు.

జైన సాధువు రాజేశ్‌ ముని మహరాజ్‌ వద్దకు తీసుకెళ్లారు. వియానాకు మరణం ఆసన్నమైందని, పవిత్రమైన సంతార ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఆయన మాట ప్రకారం తల్లిదండ్రులు తమ పాపతో ఉపవాస దీక్ష చేయించారు. దాంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది.

జైన సాధువు రాజేశ్‌ ముని మహరాజ్‌ చెప్పినట్లుగానే.. మార్చి 21న ఇండోర్‌లోని సన్యాసి ఆశ్రమంలో రాత్రి 9గంటల 25 నిమిషాలకు సంతార ఆచారం ప్రారంభించారు. కేవలం 40 నిమిషాల తర్వాత రాత్రి 10గంటల 05 గంటలకు వియానా మరణించింది.

సంతారకు చట్టబద్ధత ఉందా?
ఆగస్టు 2015లో, రాజస్థాన్ హైకోర్టు సంతార చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. ఇది ఐపీసీ సెక్షన్లు 306 309 కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద రక్షించబడిన ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని పేర్కొంది. ఆర్టికల్ 21 కింద జీవించే హక్కులో చనిపోయే హక్కు కూడా లేదని కోర్టు స్పష్టం చేసింది.

సంతారను క్రిమినల్ నేరంగా పరిగణించి, తదనుగుణంగా కేసులు నమోదు చేయాలని కోర్టు రాష్ట్ర అధికారులను ఆదేశించింది. 2015లో, జైన సమాజం నుండి వచ్చిన పిటిషన్లను అంగీకరిస్తూ, సంతారను ఒక ప్రత్యేకమైన మత సంప్రదాయంగా గుర్తిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

సంతార తమ కుమార్తెకు ఆధ్యాత్మిక వీడ్కోలుగా వియానా తల్లిదండ్రులు అభివర్ణించినప్పటికీ, ఈ నిర్ణయం పట్ల పిల్లల హక్కుల న్యాయవాదులు, వైద్య నిపుణుల నుండి తీవ్ర నిరసన రేకెత్తించింది. “ఇది(సంతార) పూర్తిగా అవగాహన ఉన్న పెద్దలకు, సాధారణంగా వృద్ధులకు ఉద్దేశించిన ఆచారం” అని మధ్యప్రదేశ్ బాలల హక్కుల కమిషన్‌ తేల్చి చెప్పింది. “ఒక పసి పిల్లవాడు సమ్మతి ఇవ్వలేకపోవచ్చు. ఇది పిల్లల రక్షణ చట్టాలను ఉల్లంఘిస్తుందో లేదో మేము దర్యాప్తు చేస్తున్నాము. తగిన చర్య తీసుకుంటాము” అని వెల్లడించింది.