వృద్ధుల పట్ల అతి దారుణంగా వ్యవహరించిన ఓల్డేజ్ హోం నిర్వాహకులు.. ఏమేం చేశారంటే?
ఆ వృద్ధాశ్రమంపై పోలీసులు దాడిచేసి 42 మందిని రక్షించారు.

వృద్ధులపై ఓ ప్రైవేట్ ఓల్డేజ్ హోం నిర్వాహకులు అతి దారుణంగా వ్యవహరించారు. వారి చేతులను కట్టేసి, బేస్‌మెంట్ల వంటి గదుల్లో ఉంచి తాళం వేశారు. వారిలో కొందరు వృద్ధులకు బట్టలు కూడా ఇవ్వలేదు.
అలాగే, మరికొందరు వృద్ధులు మలమూత్రాల మరకలు అంటిన దుస్తులతోనే ఉండాల్సి వచ్చింది. కొందరు వృద్ధులు అర్ధనగ్నంగా ఉన్నారు. ఆ వృద్ధుల పరిస్థితికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ కావడంతో అధికారులు స్పందించారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆ వృద్ధాశ్రమంపై పోలీసులు దాడిచేసి 42 మందిని రక్షించారు. ఈ సోదాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్, సంక్షేమ శాఖ సభ్యుల సమక్షంలో జరిగాయి.
ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనాక్షి భరాలా తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడా సెక్టార్-55లోని సీ-5లో ఉన్న ఆనంద్ నికేతన్ వృద్ధ సేవా ఆశ్రమం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోంది. ఆశ్రమంలో మొత్తం 42 మంది వృద్ధులు ఉండగా వారిలో ముగ్గురిని శుక్రవారం ప్రభుత్వ సంక్షేమ శాఖ నిర్వహించే వృద్ధాశ్రమానికి తరలించారు. మిగిలిన వారిని ఇతర ప్రభుత్వ గుర్తింపు వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు.
వృద్ధులను చూసుకునేందుకు వారి కుటుంబ సభ్యుల నుంచి నిర్వాహకులు రూ.2.5 లక్షల చొప్పున డొనేషన్లతో పాటు, ప్రతి నెల రూ.6 వేలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వారిని సరిగ్గా చూసుకోవడం లేదు. వారిని చూసుకునేందుకు సిబ్బందిని కూడా నియమించలేదు. ఓల్డేజ్ హోం నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.