దేశవ్యాప్తంగా ముగిసిన పోలింగ్

హర్యానా,మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. రెండు రాష్ట్రాలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 5గంటలకు మహారాష్ట్రలో 44శాతం ఓటింగ్ మాత్రమే నమోదవగా,హర్యానాలో 52శాతం నమోదైంది.
దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు కూడా ఇవాళ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఇవాళే ఉప ఎన్నిక జరిగింది. హర్యానాలో,మహారాష్ట్రలో మరోసారి అధికార పగ్గాలు చేపట్టేది తామేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ కూడా ఈ సారి తామే అధికారంలోకి రాబోతున్నామనే ధీమాతో ఉంది. అక్టోబర్-24,2019న ఫలితాలు వెలువడనున్నాయి.