కాళ్లకు 20, చేతులకు 12 వేళ్లు : మంత్రగత్తె అంటూ వేధింపులు

  • Published By: veegamteam ,Published On : November 25, 2019 / 04:34 AM IST
కాళ్లకు 20, చేతులకు 12 వేళ్లు : మంత్రగత్తె అంటూ వేధింపులు

Updated On : November 25, 2019 / 4:34 AM IST

ఒడిషాలోని గంజాంకు చెందిన కుమారీ నాయక్ అనే  65 మహిళకు పుట్టుకతోనే కాళ్లకు 20 వేళ్లు..చేతులకు 12 వేళ్లతో పుట్టింది. అదే ఆమెకు శాపంగా మారింది. మంత్రగత్తె అంటూ ఊరంతా ఆమెపై ముద్ర వేసింది. అంతులేని వివక్ష చూపింది. ఇంటిలో నుంచి బైటకు రాకూడదంటూ ఆంక్షలు విధించారు గ్రామస్తులు.

అసలే పేదరికం..దీనికి తోడు ఊరంతా కలిసి ఆమెపై వేసిన మంత్రగత్తె ముద్రకు ఏం చేయాలో దిక్కుతోచని అసహాయ స్థితిలో అల్లాడిపోయింది. తన కాళ్లుకు చేతులకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్న వేళ్లతో చిన్ననాటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడింది. ఏ పనిచేయాలన్నా ఆ వేళ్లతో పడరాని పాట్లు పడింది. అలాగే జీవితాన్ని లాక్కొచ్చింది. దీనికి తోడు ఆమెపై మంత్రగత్తె అనే ముద్ర వేసి..ఆమె ఇంటిలోనే ఆమెను బందీని చేసింది గ్రామం. ఇక ఆమె పరిస్థితి ఊహించుకోవటానికి కష్టంగా మారింది.  

పేదరికంతో తాను తన  కాళ్లకు చేతులకు చికిత్స చేయించుకోలేకపోయానని అంతే తప్ప తాను ఏ తప్పూ చేయలేదంటూ వాపోతోంది. తాను మంత్రెగత్తెను కాదని చెప్పుకున్నా ఎవ్వరూ నమ్మటంలేదంటూ కంటికి కడివెడు కన్నీటితో విలపిస్తోంది..ఈ వృద్ధాప్యంలో ఆ నిందను మోస్తూ బతకాల్సి వస్తోందంటూ తన దుస్థితిని అర్థం  చేసుకోమంటూ వేడుకుంటోంది. సమాజంలో పుట్టి కనీసం సాటి మనుషులతో సూటీ పోటీ మాటలు భరించలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తంచేస్తోంది. కనీసం ఇరుగు పొరుగు వారు కూడా తనతో మాట్లాడరనీ..ఇంటిలో నుంచి బైటకు వస్తే తనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారంటూ ఆవేదన చెందుతోంది. 

ఈ విషయంపై సర్జన్‌ డాక్టర్‌ పినాకి మహంతి మాట్లాడుతూ..కాళ్లకు 20, చేతులకు 12 వేళ్లు ఉండటం చాలా అరుదని, జన్యుపరంగా ఇలాంటివి జరగుగుతుంటాయనీ అన్నారు. ప్రతి ఐదు వేల మందిలో ఒకరిద్దరికి ఇలా జరుగుతుందని తెలిపారు. అంతే తప్ప ఎక్కువ వేళ్లతో పుట్టినంత మాత్రనా ఆమెపై వివక్ష చూపించటం తగదని సూచించారు. మూఢ నమ్మకాలతో సాటి మనుషులపై సామాజిక వివక్ష తగదని ఆయన సూచించారు. 

జంతువుల్లో కూడా లేనటువంటి విష సంస్కృతి మనుష్యుల్లో పెరిగిపోతోంది అనటానికి ఇదో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ‘వివక్ష’ అనేది జంతువుల్లో ఉండదు. కానీ విచక్షణ తెలిసిన మనుష్యులకు మాత్రం ఉంటుంది మరోసారి నిరూపించబడింది. సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవటం పక్కన పెడితే వారిని మరింతగా బాధకు గురిచేస్తున్న ఇటువంటి మూఢ నమ్మకాలపై మనుషుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.