భారత్‌లో రైతుల నిరసన సమస్యను లేవనెత్తాలి : పాంపీయోకు అమెరికా చట్ట సభ్యుల లేఖ

7 US Congress members ask Pompeo : భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో రైతుల నిరసన సమస్యను లేవనెత్తాలని విజ్ఞప్తి చేస్తూ భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ మహిళ ప్రమీలా జయపాల్‌తో సహా ఏడుగురు అమెరికా చట్టసభ సభ్యుల బృందం అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయోకు లేఖ రాసింది. ఈ లేఖపై ప్రమీలా జయపాల్‌తో పాటు, అమెరికా కాంగ్రెస్ సభ్యులు డొనాల్డ్ నోర్‌క్రాస్, బ్రెండన్ ఎఫ్ బాయిల్, బ్రియాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్, మేరీ గే స్కాన్‌లాన్, డెబ్బీ డింగెల్ డేవిడ్ ట్రోన్ కూడా సంతకం చేశారు.
రైతుల నిరసన పంజాబ్‌తో ముడిపడి ఉన్న సిక్కు అమెరికన్లకు ఆందోళన కలిగించే అంశంగా ప్రస్తావించారు. ఇతర భారతీయ రాష్ట్రాలకు చెందిన భారతీయ అమెరికన్లపై కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చట్టసభ సభ్యులు డిసెంబర్ 23 నాటి పాంపీయోకు రాసిన లేఖలో పేర్కొన్నారు. చాలా మంది భారతీయ అమెరికన్లు పంజాబ్‌లో కుటుంబ సభ్యులు, పూర్వీకుల భూమిని కలిగి ఉన్నారు. భారత్‌లో వారి కుటుంబాల గురించి ఆందోళన చెందుతున్నారు.
ఈ తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. విదేశాలలో రాజకీయ ప్రసంగ స్వేచ్ఛపై యునైటెడ్ స్టేట్స్ నిబద్ధతను బలోపేతం చేయడానికి భారత్‌ను సంప్రదించమని మిమ్మల్ని కోరుతున్నామని పేర్కొంది. దేశంలో రాజకీయ నిరసనల నేపథ్యంలో మిత్రదేశమైన అమెరికా భారతదేశానికి సలహాలు ఇవ్వగలదని చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. గత కొన్ని వారాలుగా, డజనుకు పైగా యుఎస్ కాంగ్రెస్ సభ్యులు రైతుల నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు.
పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి రైతులంతా కలిసి ఢిల్లీలో వేర్వేరు సరిహద్దుల్లో నవంబర్ 26 నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో అమల్లోకి తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు.