74 శాతం భారతీయులకు న్యూస్ ఛానళ్లే వినోదానికి వేదిక

74% Indians don’t bank on news channels for ‘real news’ దేశంలో నాలుగింట మూడొంతుల మంది న్యూస్ ఛానళ్లను వినోదాత్మకమైనవిగా భావిస్తున్నారని ఓ సర్వే తెలిపింది. దేశంలో ప్రస్తుతం న్యూస్ ఛానళ్లలో అసలు వార్తలకన్నా వినోదమే ఎక్కువగా ఉందని దాదాపు 74 శాతం మంది భావిస్తున్నట్లు ఐఏఎన్ఎస్ సీ-ఓటర్ సర్వేలో తేలింది.
లాక్డౌన్ ప్రభావంతో కొత్త కంటెంట్ నిలిచిపోవటం వల్ల.. వినోదం కోసం వార్తా ఛానళ్లను ఆశ్రయించినట్లు చాలా మంది తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 5 వేల మందిని సర్వేలో భాగంగా ప్రశ్నించారు. సెప్టెంబర్ చివరివారంలో మరియు అక్టోబర్ మొదటివారంలో ఈ సర్వే నిర్వహించారు.
సర్వేలో భాగంగా.. భారత్ లో వార్తా ఛానళ్లలో న్యూస్ కన్నా వినోదమే ఎక్కువా? అని అడిగిన ప్రశ్నకు 73.9 శాతం మంది అవునని సమాధానమిచ్చారు. 22.5 శాతం మంది కాదని, మరో 2.6 శాతం తెలియదని చెప్పారు.
లింగ పరంగా చూస్తే 75.1 శాతం మంది పురుషులు.. 72.7 శాతం మంది మహిళలు అంగీకరించారు. వయసు వారీగా చూస్తే 55 ఏళ్లలోపు వారు 70 శాతం మంది, 55 ఏళ్లకు పైబడిన వారు 68.7 శాతం వార్తా ఛానళ్లు వినోద ఛానళ్లుగా పనిచేస్తున్నాయన్నారు.ప్రాంతాలు, వర్గాల వారీగా చూసినా.. ఇదే రకమైన అభిప్రాయాలను వెల్లడించారు. దక్షిణ భారతంలో మాత్రం ఇతర ప్రాంతాలతో పోల్చితే కాస్త తక్కువగా 67.1శాతం మంది వార్తా ఛానళ్లలో న్యూస్ కన్నా వినోదం ఎక్కువగా ఉందని చెప్పారు.
కాగా, లాక్డౌన్ కారణంగా చిత్రీకరణలు, సినీ నిర్మాణ రంగానికి బ్రేక్ పడటం వల్ల కొత్త కంటెంట్ దాదాపు నిలిచిపోయింది. ఈ సమయంలో వార్తా ఛానళ్ల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపారు. కానీ, వార్తా ఛానళ్లలో వినోదం కోరుకోవటం వల్ల వాటి విశ్వసనీయత చాలా రకాలుగా దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.