జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు.. 9 మంది మృతి, మరో 29 మందికి గాయాలు

హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఇటీవల పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు.. 9 మంది మృతి, మరో 29 మందికి గాయాలు

Updated On : November 15, 2025 / 9:02 AM IST

జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు సంభవించి, 9 మంది మృతి చెందారు. మరో 29 మంది గాయపడ్డారు. శ్రీనగర్ సమీపంలోని నౌగామ్ ప్రాంత పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఇటీవల స్వాధీనం చేసిన పేలుడు పదార్థాలు పోలీస్‌ స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ పేలాయని అధికారులు తెలిపారు.

మృతి చెందిన వారిలో పోలీస్ సిబ్బంది, పేలుడు పదార్థాలు పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ బృంద సభ్యులు ఉన్నారని అన్నారు. శ్రీనగర్‌కు చెందిన ఇద్దరు అధికారులు కూడా ఈ పేలుడులో మృతి చెందారు.

హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఇటీవల పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటిని నౌగామ్ ప్రాంత పోలీస్ స్టేషన్‌లో ఉంచగా, నిర్వహణ లోపంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడికి గల కారణాల గురించి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: PM KISAN Installment: గుడ్‌న్యూస్‌.. పీఎం-కిసాన్ డబ్బులు వచ్చేస్తున్నాయ్‌.. మీ బ్యాంకు ఖాతాల్లో పడిపోతాయ్..

గాయపడిన వారిని భారత సైన్యం 92 బేస్ హాస్పిటల్, షేర్-ఈ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్కిమ్స్)కు తరలించింది. పోలీసు ఉన్నతాధికారులు నౌగామ్‌కు చేరుకున్నారు.

నౌగామ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కొన్ని వారాల క్రితం జైష్-ఈ-మొహమ్మద్ పోస్టర్ల కేసును అధికారులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్లు తీవ్రవాద మాడ్యూల్ బయటపెట్టాయి. ఇందులో తీవ్రవాద భావజాలం ఉన్న డాక్టర్ల ప్రమేయం కనిపించింది. అనంతరం జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఫరీదాబాద్ అల్ఫలాహ్ మెడికల్ కాలేజ్‌లో పనిచేసిన వైద్యుడు ముజమ్మిల్ షకీల్‌కు చెందిన ఇళ్లలో జరిపిన దాడిలో జమ్మూకశ్మీర్, హరియాణా జాయింట్‌ టీమ్‌ సుమారు 3000 కిలోల అమోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసింది.