Manipur Violence: ఉన్మాదపు చర్యలపై ఆవేశ ప్రకటనలు.. మణిపూర్ ఘటనా నిందితుల తల తెచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తానన్న ఆచార్య మనీష్
ఆచార్య మనీష్ లాంటి వారు చేసే ప్రకటనలు సమాజంలో వైషమ్యాలు పెంచేవే కాకుండా, ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయేలా చెడు సంకేతాలు ఇస్తాయనే విమర్శలు బలంగా ఉన్నాయి.

Acharya Manish: మణిపూర్‌లో కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ కావడంతో హర్యానాలోని సోనిపట్‌కు చెందిన ఆచార్య మనీష్ వివాదాస్పద ప్రకటన చేశారు. మణిపూర్ నుంచి నిందితుల తలలు నరికి తెచ్చే వారికి తాను ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా.. దీన్ని ఆయన సమర్ధించుకున్నారు. కూతుళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన వారిని చంపడాన్ని మతం అంటారని అన్నారు. ఆచార్య మనీష్ రాష్ట్ర స్వాభిమాన్ ట్రస్ట్ పేరుతో మతపరమైన సంస్థను నడుపుతున్నారు.
వాస్తవానికి ఏదైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు అనాలోచితంగా కొన్ని ప్రకటనలు వస్తూ ఉంటాయి. నిందితుల్ని కాల్చి పారేయాలి, ఉరి తీయాలంటూ న్యాయస్థానాలను ప్రభుత్వ వ్యవస్థలను డిమాండ్ చేస్తుంటారు. ఇక ఈ పరిధి దాటి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే విధంగా మరి కొందరి ప్రకటనలు ఉంటాయి. తలలు తీసుకురావాలనడం, చంపడం లాంటి ప్రకటనలు చేస్తుంటారు. ఇవి సమాజంలో మరింత వైషమ్యాలు పెంచేవే కానీ, తగ్గించేవి కావని నిపుణులు అంటున్నారు.
నిర్భయ ఉదంతం అనంతరం.. ఇలాంటి చర్యలకు పాల్పడే నిందితుల్ని ఉరి తీయాలనే డిమాండ్ వచ్చినప్పుడు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు ఈ డిమాండ్ మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష లాంటివి ఉంటే నిందితులు రేప్ అనంతరం ఆధారాలు లేకుండా బాధితులను చంపేస్తారని, అది నేర పరిధిని మరింత పెంచుతుందని ఆయన అన్నారు. ఇక ఆచార్య మనీష్ లాంటి వారు చేసే ప్రకటనలు సమాజంలో వైషమ్యాలు పెంచేవే కాకుండా, ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయేలా చెడు సంకేతాలు ఇస్తాయనే విమర్శలు బలంగా ఉన్నాయి.