రిపబ్లిక్ డే పరేడ్….బెంగాల్, మహారాష్ట్ర,కేరళ శకటాల ప్రదర్శనకు అనుమతి నిరాకరణ

దేశ రాజధానిలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తమ శకటాన్ని ప్రదర్శించాలనుకున్న మహారాష్ట్ర, కేరళ కు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. శకట ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలన్న ఆ రాష్ట్రాల విజ్ఞప్తిని కేంద్ర రక్షణశాఖ తిరస్కరించింది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ సహా హర్యానా,ఉత్తరాఖండ్,బీహార్ సహా పలు రాష్ట్రాల శకటాలు రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో శకటాన్ని అనుమతించడంలేదని శుక్రవారం రక్షణశాఖ ఓ ప్రకటక ద్వారా వెల్లడించింది. పరేడ్‌లో పాల్గొనే శకటాల జాబితాను ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది.
2020 గణతంత్ర దినోత్సవ కవాతులో మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాల శకటాలని అనుమతించబోమని రక్షణ శాఖ చేసిన ప్రకటనపై మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వీ,శివసేన నాయకుడు సంజయ్ రౌత్,ఎన్సీపీ నాయకులు నవాబ్ మాలిక్, సుప్రియా సూలే సహా చాలామంది విపక్ష నాయకులు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకించినందున రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని, అదేమిటో బయటపెట్టాలని,శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ డిమాండ్ చేశారు. కేంద్రం చర్య మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలకు అవమానకరమని ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే విమర్శించారు.
కాగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉపసంహరించాలని కోరుతూ ఇప్పటికే కేరళ అసెంబ్లీలో విజయన్ సర్కార్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. కేరళలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని విజయన్ చేశారు. అంతేకాకుండా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి వివాదాస్పద చట్టాలను కేరళ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీహార్,బెంగాల్,మహారాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సీఏఏను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
Defence Ministry’s list of shortlisted participants(tableaux) for Republic Day Parade 2020. pic.twitter.com/adKiUabpxQ
— ANI (@ANI) January 3, 2020