రాజస్థాన్ లో రిసార్ట్ రాజకీయం స్టార్ట్: రంగంలోకి ప్రియాంక గాంధీ

ఎడారి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీలోకి జంప్ చేసి సీఎం కుర్చీలో కూర్చుందామనుకున్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ మెత్తబడ్డారు.
30 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని, గహ్లోత్ ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న పైలట్.. అధిష్టానం చొరవతో మనసు మార్చుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి గహ్లోత్, పైలట్ మధ్య రాజీ ఫార్ములాను ముందుకు తెచ్చారు. దీంతో పైలట్ పలు డిమాండ్లను పార్టీ ముందుంచారు. పార్టీ చీఫ్‌గా తనను కొనసాగించడంతో పాటు తన వర్గానికి నాలుగు మంత్రి పదవులతో పాటు కీలక ఆర్థిక, హోంశాఖలను కట్టబెట్టాలని కోరారు. దీనిపై పార్టీ నేతలు ఇరు వర్గాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
అంతకుముందు ఢిల్లీ, జైపూర్ వేదికగా పార్టీలో రాజకీయ హైడ్రామా చోటుచేసుకుంది. తన ప్రభుత్వం మైనారిటీలో పడలేదని, తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం గహ్లోత్ స్పష్టం చేయడంతో నెంబర్ గేమ్‌పై ఉత్కంఠ నెలకొంది. రాజీ ఫార్ములాతో మెత్తబడిన సచిన్ పైలట్ ముఖ్యమంత్రి గహ్లోత్‌కు ఎంతవరకూ సహకరిస్తారనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు గహ్లోత్ నివాసంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం (సీఎల్పీ) ముగిసింది. ముఖ్యమంత్రి గహ్లోత్‌కు మద్దతు ప్రకటిస్తూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. భేటీ అనంతరం ఆయనకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలను బస్సుల్లో హోటల్ కు తరలించారు. ఈ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు అంతా సజావుగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. 102 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారని గహ్లోత్ వర్గీయులు చెబుతున్నారు
మరోవైపు రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి కాలం పాలన సాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు.