Agnipath scheme : అగ్నిపథ్​ పథకంలో కీలక మార్పు.. వయో పరిమితిని పెంచిన కేంద్రం

భారత త్రివిధ దళాల్లో యువతకు అవకాశం ఇచ్చేలా కేంద్రం కొత్తగా ప్రవేశ పెట్టిన 'అగ్నిపథ్' పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 'అగ్నిపథ్' పథకం వయో పరిమితిని పెంచుతు నిర్ణయం తీసుకుంది.

Agnipath scheme : అగ్నిపథ్​ పథకంలో కీలక మార్పు.. వయో పరిమితిని పెంచిన కేంద్రం

Agnipath Scheme (2)

Updated On : June 17, 2022 / 11:12 AM IST

age limit for recruitment under agnipath scheme increased : భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై భారత్ దేశ వ్యాప్తంగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిరసన కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వం ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. రోడ్లపై పెను విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ‘అగ్నిపథ్’ పథకం విషయంలో రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అగ్నిపథ్’ పథకం వయోపరిమితిని పెంచుతు నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా రెండో రోజు కూడా కొనసాగుతున్న నిరసన క్రమంలో ‘అగ్నిపథ్’ పథకం అభ్యర్థుల వయో పరిమితిని రెండేళ్లు పెంచింది.

తొలుత 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువకులు ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. తాజాగా గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే పెంచిన ఈ వయో పరిమితి ఈ సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతందని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఆర్మీలో కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అదే సమయంలో సాయుధ బలగాల్లోకి మున్ముందు మరింత మందిని తీసుకుంటామని..ప్రస్తుత నియామకాలను మూడు రెట్లు చేస్తామని కేంద్రం వెల్లడించింది.

ఈ ఏడాదికి గాను అగ్నిపథ్ పథకం కింద 46 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. వీళ్లను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో నాలుగేళ్ల పాటు నియమిస్తారు. అయితే, నాలుగేళ్ల తర్వాత వీరికి పెన్షన్ తో పాటు మాజీ సైనికులకు కల్పించే ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువతనుంచి తీవ్ర వ్యతిరేకలు కొనసాగుతున్నాయి.
యూపీ, బీహార్, హర్యానా, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్ లో ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు తెలంగాణకు కూడా పాకాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు రెచ్చిపోయారు. రైలు బోగీలకు నిప్పు పెట్టారు. పెను విధ్వంసం సృష్టించారు.